సాక్షి, వరంగల్: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూచనతోనే కిషన్ రెడ్డి మూసీ నిద్రకు సిద్ధమయ్యారని విమర్శించారు. నిధులు తేలేని బీజేపీ నేతలు మూసీ వద్దకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. మూసీ కాలువ వాసన చూసిన తర్వాతైనా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలని కోరారు. కేంద్రం నుంచి రూపాయి తీసుకొచ్చే శక్తి లేని ఆయన.. తన మొద్దు నిద్ర వీడాలని సూచించారు.
కిషన్ రెడ్డి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని, ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఎలా పాస్ అయిందో మీకు తెలియదా? అని నిలదీశారు. కలెక్టర్‌ను కొట్టిన వారిని సమర్థిస్తున్న మీరు కేంద్రమంత్రి పదవికి అర్హులేనా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఐఏఎస్‌పైన దాడి జరిగితే ఖండించకపోగా సమర్థించడం బాధాకరమని పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారులను కొట్టిన వాళ్లు, కొట్టించిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ దాడి ఘటనపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఏం చేశారో చెప్పాలన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment