YSRCP Unanimous In Five Of 9 Local Body Constituencies Andhra Pradesh - Sakshi
Sakshi News home page

AP: ‘ఎమ్మెల్సీ’లోనూ  ఏకగ్రీవాలు

Published Sat, Feb 25 2023 4:20 AM | Last Updated on Sat, Feb 25 2023 10:02 AM

YSRCP unanimous in five of 9 local body constituencies Andhra Pradesh - Sakshi

సాక్షి అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌ : రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవ విజయాలు నమోదు చేస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో 9 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, వీటిలో 5 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించనున్నారు.

వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మాత్రమే రంగంలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఉంది. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తారు.  

వైఎస్సార్‌ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు నిలబెట్టిన స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ పత్రాల్లో బలపరిచిన వారి సంతకాలు ఫోర్జరీవని తేలడంతో ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు.

అనంతపురం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి వేలూరు రంగయ్య నామినేషన్‌ను అధికారులు స్క్రూటినీలో తిరస్కరించారు. దీంతో ఈ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎస్‌.మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిపాయి సుబ్రహ్మణ్యం ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేరిగ మురళి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్‌ అభ్యర్థిత్వాన్ని తాను బలపరచలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని సూళ్లూరుపేట కౌన్సిలర్‌ చెంగమ్మ రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు.

ఇక్కడ మురళి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కుడుపూడి సూర్యనారాయణరావు ఎన్నిక లాంఛనమే కానుంది. టీడీపీకి చెందిన కడలి శ్రీదుర్గ, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను సాంకేతిక కారణాలతో అధికారులు తిరస్కరించారు. బరిలో కుడుపూడి సూర్యనారాయణరావు మాత్రమే ఉన్నారు. 

శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల పరిశీలన పూర్తయ్యింది. వైఎస్సార్‌సీపీ తరఫున నర్తు రామారావు, ఇండిపెండెంట్‌గా ఆనెపు రామకృష్ణ బరిలో ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు రెండింటిలో మొత్తం 8 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఏడుగురు బరిలో ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురు బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థి నల్లి రాజేష్‌ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఇక్కడ మొత్తం నలుగురు నామినేషన్లు దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థి కుమ్మరి శ్రీనివాసులు నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎ.మధుసూదన్, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో మిగిలారు.  

పట్టభద్రుల నియోజకవర్గాలకు భారీగా నామినేషన్లు 
మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు 137 నామినేషన్లు, రెండు టీచర్ల నియోజకవర్గాలకు 25 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కడప–అనంతపురం–కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గానికి అత్యధికంగా 63 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 12 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 51 మంది బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గం బరిలో వైఎస్సార్‌సీపీ నుంచి వెన్నపూస రవీంద్ర రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి, భూమిరెడ్డి ఉమాదేవి, బీజేపీ నుంచి రాఘవేంద్ర నగరూరు సహా పలువురు ఉన్నారు.

శ్రీకాకుళం–విజయనగరం–విశాఖ పట్టభద్రుల నియోజకవర్గంలో 44 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ నుంచి సీతంరాజు సుధాకర్, టీడీపీ నుంచి వేపాడ చిరంజీవిరావు, గుణూరు మల్లునాయుడు, బీజేపీ నుంచి పీవీఎన్‌ మాధవ్‌ తదితరులు నామినేషన్లు వేశారు. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గానికి 30 నామినేషన్లు దాఖలయ్యాయి.

వీటలో ఏడింటిని అధికారులు తిరస్కరించారు. వైఎస్సార్‌సీపీ నుంచి పేర్నేటి శ్యాంప్రసాద్‌ రెడ్డి, పేర్నేటి హేమ సుస్మిత, టీడీపీ నుంచి కంచర్ల శ్రీకాంత్‌ చౌదరి, అవిల్నేని సరిత, బీజేపీ నుంచి సన్నారెడ్డి దయాకర్‌ రెడ్డి తదితరులు బరిలో ఉన్నారు.  

టీచర్ల నియోజకవర్గాలకు బరిలో 22 మంది 
పార్టీలకు అతీతంగా జరిగే రెండు టీచర్ల నియోజకవర్గాలకు మొత్తం 25 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు నియోజకవర్గానికి 8 నామినేషన్లు దాఖలవగా అన్నీ ఆమోదం పొందాయి. కడప–అనంతపురం–కర్నూలుకు 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ముగ్గురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.

నామినేషన్ల పరిశీలన అనంతరం మొత్తం 22 మంది బరిలో ఉన్నారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం నికరంగా ఎంతమంది బరిలో ఉన్నారన్న విషయంపై స్పష్టత వస్తుంది. ఏకగ్రీవం కాని స్థానిక సంస్థలు, పట్టభద్రులు, టీచర్ల స్థానాలకు మార్చి13న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. మార్చి16న ఓట్లు లెక్కించి, విజేతలను ప్రకటిస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement