‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి  | KCR Announced TRS MLC Candidate Warangal | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి 

Published Mon, May 13 2019 11:17 AM | Last Updated on Mon, May 13 2019 11:17 AM

KCR Announced TRS MLC Candidate Warangal - Sakshi

శ్రీనివాసరెడ్డి 

 సాక్షిప్రతినిధి, వరంగల్‌: ‘స్థానిక’ సంస్థల వరంగల్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి(వరికోలు) శ్రీనివాస్‌రెడ్డికే అవకాశం దక్కింది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను ఆదివారం ప్రకటించిన కేసీఆర్‌.. వరంగల్‌కు శ్రీనివాస్‌రెడ్డి పేరును కూడా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచి ‘పోచంపల్లి’ పేరే ప్రచారంలో ఉంది. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షు డు తక్కళ్లపెల్లి రవిందర్‌ సైతం తనవంతు ప్రయత్నం చేశారు.

అయితే టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌  ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌లకు క్లాస్‌మేట్‌గా వారితో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు కలిగిన శ్రీనివాస్‌రెడ్డి మొదటి నుంచి కేసీఆర్‌ కుటుంబానికి విధేయుడు, విశ్వసనీయ వ్యక్తిగా ఉన్నారు. దీంతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపిన కేసీఆర్‌ శ్రీనివాస్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. పాత వరంగల్‌ జిల్లాలోని పరకాల మండలం వరికోలు గ్రామానికి చెందిన ఒక సాధారణ కుటుంబం నుంచి ఎదిగిన శ్రీనివాస్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

‘పోచంపల్లి’ నేపథ్యం ఇదీ..
పాత వరంగల్‌ జిల్లాలోని పరకాల మండలం వరికోలు గ్రామానికి చెందిన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు వరికోలు ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల, 8 నుంచి 10వ తరగతి వరకు పరకాల సీఎస్‌ఐ మిషన్‌ హైస్కూల్‌లో విద్యనభ్యసించారు. ఇంటర్మీడిఝెట్‌(1992–1994) హన్మకొండలోని నాగార్జున ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీ, డిగ్రీ హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో బీకాం(1994–1996) చేశారు. ఎంబీఏ పుణేలోని వీ.కె పటేల్‌ ఫౌండేషన్‌ కళాశాలలో జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి చదివిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖరారు చేసింది. ఆయన 2001 సంవత్సరం నుంచి టీఆర్‌ఎస్‌లో ఒక కార్యకర్తగా పనిచేస్తూ ప్రతి పనిని చేసుకుంటూ వచ్చారు.

డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కేటీఆర్‌ రోడ్‌ షోలకు ఇన్‌చార్జిగా ఉండి కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు. మొన్న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల కోసం మూడు పార్లమెంట్‌ నియోజవర్గాల్లో కేటీఆర్‌ రోడ్‌ షోలకు ఇన్‌చార్జిగా వ్యవహించి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, జూబ్లీ హిల్స్, గోశామహల్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు 
ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.

బయోడేటా..

  • పేరు : పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
  • పుట్టిన తేదీ : ఏప్రిల్‌ 15, 1973
  • భార్య : మమత రెడ్డి
  • కూతురు : అశ్రితరెడ్డి
  • తండ్రి : జనార్దన్‌రెడ్డి
  • తల్లి : సమ్మక్క
  • తోబుట్టువులు : ఇద్దరు అక్కలు, ఒక చెల్లి,పెద్దక్క నల్ల స్వరూపరాణిరెడ్డి(47 డివిజన్‌ కార్పొరేటర్‌), బావ : సుధాకర్‌రెడ్డి రిటైర్డ్‌ ఇంజినీర్, రెండో అక్క పోరెడ్డి విజయనిర్మల (గహిణి), బావః పోరెడ్డి వాసుదేవరెడ్డి గవర్నమెంట్‌ హాస్పిటల్‌ కౌన్సిలర్, ములుగు


విద్యాభ్యాసం.. 

  •      ఒకటి నుంచి 7వ తరగతి వరకు వరికోలు ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల
  •      8 నుంచి 10వ తరగతి వరకు సీఎస్‌ఐ మిషన్‌ హైస్కూల్, పరకాల
  •      ఇంటర్మీడిఝెట్‌ 1992–94 సంవత్సరం హన్మకొండలోని నాగార్జున ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీ
  •      డిగ్రీ హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో బీకాం(1994–96)
  •      ఎంబీఏ పుణేలోని వి.కె పటేల్‌ ఫౌండేషన్‌ కళాశాల
  •      2001 సంవత్సరం నుంచి టీఆర్‌ఎస్‌లో కార్యకర్తగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఉంటూ వారిని జైలు నుంచి బయటకు తీసుకావడంలో కీలక పాత్ర షోషించారు. విద్యార్థులతో కలిసి ఉద్యమంలో పని చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement