సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : మండలి ఎన్నికలకు నగారా మోగడంతో పంతుళ్ల పోరు రసవత్తరంగా మారుతోంది. పెద్దల సభలో అడుగు పెట్టేందుకు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయా సంఘాల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బరిలో నిలవాలని నిర్ణయించుకున్న నేతలు ప్రచారాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న పాటూరి సుధాకర్‌రెడ్డి పదవీకాలం ముగిసింది. ఈ స్థానానికి ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో బరిలో నిలవాలని భావిస్తున్న వారు తమ గెలుపు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
తాజా మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డికి టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. సుధాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్లు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు మండలి టీఆర్‌ఎస్ పార్టీ విప్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని కొందరు పీఆర్‌టీయూ రాష్ట్ర నాయకులు స్వాగతించారు. కానీ తమ యూనియన్ తరపున రఘోత్తంరెడ్డి బరిలో ఉంటారని పీఆర్‌టీయూ జిల్లా ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ యూనియన్ నేతలు గ్రామాల్లో తిరిగి పాఠశాలల ఉపాధ్యాయులను కలిసి ప్రచారం నిర్వహించారు. తర్వాత ఆ యూనియన్ నాయకులు ప్రచారం నిలిపివేశారు. దీంతో ఆ యూనియన్ సభ్యుల్లో అయోమయం నెలకొంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతిపెద్ద యూనియన్ అయిన పీఆర్‌టీయూలో ఈ అయోమయ పరిస్థితులు నెలకొనడం చర్చనీయాంశంగా మారింది.
పీఆర్‌టీయూ రెబల్‌గా..?
ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ బి మోహన్‌రెడ్డి కూడా బరిలో ఉంటారని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆయన పీఆర్‌టీయూ రెబల్ అభ్యర్థి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆ సంఘం వర్గాలు చెబుతున్నాయి. మోహన్‌రెడ్డి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. గత ఎన్నికల్లో కూడా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి పాతూరి సుధాకర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా ఆయన మళ్లీ బరిలోకి దిగాలని యోచిస్తున్నారు.
మొత్తం మీద సంఖ్యాపరంగా బలమైన పీఆర్‌టీయూ యూనియన్ సభ్యులు ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కాగా యూటీఎఫ్, టీపీటీఎఫ్ వంటి సంఘాల మద్దతుతో బి కొండల్‌రెడ్డి కూడా బరిలో దిగే యోచనలో ఉన్నారు. రెండు, మూడు నెలల నుంచే ఆయన తరపున ఆయా యూనియన్ల నాయకులు పాఠశాలలకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎస్టీయూ మద్దతుతో ఎం సుధాకర్‌రెడ్డి కూడా బరిలో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రెండో ప్రాధాన్యత ఓటూ ప్రధానమే..
ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు, ఒక్కోసారి రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా కీలకం కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను రెండో ప్రాధాన్యత ఓటు కూడా నిర్ణయించిన ఘటనలు ఉన్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో 22,488 మంది ఓటర్లు ఉన్నారు. అభ్యర్థికి పోలైన ఓట్లలో 50 శాతానికి మించి మొదటి ప్రాధాన్యత ఓట్లు పడాల్సి ఉంటుంది. ఏ అభ్యర్థికి 50 శాతం మొదటి ప్రా«ధాన్యత ఓట్లు పడని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని బరిలో నిలవాలని భావిస్తున్న నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment