సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. కొద్ది రోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనదైన శైలిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆశావహుల జాబితాలో లేని వారిని తెరపైకి తెచ్చి అందరినీ విస్మయానికి గురిచేశారు.
శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి వరుసగా రెండో పర్యాయం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. ఈ ఏడాది ఆగస్టులో గవర్నర్ కోటా కింద మంత్రివర్గం సిఫారసు చేసిన పాడి కౌశిక్‌రెడ్డి.. అభ్యర్థిత్వం ఆమోదం పొందక పోవడంతో ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేశారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌ను అనూహ్యంగానే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు.
సుమారు దశాబ్దంన్నర క్రితం పార్టీలో చేరిన ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావును ఎంపిక చేయడం ద్వారా గతంలో పలు సందర్భాల్లో ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకున్నారు. అలాగే సోమవారం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి కూడా అనూహ్యంగానే ఎమ్మెల్యే కోటాలో అవకాశం చేజిక్కించుకుని నామినేషన్ దాఖలు చేశారు.
చివరి నిమిషం వరకు గోప్యత
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుందనగా.. ఉదయం 10 గంటల వరకు అభ్యర్థుల జాబితాపై గోప్యత పాటించారు. చివరకు ఎంపికకు సంబంధించి అధికారికంగా ఎలాంటి జాబితా విడుదల చేయకుండా నేరుగా అభ్యర్థులకు మాత్రమే సమాచారం అందించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కళ్ల్లపల్లి రవీందర్‌రావు అభ్యర్థిత్వం సోమవారమే ఖరారు కాగా, మిగతా నాలుగు స్థానాలకు సంబంధించి సోమవారం అర్ధరాత్రి వరకు పార్టీ అధినేత కేసీఆర్ కసరత్తు చేశారు.
ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులందరూ మంగళవారం ఉదయం ప్రగతిభవన్‌కు చేరుకోగా, ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. అనంతరం అభ్యర్థులతో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకులుగా సంతకాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. వీరికి మద్దతుగా నామినేషన్ పత్రాలపై ఎమ్మెల్యేలు ఎవరూ సంతకాలు చేయకపోవడంతో స్క్రూటినీలో తిరస్కరణకు గురి కానున్నాయి. ఇతర పార్టీలేవీ బరిలో నిలవలేదు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ ఉండటంతో, బుధవారం నామినేషన్ల పరిశీలన ముగిసిన తర్వాత పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశముంది.
రెడ్డి సామాజికవర్గానికి పెద్దపీట
ఆరుగురిలో ముగ్గురు రెడ్డి సామాజికవర్గానికి, మరొకరు వెలమ (తక్కల్లపల్లి) సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం కాగా, బండా ప్రకాశ్ ముదిరాజ్ బీసీ, కడియం శ్రీహరి ఎస్సీ సామాజికవర్గం నుంచి ఎంపికయ్యారు. ఆరు స్థానాలకు గాను రెడ్లు, బీసీలకు రెండు చొప్పున, వెలమ, ఎస్సీ కేటగిరీలో ఒకటి చొప్పున అవకాశం దక్కుతుందని తొలుత అంచనా వేశారు. అయితే రెడ్డి సామాజికవర్గం నుంచి ముగ్గురికి అవకాశం దక్కడంతో బీసీ సామాజికవర్గానికి చెందిన ఆశావహులపై ప్రభావం చూపింది.
సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు పద్మశాలి సామాజికవర్గం నుంచి ఎల్.రమణ, విశ్వ బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారికి అవకాశం దక్కుతుందని భావించారు. బీసీ కేటగిరీలో మున్నూరు కాపు కులానికి చెందిన ఆకుల లలిత, పీఎల్ శ్రీనివాస్ కూడా సీటు ఆశించారు. కానీ వీరికి అవకాశం లభించలేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎంసీ కోటిరెడ్డి కూడా ఆశావహుల జాబితాలో ఉన్నా ఎంపిక కాలేదు. అయితే మధుసూధనాచారిని గవర్నర్ కోటాలో, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను స్థానిక సంస్థల (మెదక్) కోటాలో ఎంపిక చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలపై నేడు కాంగ్రెస్ నిర్ణయం
చివరి వరకు ఎదురుచూపులే!
Comments
Please login to add a commentAdd a comment