సూర్యాపేటలో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్
సాక్షి, హైదరాబాద్ : వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 2,799 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల కోసం రంగారెడ్డిలో 8, వరంగల్‌లో 10, నల్లగొండలో 7 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్‌రెడ్డి సూర్యాపేట పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సరళిని పరిశీలించారు.
2016లో జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా పట్నం నరేందర్‌రెడ్డి, వరంగల్ నుంచి కొండా మురళి, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు గెలిచారు. గత శాసనసభ ఎన్నికల్లో నరేందర్‌రెడ్డి కొడంగల్ నుంచి, రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. కొండా మురళి వ్యక్తిగత కారణాలతో రాజీనామా సమర్పించడంతో తాజాగా వీటికి ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
కాగా, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డి(టీఆర్‌ఎస్), కోమరి ప్రతాప్‌రెడ్డి(కాంగ్రెస్), నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి (టీఆర్‌ఎస్), కోమటిరెడ్డి లక్ష్మీ(కాంగ్రెస్), వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ( టీఆర్‌ఎస్), ఎంగా వెంకట్రామ్‌రెడ్డి(కాంగ్రెస్) ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఈ ఎన్నిల ఫలితాలను జూన్ 3వ తేదీన ప్రకటించనున్నారు.
నల్లగొండలో హోరాహోరి..
ఉమ్మడి జిల్లాలోని 1086 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగిచుకోనున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. ఇప్పటివరకు రహస్య ప్రాంతాల్లో ఉన్న ఇరు పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment