
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే మీడియాతో మాట్లాడవద్దంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్ని సవాలు చేస్తూ పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేసిన అప్పీలుపై బుధవారం ఉత్తర్వులిస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. మంగళవారం కోర్టు సమయం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట పెద్దిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కమిషన్ ప్రతిష్టను ఎవరూ దిగజార్చట్లేదని, ప్రస్తుత ఎన్నికల కమిషనరే స్వయంగా కమిషన్ ప్రతిష్టను దిగజారుస్తున్నారని నివేదించారు.
నిబంధనలకు విరుద్ధంగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను నిలిపేయాలంటూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులిచ్చారని, ఈ ఆదేశాల్ని మంత్రి తప్పుపట్టారని, నిబంధనల ప్రకారం నడుచుకోవాలని రిటర్నింగ్ అధికారులకు చెప్పారని, ఇది ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం ఎలా అవుతుందని ప్రశ్నించారు. మంత్రిగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం రాజ్యాంగమిచ్చిన హక్కని, దీన్ని అడ్డుకునేలా సింగిల్ జడ్జి ఉత్తర్వులున్నాయని తెలిపారు.
ఎన్నికల కమిషనర్ గురించి వ్యక్తిగతం మాట్లాడబోమని స్పష్టంగా చెప్పినా సింగిల్‌జడ్జి మీడియా, ప్రెస్‌తో మాట్లాడకుండా ఉత్తర్వులిచ్చారన్నారు. ఎన్నికల కమిషన్ తరఫున బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ పదవిలో ఉన్న మంత్రి రాజ్యాంగ విధులను నిర్వర్తిస్తున్న రిటర్నింగ్ అధికారులను బెదిరించడం ఎంతవరకు సబబన్నారు. రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలపై నివేదిక ఇచ్చాక ప్రకటించవచ్చని కమిషనర్ చెప్పారే తప్ప, ఏకగ్రీవాలను ఆపేయాలని చెప్పలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. కోర్టు సమయం ముగియడంతో బుధవారం తగిన ఉత్తర్వులిస్తామని పేర్కొంది.