
సాక్షి, అమరావతి: తనను ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలంటూ రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషనర్ ఉత్తర్వుల అమలును నిలిపేయాలని కోర్టును కోరారు. ఈ చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఆదివారం ఉదయం విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి.
స్పీకర్‌కు రాసిన లేఖకు ఇది ప్రతి చర్య
► స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ రమేష్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. గత నెల 28న రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాసిన నిమ్మగడ్డ అందులో నాపై పలు తప్పుడు ఆరోపణలు చేశారు.
► ఈ నేపథ్యంలో గత నెల 30న నేను అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాసి, సభా హక్కుల ఉల్లంఘన కింద నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని కోరాను. ఇది నిమ్మగడ్డ రమేష్‌కు ఎంత మాత్రం నచ్చలేదు.
► దీంతో తిరుపతిలో ఈ నెల 5న నేను మాట్లాడిన మాటలను నిమ్మగడ్డ వక్రీకరించారు. ఈ ఉత్తర్వులు జారీ చేసే ముందు నాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఎలాంటి వివరణ కోరలేదు. ఇలా చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం.
► ప్రొటోకాల్ ప్రకారం ఈ నెల 7న తిరుపతిలో నేను రాష్ట్రపతిని ఆహ్వానించాల్సి ఉంది. అయితే నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వుల వల్ల నేను స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా పోయింది. ఈ దృష్ట్యా ఎస్‌ఈసీ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి.