టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు.. సగం కొత్తవారికే..! | TRS Local Bodies MLC Candidate List Finalized | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల్లో ఆరుగురు సిట్టింగ్‌లకు టీఆర్‌ఎస్‌ నో! 

Published Mon, Nov 22 2021 1:21 AM | Last Updated on Mon, Nov 22 2021 1:21 AM

TRS Local Bodies MLC Candidate List Finalized - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఆరుగురు కొత్తవారికి టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అవకాశమిచ్చారు. మరో ఆరుగురు పాతవారిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. సామాజిక, కుల సమీకరణాలు, తాను ఇచ్చిన హామీలు, మంత్రుల అభిప్రాయాలు, పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు తదితర అంశాల ప్రాతిపదికగా 12 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి.

ఈ మేరకు నామినేషన్లు సిద్ధం చేసుకోవాలని ఒక్కొక్కరుగా అభ్యర్థులకు సమాచారం అందింది. కేసీఆర్‌ ఈ బాధ్యతలను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావుకు అప్పగించి ఢిల్లీ వెళ్లగా.. హరీశ్‌రావు అభ్యర్థులకు ఫోన్లు చేసి సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. అధికారికంగా అభ్యర్థుల జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్టు సమాచారం. 

అన్నింటినీ బేరీజు వేశాకే.. 
‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక, కుల సమీకరణాలను బేరీజు వేసుకున్నాకే కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ భవన్‌ వర్గాలు చెప్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో ఐదుగురే పాతవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్‌), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్‌), టి.భానుప్రసాదరావు (కరీంనగర్‌) ఉన్నారని.. వారు మరోమారు స్థానిక కోటాలో పోటీలో ఉంటారని సమాచారం.

నిజామాబాద్‌ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత.. ఈసారి పోటీకి అనాసక్తిగా ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఆమె వద్దనుకుంటే ఎమ్మెల్యే కోటాలో రిటైరైన ఆకుల లలితకు స్థానిక కోటాలో అవకాశం ఇవ్వనున్నట్టు తెలిసింది. కవిత పోటీకి దిగితే మాత్రం ఆరుగురు సిట్టింగ్‌లకు అవకాశం ఇచ్చినట్టవుతుంది. అయితే ఆకుల లలిత అభ్యర్థిత్వమే ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీవర్గాలు చెప్తున్నాయి.

కొత్తగా అవకాశం వచ్చిన జాబితాలో గాయకుడు సాయిచంద్‌ (మహబూబ్‌నగర్‌), ఎల్‌.రమణ (కరీంనగర్‌), ఎంసీ కోటిరెడ్డి (నల్లగొండ), దండె విఠల్‌ (ఆదిలాబాద్‌), తాతా మధు (ఖమ్మం), డాక్టర్‌ యాదవరెడ్డి (మెదక్‌) ఉన్నారు. ఈ మేరకు ఎన్నికలు జరగనున్న తొమ్మిది జిల్లాల మంత్రులతో కేసీఆర్‌ సమావేశమై స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. 

చేజారనివ్వొద్దు.. 
ఎన్నికలు జరగనున్న 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ బలం ఉందని.. ఓటర్లు చేజారకుండా నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించినట్టు సమాచారం. అవసరమైన చోట క్యాంపులు ఏర్పాటు చేయడం సహా ఇతర జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఈ నెల 23వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో నామినేషన్లు సిద్ధం చేసుకునేలా అభ్యర్థులకు సూచనలు ఇవ్వాలని పేర్కొన్నట్టు సమాచారం.

ఈ మేరకు మంత్రులతోపాటు, పార్టీపక్షాన మంత్రి హరీశ్‌రావు సదరు అభ్యర్థులకు ఫోన్‌చేసిన సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. అభ్యర్థిత్వం ఖరారైన నేతలు సోమ లేదా మంగళవారాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తమకు పార్టీపరంగా సమాచారం అందిందని, నామినేషన్లకు సిద్ధమవుతున్నామని కొందరు అభ్యర్థులు ‘సాక్షి’కి ధ్రువీకరించారు. 

హామీలు, సాన్నిహిత్యంతో.. 

  • శాసన మండలిలో పద్మశాలి సామాజికవర్గానికి అవకాశమిస్తామనే సీఎం హామీ మేరకు ఎల్‌.రమణకు అవకాశం వచ్చింది. 
  • నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఎంసీ కోటిరెడ్డికి.. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ యాదవరెడ్డికి జాబితాలో చోటు దక్కింది. 
  • గతంలో సనత్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దండె విఠల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన స్వస్థలం సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ కావడంతో ప్రస్తుతం ఆదిలాబాద్‌ ‘స్థానిక’ కోటా అభ్యర్థిగా ఎంపిక చేశారు. 
  • ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో సాన్నిహిత్యంతోపాటు చాలాకాలంగా టీఆర్‌ఎస్‌లో కొనసాగుతుండటంతో తాతా మధుకు ఖమ్మం అభ్యర్థిత్వం దక్కినట్టు చెప్తున్నారు. 
  • ఉద్యమ సమయం నుంచి సాంస్కృతిక విభాగంలో క్రియాశీలకంగా ఉన్న సాయిచంద్‌కు ఎమ్మెల్సీగా కేసీఆర్‌ అవకాశం ఇచ్చారు. 

12 మంది ‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఏడుగురు ఓసీలు, నలుగురు బీసీలు, ఒక 
ఎస్సీ సామాజికవర్గ అభ్యర్థికి ప్రాతినిధ్యం లభించింది. అభ్యర్థుల వారీగా చూస్తే.. పట్నం మహేందర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, డాక్టర్‌ యాదవరెడ్డి (రెడ్డి), భానుప్రసాద్‌రావు (వెలమ), తాతా మధు (కమ్మ) ఓసీ కేటగిరీలో ఉన్నారు. బీసీ కేటగిరీలో శంభీపూర్‌ రాజు, ఆకుల లలిత, దండె విఠల్‌ (మున్నూరు కాపు), ఎల్‌.రమణ (పద్మశాలి) అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. ఎస్సీ (మాల) కేటగిరీలో సాయిచంద్‌ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. 

సిట్టింగ్‌లు
రంగారెడ్డి: శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్‌రెడ్డి 
వరంగల్‌:  పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి 
కరీంనగర్‌: భానుప్రసాదరావు
మహబూబ్‌నగర్‌: కసిరెడ్డి నారాయణరెడ్డి 

కొత్తవారు
ఎల్‌.రమణ,
సాయిచంద్,
దండె విఠల్,
కోటిరెడ్డి,
యాదవరెడ్డి,
తాతా మధు.

మళ్లీ పోటీకి అవకాశం దక్కనివారు
నారదాసు లక్ష్మణరావు (కరీంనగర్‌), కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), పురాణం సతీశ్‌ (ఆదిలాబాద్‌), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), వి.భూపాల్‌రెడ్డి (మెదక్‌) ఉన్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ దూరం 
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయకూడదని బీజేపీ నిర్ణయించుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదివారం రాత్రి పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జిలతో ఈ విషయమై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో పార్టీకి తగినంత బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే బీజేపీ స్ధానిక సంస్థల ప్రతినిధులు ఏ పార్టీకి మద్దతు ఇవ్వరాదని, ఒకవేళ స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా మద్దతు కోరితే ఆలోచించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement