సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు గతంతో పోల్చితే అప్పుడూ ఇప్పుడూ ఒకేలా నమోదవుతున్నా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తాను చెప్పేవరకు ప్రకటించవద్దని కలెక్టర్లను ఆదేశించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రం మొత్తం చూసినా, జిల్లాలవారీగా చూసినా 2013 పంచాయతీ ఎన్నికల మాదిరిగానే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఇప్పుడూ ఏకగ్రీవాలు ఉన్నాయి. అయినా ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవమైన పంచాయతీల సంఖ్య ఎక్కువగా ఉందని, అధికారికంగా ప్రకటించరాదని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా చూసినా..
రాష్ట్రవ్యాప్తంగా చూసినా 2013లో 13 జిల్లాల పరిధిలో 12,740 పంచాయతీల్లో 1,980 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 15.54 శాతం పంచాయతీలు అప్పట్లో ఏకగ్రీవమయ్యాయి. ఇప్పుడు తొలివిడత ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా 16 శాతం గ్రామ పంచాయతీల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. 2013లో 33.27 శాతం వార్డులు ఏకగ్రీవం కాగా ఇప్పుడు తొలి విడతలో 37 శాతం ఏకగ్రీవమయ్యాయి. 2013లో సర్పంచి పదవికి సరాసరిన ఆరుగురు చొప్పున నామినేషన్లు దాఖలు చేయగా ఇప్పుడు తొలి విడతలో కూడా అదే రీతిన ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఆ నినాదం వెనుకబడిందంటూనే..
పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలపై నిమ్మగడ్డ ఆది నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. గ్రామస్తులంతా ఐకమత్యంగా సాగేందుకు ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం పెంచితే అధికారులకు ఎస్‌ఈసీ సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. ఏకగ్రీవాల నినాదం పూర్తిగా వెనుకబడిపోయిందని ఇటీవల వ్యాఖ్యానించారు. తాజాగా వాటి సంఖ్య ఎక్కువగా ఉందంటూ ఫలితాల ప్రకటనను నిలిపివేస్తూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ఆ రెండు జిల్లాల్లో ఇలా..
ఉమ్మడి రాష్ట్రంలో 2013లో చిత్తూరు జిల్లాలో మొత్తం 1,357 గ్రామ పంచాయతీల్లో 293 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 21.59 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పుడు తొలివిడతలో ఆ జిల్లాలో 454 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా 112 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 24.67 శాతం గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు జిల్లాలో 1,010 గ్రామ పంచాయతీలు ఉండగా 2013లో 162 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 16.03 శాతం పంచాయతీలు అప్పట్లో ఏకగ్రీవంగా ముగిశాయి. అదే జిల్లాలో ఇప్పుడు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో 337 పంచాయతీలకుగాను 67 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో 19.88 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment