సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపులో ఎక్కడెక్కడ రీ కౌంటింగ్ జరిగింది? ఎందుకు నిర్వహించారు? తదితర అంశాలపై తనకు పూర్తి వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎన్నికలు జరిగిన ప్రతి చోట కౌంటింగ్ ప్రక్రియపై పూర్తి వివరాలతో పంచాయతీలవారీగా నివేదికలు అందజేయాలని కూడా ఆయన ఇప్పటికే ఆదేశించినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
5లోగా నివేదిక ఇవ్వాలి
ఓట్ల లెక్కింపు ఎన్ని గంటలకు మొదలైంది..? లెక్కింపు సమయంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిందా? కరెంటు సరఫరా ఎందుకు నిలిచిపోయింది? కౌంటింగ్ పూర్తయ్యాక ఓడిపోయిన అభ్యర్ధి ఏజెంట్ల నుంచి సంతకాలు తీసుకున్నారా? తదితర వివరాలు పంచాయతీల వారీగా స్పష్టంగా ఉండాలని పేర్కొంటూ నిర్ణీత ఫార్మాట్‌ను నిమ్మగడ్డ తాజాగా పంచాయతీరాజ్ శాఖకు పంపారు. ప్రతి పంచాయతీకి సంబంధించిన నివేదికలను ఈనెల 5లోగా పంపాలని పేర్కొన్నారు.
ఎలా సాధ్యం?
పంచాయతీల వారీగా రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు పంపే నివేదికలపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వేర్వేరుగా తమ అభిప్రాయాలను జోడించి ఎన్నికల కమిషన్‌కు పంపాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏకగ్రీవాలు కాకుండా 10,890 పంచాయతీల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగిందని, భారీగా ఉన్న పంచాయతీలపై కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఏ ప్రాతిపదికన విడివిడిగా అభిప్రాయాలు వెల్లడించాలనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా మూడు రోజుల వ్యవధిలోనే ఒక్కో పంచాయతీలో రిటర్నింగ్ అధికారి నుంచి ఎంపీడీవోకు, అక్కడ నుంచి డీపీవో, జిల్లా కలెక్టర్లకు నివేదికలు అందడం, పరిశీలన జరిపి అభిప్రాయాలు తెలియచేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు అధికారుల్లో ఉత్పన్నమవుతున్నాయి.
వివాదాలన్నీ ట్రిబ్యునల్‌లోనే..
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ పది రోజుల క్రితమే ముగిసింది. గెలిచిన సర్పంచి అభ్యర్ధులు, వార్డు సభ్యులకు రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ గెలుపు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలపై ఎలాంటి వివాదాలున్నా ఎన్నికల ట్రిబ్యునల్‌లోనే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని, ముగిసిన ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం ఉండదని పేర్కొంటున్నారు. ఇదంతా గందరగోళానికి గురి చేసేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పంచాయతీ రీ కౌంటింగ్‌పై ఈసీ మరో కీలక ఉత్తర్వు
Published Wed, Mar 3 2021 3:59 AM | Last Updated on Wed, Mar 3 2021 11:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment