టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా పగ్గాలు
ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్రస్టీలు
నియామకం తక్షణం అమల్లోకి...
ముంబై: అంతా ఊహించినట్లే టాటా ట్రస్ట్స్ పగ్గాలు రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా (67) చేతికే లభించాయి. టాటా ట్రస్ట్స్‌తో పాటు అందులో భాగమైన మిగతా ట్రస్ట్‌లన్నింటికి కూడా చైర్మన్‌గా ట్రస్టీలు శుక్రవారం జరిగిన సమావేశంలో నోయెల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టాటా గ్రూప్‌తో పాటు జాతి నిర్మాణంలోనూ దివంగత రతన్ టాటా కీలక పాత్ర పోషించారని, ఎనలేని సేవలందించారని ట్రస్టీలు నివాళులరి్పంచారు.
టాటా ట్రస్ట్స్ ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించింది. నోయెల్ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ‘రతన్ టాటా, అలాగే టాటా గ్రూప్ వ్యవస్థాపకులు అందించిన ఘన వారసత్వాన్ని ఇకపైనా కొనసాగిస్తాము. అభివృద్ధి, దాతృత్వ కార్యకలాపాలను కొనసాగిస్తూ జాతి నిర్మాణంలో మా వంతు పాత్రను పోషించడానికి పునరంకితమవుతాము‘ అని ఈ సందర్భంగా నోయెల్ తెలిపారు.
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వారసుడిని ఎన్నుకునేందుకు టాటా ట్రస్ట్స్ ట్రస్టీలు సమావేశమయ్యారు. 165 బిలియన్ డాలర్ల టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం పరోక్షంగా టాటా ట్రస్ట్స్ నియంత్రణలో ఉంటుంది. టాటా ట్రస్ట్స్ కింద సర్ రతన్ టాటా ట్రస్ట్ .. దాని అనుబంధ ట్రస్టులు, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్.. దాని అనుబంధ ట్రస్ట్‌లు ఉన్నాయి. వీటన్నింటికి టాటా గ్రూప్ కంపెనీలకు హోల్డింగ్ సంస్థ, ప్రమోటర్ అయిన టాటా సన్స్‌లో 66 శాతం వాటాలు ఉన్నాయి. ఇప్పటివరకు రతన్ టాటా నీడలో ఉన్న నోయెల్ టాటా ఇకపై సొంతంగా వీటి బాధ్యతలను చేపట్టనున్నారు.
ముగ్గురు సంతానం..
టాటా సన్స్‌లో 18.4 శాతం వాటా ఉన్న షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన ఆలూ మిస్త్రీని నోయెల్ వివాహం చేసుకున్నారు. ఆమె టాటా సన్స్ మాజీ చైర్మన్, దివంగత సైరస్ మిస్త్రీ సోదరి. నోయెల్, ఆలూకి ఇద్దరు కుమార్తెలు (లియా, మాయా), ఒక కుమారుడు (నెవిల్) ఉన్నారు. పెద్ద కుమార్తె లియా టాటా ప్రస్తుతం ఇండియన్ హోటల్స్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. చిన్న కుమార్తె మాయా తన ప్రొఫెషనల్ కెరియర్‌ను టాటా ఆపర్చూనిటీస్ ఫండ్‌తో ప్రారంభించారు. తర్వాత టాటా డిజిటల్‌కి మారారు. టాటా న్యూ యాప్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. నెవిల్ టాటా తన వ్యాపార నైపుణ్యాలతో జుడియో బ్రాండ్‌ను విజయవంతం చేశారు. ట్రెంట్, స్టార్ బజార్‌లను పర్యవేక్షిస్తున్నారు. వ్యాపార దిగ్గజం విక్రమ్ కిర్లోస్కర్ కుమార్తె మానసి కిర్లోస్కర్‌ను వివాహం చేసుకున్నారు.
నాలుగు దశాబ్దాలుగా టాటా గ్రూప్‌లో...
ఐరిష్ పౌరసత్వం ఉన్న నోయెల్ టాటా గత నాలుగు దశాబ్దాలుగా టాటా గ్రూప్‌లో ఉన్నారు. ఆయన అంతగా బైటికి కనిపించరు. రతన్ టాటా తండ్రి నావల్ టాటాకు సూనూ, సిమోన్ అని ఇద్దరు భార్యలు. వారిలో సూనూ టాటా కుమారులు రతన్ టాటా, జిమ్మీ టాటా కాగా మరో భార్య సిమోన్ కుమారుడే నోయెల్ టాటా. ఆయన ససెక్స్ యూనివర్సిటీలో (యూకే) గ్రాడ్యుయేషన్ చేశారు. ఇన్సీడ్‌లో (ఫ్రాన్స్) ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం చేశారు.
టాటా ఇంటర్నేషనల్‌లో కెరియర్ ప్రారంభించిన నోయెల్ 1999లో రిటైల్ వ్యాపారం ట్రెంట్‌కి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటికి ఒకటే స్టోర్ ఉన్న ట్రెంట్ .. ఆయన సారథ్యంలోకి వచ్చాక గణనీయంగా వృద్ధి చెంది 700 పైచిలుకు స్టోర్స్‌కి విస్తరించింది. ముఖ్యంగా వెస్ట్‌సైడ్ రిటైల్ చెయిన్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఇది మరింత వేగవంతమైంది.
2003లో వోల్టాస్, టైటాన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. టాటా ఇంటర్నేషనల్ ఆయన సారథ్యంలో 500 మిలియన్ డాలర్ల టర్నోవర్ నుండి 3 బిలియన్ డాలర్ల స్థాయి కి ఎదిగింది. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, వోల్టాస్ అండ్ టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్లకు చైర్మన్‌గా, టాటా స్టీల్, టైటాన్‌లకు వైస్ చైర్మన్‌గా నోయెల్ వ్యవహరిస్తున్నారు. అలాగే 2019 నుంచి టాటా ట్రస్టుల్లో ట్రస్టీగా కూడా ఉన్నారు. స్మిత్స్ పీఎల్‌సీ, కాన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ కంపెనీల బోర్డుల్లోనూ నోయెల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment