Tata trusts
-
టాటా ట్రస్టుల కీలక నిర్ణయం!
రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్టుల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘మింట్’ కథనం ప్రకారం.. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌లలో నిర్ధిష్ట-కాల పరిమితి నియామకాల వ్యవస్థకు ముగింపు పలికారు. అంటే ట్రస్టీలు శాశ్వత సభ్యులుగా మారుతారు.గురువారం జరిగిన రెండు ట్రస్టుల బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తా నివేదిక పేర్కొంది. ఈ మార్పు తర్వాత ఇకపై బోర్డు సభ్యులు తామంతట తాము రాజీనామా చేసేంత వరకు కొనసాగుతారు. అదే సమయంలో కొత్త సభ్యుల నియామకానికి ఇకపై బోర్డు ఏకగ్రీవ సమ్మతి కావాల్సి ఉంటుంది. అక్టోబర్ 11న టాటా ట్రస్ట్‌లకు అధిపతిగా నోయెల్ టాటా నియమితులైన తర్వాత ట్రస్టులు నిర్వహించిన రెండో బోర్డు సమావేశం ఇది.ఇదీ చదవండి: టీసీఎస్.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా?రెండు ట్రస్టులు సమిష్టిగా టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో సగానికి పైగా వాటాలను కలిగి ఉన్నాయి. టాటా గ్రూప్ తరఫున అన్ని దాతృత్వ కార్యకలాపాలను ఈ రెండు ట్రస్టుల ద్వారానే నిర్వహిస్తున్నారు. నివేదిక ప్రకారం.. టాటా సన్స్‌లో సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు 27.98 శాతం, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 23.56 శాతం వాటాలు ఉన్నాయి. -
రతన్ వారసుడు నోయెల్
ముంబై: అంతా ఊహించినట్లే టాటా ట్రస్ట్స్ పగ్గాలు రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా (67) చేతికే లభించాయి. టాటా ట్రస్ట్స్‌తో పాటు అందులో భాగమైన మిగతా ట్రస్ట్లన్నింటికి కూడా చైర్మన్‌గా ట్రస్టీలు శుక్రవారం జరిగిన సమావేశంలో నోయెల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టాటా గ్రూప్‌తో పాటు జాతి నిర్మాణంలోనూ దివంగత రతన్ టాటా కీలక పాత్ర పోషించారని, ఎనలేని సేవలందించారని ట్రస్టీలు నివాళులరి్పంచారు. టాటా ట్రస్ట్స్ ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించింది. నోయెల్ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ‘రతన్ టాటా, అలాగే టాటా గ్రూప్ వ్యవస్థాపకులు అందించిన ఘన వారసత్వాన్ని ఇకపైనా కొనసాగిస్తాము. అభివృద్ధి, దాతృత్వ కార్యకలాపాలను కొనసాగిస్తూ జాతి నిర్మాణంలో మా వంతు పాత్రను పోషించడానికి పునరంకితమవుతాము‘ అని ఈ సందర్భంగా నోయెల్ తెలిపారు.పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వారసుడిని ఎన్నుకునేందుకు టాటా ట్రస్ట్స్ ట్రస్టీలు సమావేశమయ్యారు. 165 బిలియన్ డాలర్ల టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం పరోక్షంగా టాటా ట్రస్ట్స్ నియంత్రణలో ఉంటుంది. టాటా ట్రస్ట్స్ కింద సర్ రతన్ టాటా ట్రస్ట్ .. దాని అనుబంధ ట్రస్టులు, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్.. దాని అనుబంధ ట్రస్ట్‌లు ఉన్నాయి. వీటన్నింటికి టాటా గ్రూప్ కంపెనీలకు హోల్డింగ్ సంస్థ, ప్రమోటర్ అయిన టాటా సన్స్‌లో 66 శాతం వాటాలు ఉన్నాయి. ఇప్పటివరకు రతన్ టాటా నీడలో ఉన్న నోయెల్ టాటా ఇకపై సొంతంగా వీటి బాధ్యతలను చేపట్టనున్నారు. ముగ్గురు సంతానం.. టాటా సన్స్‌లో 18.4 శాతం వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన ఆలూ మిస్త్రీని నోయెల్ వివాహం చేసుకున్నారు. ఆమె టాటా సన్స్ మాజీ చైర్మన్, దివంగత సైరస్ మిస్త్రీ సోదరి. నోయెల్, ఆలూకి ఇద్దరు కుమార్తెలు (లియా, మాయా), ఒక కుమారుడు (నెవిల్) ఉన్నారు. పెద్ద కుమార్తె లియా టాటా ప్రస్తుతం ఇండియన్ హోటల్స్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. చిన్న కుమార్తె మాయా తన ప్రొఫెషనల్ కెరియర్ను టాటా ఆపర్చూనిటీస్ ఫండ్‌తో ప్రారంభించారు. తర్వాత టాటా డిజిటల్‌కి మారారు. టాటా న్యూ యాప్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. నెవిల్ టాటా తన వ్యాపార నైపుణ్యాలతో జుడియో బ్రాండ్‌ను విజయవంతం చేశారు. ట్రెంట్, స్టార్ బజార్లను పర్యవేక్షిస్తున్నారు. వ్యాపార దిగ్గజం విక్రమ్ కిర్లోస్కర్ కుమార్తె మానసి కిర్లోస్కర్‌ను వివాహం చేసుకున్నారు.నాలుగు దశాబ్దాలుగా టాటా గ్రూప్‌లో...ఐరిష్ పౌరసత్వం ఉన్న నోయెల్ టాటా గత నాలుగు దశాబ్దాలుగా టాటా గ్రూప్‌లో ఉన్నారు. ఆయన అంతగా బైటికి కనిపించరు. రతన్ టాటా తండ్రి నావల్ టాటాకు సూనూ, సిమోన్ అని ఇద్దరు భార్యలు. వారిలో సూనూ టాటా కుమారులు రతన్ టాటా, జిమ్మీ టాటా కాగా మరో భార్య సిమోన్ కుమారుడే నోయెల్ టాటా. ఆయన ససెక్స్ యూనివర్సిటీలో (యూకే) గ్రాడ్యుయేషన్ చేశారు. ఇన్సీడ్లో (ఫ్రాన్స్) ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం చేశారు. టాటా ఇంటర్నేషనల్‌లో కెరియర్ ప్రారంభించిన నోయెల్ 1999లో రిటైల్ వ్యాపారం ట్రెంట్కి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటికి ఒకటే స్టోర్ ఉన్న ట్రెంట్ .. ఆయన సారథ్యంలోకి వచ్చాక గణనీయంగా వృద్ధి చెంది 700 పైచిలుకు స్టోర్స్‌కి విస్తరించింది. ముఖ్యంగా వెస్ట్‌సైడ్ రిటైల్ చెయిన్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఇది మరింత వేగవంతమైంది. 2003లో వోల్టాస్, టైటాన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. టాటా ఇంటర్నేషనల్ ఆయన సారథ్యంలో 500 మిలియన్ డాలర్ల టర్నోవర్ నుండి 3 బిలియన్ డాలర్ల స్థాయి కి ఎదిగింది. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, వోల్టాస్ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లకు చైర్మన్‌గా, టాటా స్టీల్, టైటాన్లకు వైస్ చైర్మన్‌గా నోయెల్ వ్యవహరిస్తున్నారు. అలాగే 2019 నుంచి టాటా ట్రస్టుల్లో ట్రస్టీగా కూడా ఉన్నారు. స్మిత్స్ పీఎల్సీ, కాన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ కంపెనీల బోర్డుల్లోనూ నోయెల్ ఉన్నారు. -
టాటా ట్రస్ట్స్ తొలి సీవోవోగా అపర్ణ ఉప్పలూరి
సాక్షి,ముంబై: టాటా ట్రస్ట్స్ కొత్త సీఈవో, సీవవో లను ఎంపిక చేసింది. సిద్ధార్థ్ శర్మను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, అపర్ణ ఉప్పలూరిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించింది. ఈ నియామకాలు ఏప్రిల్ 1, 2023 నుండి అమల్లోకి వస్తాయని సంస్థ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపింది. టాటా ట్రస్ట్స్ తొలి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా అపర్ణ ఉప్పలూరి (48) ఎంపిక కావడం విశేషం. ప్రస్తుతం ఫోర్డ్ ఫౌండేషన్‌లో భారతదేశం, నేపాల్ శ్రీలంకలకు ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్నారు ఆమె. 2018, మేలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా ఫౌండేషన్‌లో చేరిన ఆమె పరోపకారం, మహిళల హక్కులు, ప్రజారోగ్యం, కళలు సాంస్కృతిక రంగాలలో వ్యూహాత్మక ప్రణాళిక కార్యక్రమాల అభివృద్ధిలో పాపులర్ అయ్యారు అపర్ణ. జెండర్ ఈక్వాలిటీ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఫోర్డ్ ఫౌండేషన్‌లో గ్రాంట్-మేకింగ్ కార్యక్రమాల నిర్వహణలో 20 ఏళ్ల లీడర్షిప్ , మేనేజ్మెంట్ అనుభవం ఆమె సొంతం. ఇక 2022లో టాటా ట్రస్ట్‌ల సీఈవో పదవికి రాజీనామా చేసిన ఎన్ శ్రీనాథ్ ప్లేస్‌లో సిద్ధార్థ్ శర్మ శర్మ ఎంపికైనారు. కాగా టాటా ట్రస్ట్స్, భారతదేశంలోని పురాతన స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి, టాటా సన్స్‌లో 66 శాతం వాటాను టాటా ట్రస్ట్స్ సొంతం. -
ఆ విషయమై నన్నెవరూ సంప్రదించలేదు: రతన్ టాటా
Tata Group New Chairman News: టాటా గ్రూప్ కొత్త చైర్మన్ ఎంపిక విషయంలో ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయనే ప్రచారం మొదలైంది. అయితే ప్రస్తుతం చైర్మన్ పదవిలో ఉన్న చంద్రశేఖరన్‌నే.. రెండోసారి కొనసాగించాలనే సంప్రదింపులు నడుస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా స్పందించారు. టాటా సన్స్ గ్రూప్ చైర్మన్‌గా ఉన్న నటరాజన్ చంద్రశేఖరన్(58) పదవీకాలం వచ్చే ఏడాది(2022) ఫిబ్రవరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ చర్చలు మొదలయ్యాయని, చంద్రశేఖరన్ పనితీరు ఫలితంగా రెండోసారి కొనసాగించే ప్రయత్నాలు బోర్డు చేస్తోందని ఓ జాతీయ మీడియా పత్రిక కథనం వెలువరించింది. ఈ నేపథ్యంలోనే మీడియా, రతన్ టాటాను సంప్రదించింది. ‘‘ఈ విషయంపై నన్నెవరూ సంప్రదించలేదు. ఆ కథనంలో వాస్తవం లేదు. పైగా చంద్రశేఖరన్‌ను రెండోసారి కొనసాగించాలనే బోర్డు ప్రతిపాదనేదీ నా దృష్టికి రాలేదు కూడా. ఈ విషయంలో టాటా సన్స్ బోర్డ్, షేర్‌హోల్డర్స్ సరైన నిర్ణయం తీసుకుంటారనే భావిస్తున్నా’’ అని రతన్ టాటా పేర్కొన్నారు. మరోవైపు ఆ కథనంపై చంద్రశేఖరన్ సైతం స్పందించారు. వారసత్వ విషయమై రతన్ టాటాగానీ, బోర్డుగానీ, ట్రస్ట్గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తన జోక్యం ఉండని ఈ వ్యవహారంలో.. సరైన టైంలో బోర్డు సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానని సోమవారం ఓ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారాయన. చదవండి.. ఆ వ్యాఖ్యలు నావి కావు: రతన్ టాటా -
టాటా ట్రస్టులకు తొలగిన పన్ను చిక్కులు!
న్యూఢిల్లీ: మూడు టాటా ట్రస్టులకు పన్ను మినహాయింపు హోదా సమంజసమేనని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) రూలింగ్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ మార్చి 2019లో ఇచ్చిన ‘పన్ను మినహాయింపు హోదా రద్దు’ ఉత్తర్వులను తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించి ఐటీఏటీ ముంబై బెంచ్ ప్రెసిడెంట్ జస్టిస్ పీపీ భట్, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్ సోమవారంనాడు మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. . దీనితో రతన్ టాటా ట్రస్ట్, జేఆర్డీ టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు అప్పీలేట్ ట్రిబ్యునల్ నుంచి ఊరట లభించినట్లయ్యింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటాసన్స్లో ఈ మూడు ట్రస్టులకూ 66 శాతం వాటా ఉంది. 2019లో ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన రూలింగ్‌లో ఎటువంటి మెరిట్స్ లేవని ఈ ఉత్తర్వుల్లో బెంచ్ పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళితే... మూడు ట్రస్ట్‌లకూ టాటా సన్స్‌లో వాటాలు ఉన్నాయన్న కారణంగా పన్ను మినహాయింపు రద్దును కోరుతూ ఆదాయపు పన్ను కమిషనర్– మినహాయింపులు (సీఐటీ–ఈ) గత ఏడాది మార్చిలో ఒక రివిజన్ (అభిప్రాయ వ్యక్తీకరణ) ఉత్తర్వులను ఇచ్చారు. ఈ ఉత్తర్వుల జారీకి సంబంధించి టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ సమర్పించిన పత్రాలను పరిశీలనలోకి తీసుకున్నారు. టాటాసన్స్లో వాటాలు కలిగిఉంటూ, పన్ను మినహాయింపులు పొందడం ఆదాయపు పన్ను చట్టాలకు విఘా తమని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘‘ట్రస్టు లో ట్రస్టీలు ఎవరికీ టాటా సన్స్‌లో ఎటువంటి స్వప్రయోజనాలూ లేవు. టాటాసన్స్లో పెట్టుబడు లు పెట్టి, స్వలాభాలు పొందాలన్న అభిప్రా యం ఇక్కడ కనిపించడంలేదు. టాటా గ్రూప్ కంపెనీల విజయం ద్వారా వచ్చిన ఫలాలను విస్తృత ప్రాతిపదికన ప్రజా ప్రయోజనాలకు పంచాలన్నదే ట్రస్టు ల లక్ష్యం’’ అని ఉత్తర్వులో అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. అలాగే టాటాసన్స్ ట్రస్టీలకు చేస్తున్న చెల్లింపులు వారి సేవలకు ఇస్తున్న ప్రతిఫలంగానే చూడాలి తప్ప, మరో విధంగా కాదని పేర్కొంది. సైరస్ మిస్త్రీ ప్రవర్తన అనైతికం... కాగా, బాధ్యతల్లో నుంచి తప్పించిన ఎనిమిది వారాల తర్వాత సైరస్ మిస్త్రీ సంబంధిత డాక్యుమెంట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమర్పించడాన్నీ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. కార్పొరేట్ ప్రపంచంలో కనీవినీ ఎరుగని అనైతిక ప్రవర్తనకు మిస్త్రీ పాల్పడ్డారని అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. కంపెనీ అనుమతి కూడా లేకుండా ఈ పత్రాలను ఆదాయపు పన్ను శాఖకు ఎలా సమర్పిస్తారని ప్రశ్నించింది. మిస్త్రీ డాక్యుమెంట్ల సమర్పణకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే, ఇందుకు సంబంధించి ఆయన ఉద్దేశాలు ‘‘తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని ట్రిబ్యునల్ పేర్కొంది. టాటా సన్స్‌లో 2006 నుంచీ ఆయన డైరెక్టర్‌గా ఉన్నారనీ, 2013 నుంచీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారనీ పేర్కొన్న ట్రిబ్యునల్, అప్పుడు అంతా మంచిగా కనిపించిన ఆయనకు, బాధ్యతల నుంచి తొలగించిన వెంటనే తప్పులు ఎలా కనబడతాయని ప్రశ్నించింది. 2013లో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ అర్ధాంతరంగా తొలగించింది. ఈ చర్య మిస్త్రీలు–టాటాల మధ్య న్యాయపోరాటానికి దారితీసిన సంగతి తెలిసిందే. టాటా ట్రస్టుల కేసుకు బలం! కాగా తాజాగా ఐటీఏటీ ఇచ్చిన రూలింగ్, టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్ రద్దు కేసుకు బలం చేకూర్చినట్లయ్యింది. ఆదాయపు పన్ను శాఖ 2019 అక్టోబర్‌లో ఆరు టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. ఈ కేసు ఐటీఏటీ ప్రత్యేక బెంచ్ వద్ద విచారణలో ఉంది. ఎయిర్–ఏషియా ఇండియాలో టాటా సన్స్‌కు మరింత వాటా అదనంగా 32 శాతం వాటా కొనుగోలు ఎయిర్–ఏషియా ఇండియా(ఏఏఐఎల్)లో టాటా సన్స్ సంస్థ తన వాటాను మరింతగా పెంచుకోనున్నది. ప్రస్తుతం ఏఏఐఎల్ఎల్లో టాటా సన్స్‌కు 51 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియాకు 49 శాతం చొప్పున వాటాలున్నాయి. తాజాగా టాటా సన్స్ సంస్థ అదనంగా 32 శాతం వాటాను ఎయిర్ఏషియా నుంచి 3.76 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కారణంగా ఏఏఐఎల్లో టాటా సన్స్ వాటా 83.67 శాతానికి పెరుగుతుంది. ఎయిర్ఏషియా వాటా 13 శాతానికి పరిమితమవుతుంది. ఎయిర్–ఏషియా ఇండియా కంపెనీ 2014 జూన్‌లో దేశీయ రూట్లలో విమాన సర్వీసులను ప్రారంభించింది. ఎయిర్ ఇండియా కోసమే...!: ఎయిర్ ఇండియా టేకోవర్‌కు ఎయిర్ఏషియా ఇండియాను ఇన్వెస్ట్మెంట్ వెహికల్‌గా వినియోగించుకోవడానికి ఎయిర్ఏషియా ఇండియాలో తన వాటాను టాటా సన్స్ మరింతగా పెంచుకున్నారని సమాచారం. దేశీయ పౌర విమానయాన మార్కెట్లో ఎయిర్ఏషియా వాటా 7.1 శాతంగా ఉంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్ విస్తార పేరుతో మరో విమానయాన కంపెనీని కూడా నిర్వహిస్తోంది. -
కరోనాపై అవగాహన చర్యలు చేపట్టిన టాటా ట్రస్ట్స్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం సూచించిన ఆరోగ్య విధానాలను ప్రజలు పాటించేలా వారిని ప్రోత్సహించేందుకు టాటా ట్రస్ట్స్ వారు అవగాహన చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం టాటా వారు కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమాన్ని మార్చి31న ప్రారంభించింది. దీని ద్వారా గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య విధానాల పట్ల వారిని విద్యావంతులను చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు వివిధ ఆడియో, వీడియో, యానిమేషన్ల ద్వారా ప్రచార చర్యలు చేపట్టింది. ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో ఆసక్తి కలిగిన సంస్థలకు 300లకుపైగా వీడియోలు, ఆడియోల ద్వారా సందేశాలను సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచినట్టు టాటా ట్రస్ట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇవి తెలుగు సహా పలు భాషలలో కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేగాక ఇవి ప్లేలిస్టులో కూడా అభ్యమవుతున్నాయి. (జైలులో కరోనా కలకలం.. 9 మంది మృతి) ఈ కార్యక్రమాన్ని ‘కదం, కరోనా ముక్త్ జీవన్’ పేరుతో వీడిమో సందేశాలు, లఘు యానిమేషన్ వీడియోలతో పాటు ఇన్ఫో గ్రాఫిక్స్ మొదలైన ఆడియో సందేశాలు, ఎస్ఎంఎస్ ఆధారిత సందేశాల ద్వారా అందుబాటులో ఉంచినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. అంతేగాక వీరికి మద్దతుగా సుప్రసిద్ద గాయకులు రఘు కుంచే, పార్థసారథి నేమానీలు కూడా వీడియో ద్వారా సామాజిక దూరం పట్ల, శుభ్రత పట్ల తమ సందేశాన్ని అందించారు. కరోనాపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేందుకు టాటా ట్రస్ట్స్ వారే ఇప్పుడు నలుగురు మాస్టర్ ట్రైనర్లను నియమించింది. వీరు 50పైగా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్(గ్రామ వాలంటీర్ల)కు శిక్షణ అందించడం ద్వారా ఈ సందేశం చివరి వరకూ చేరేలా వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సంబంధించి ప్రస్తుత నెట్‌వర్క్‌తో పాటుగా, ట్రస్ట్స్ వాలంటీర్లు, భాగస్వామ్య సంస్థలు, కమ్యూనిటీ రెడియోలు, గ్రామ అధారిత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, ఇంటర్నేట్, కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగం ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం చేయబడుతున్న ఆరోగ్య విధానాలు: చేతులు శుభ్రంగా కడగడంలో నైపుణ్యం. భౌతిక దూరం అవశ్యకత. శ్వాస సంబంధిత పద్ధతులు. సరైన సమాచారంపై ఆధారపడటం. కోవిడ్-19 లక్షణాలను ముందుగా గుర్తించడం. తిరిగి వచఇన వలస కార్మికులు స్వీయ నిర్భందం కోసం మార్గదర్శకాలను అనుసరించేలా చేయడం. -
మహిళల ప్రాతినిధ్యం అంతంతమాత్రమే..!
ఢిల్లీ: మహిళలకు అన్నిరంగాల్లో అధిక ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కొన్ని రంగాల్లో వారి సంఖ్య చాలా పేలవంగా ఉంది. పోలీసు, న్యాయ వ్యవస్థ వంటి కీలక విభాగాల్లో మరీ తక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే తాజాగా టాటా ట్రస్ట్స్ విడుదల చేసిన ‘ఇండియా జస్టిస్ రిపోర్టు- 2019’ నివేదికలో మహిళల ఉద్యోగాలకు సంబంధించిన పలు అంశాలు వెల్లడయ్యాయి. భారతదేశంలో 2.4 మిలియన్ల పోలీసు సిబ్బందిలో కేవలం ఏడు శాతం మహిళలు మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఉన్నతస్థాయి పోలీసు ఉద్యోగాల్లో కేవలం ఆరు శాతం మంది మహిళలకు ప్రాతినిధ్యం ఉన్నట్లు వెల్లడించింది. మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా ఏడాదికి ఒక శాతం చొప్పున వారి సంఖ్యను పెంచుతున్నామని రాష్ట్రాలు చెబుతున్నప్పటికీ వారికి కేటాయించిన 33 శాతం చేరుకోవడానికి దశాబ్దాల కాలం పడుతుందని నివేదిక తేటతెల్లం చేసింది. కొన్ని రిజర్వు స్థానాల్లో భారీ సంఖ్యలో ఖాళీలు ఉండటం వల్ల మహిళల సంఖ్యతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల ప్రాతినిధ్యం కూడా చాలా పేలవంగా ఉందని ఆ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీంతోపాటు గత ఐదేళ్లలో దేశంలోని మొత్తం పోలీసు బలగాల్లో 6.4 శాతం మందికి మాత్రమే సరైన శిక్షణ ఇవ్వబడిందని పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 90 శాతం మంది పోలీసులకు సరైన శిక్షణ లేకుండానే విధులు నిర్వహిస్తున్నారని స్పష్టం చేసింది. పోలీసు విభాగాల్లోనే కాకుండా న్యాయవ్యవస్థలో కూడా మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉందని ఆ నివేదిక వెల్లడించింది. న్యాయవాదుల్లో కేవలం 18 శాతం మాత్రమే మహిళలు ఉన్నారని పేర్కొంది. దేశ వ్యాప్తంగా సబార్డినేట్ కోర్టుల్లో 28 మిలియన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. 24 శాతం కేసులు ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. కాగా మొత్తం 2.3 మిలియన్ కేసులు పదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 4,071 కోర్టు గదుల కొరత ఉందని పేర్కొంది. 2017 డేటా ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లో పోలీసు శాఖలో 50 శాతానికి పైగా ఖాళీలు ఉన్నాయని వెల్లడించింది. భారత జైళ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉందని.. దేశంలో 1,412 జైళ్లలో కేవలం 621 జైళ్లల్లో మాత్రమే సరైన సిబ్బంది ఉన్నారని వెల్లడించింది. కాగా, ఈ నివేదిక తయారిలో సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, డీఏకేఎస్‌హెచ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ - ప్రయాస్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ వంటి పలు ప్రతిష్టాత్మకమైన సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. -
మిస్త్రీకి చుక్కెదురు
ముంబై: టాటా సన్స్ ఛైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. టాటా ట్రస్ట్స్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్. వెంకటరామన్ దాఖలు చేసిన దావాను ముంబై చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు విచారణకు స్వీకరించచింది. ఈ నేపథ్యంలో ముంబై కోర్టు సైరస్మిస్త్రీ, షాపూజీ మిస్త్రీ, నలుగురు డైరెక్టర్లకు సమన్లు జారీ చేసింది. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కృష్ణా పల్దేవార్ మిస్త్రీ, సోదరులు కోర్టు ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. మిస్టరీ సోదరులు, సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లకు ఈ నోటీసులు జారీ చేసింది. టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ టాటా ట్రస్ట్స్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్. వెంకటరామన్ సైరస్ మిస్త్రీపై రూ.500కోట్ల డిఫమేషన్ కేసును చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వద్ద పిటిషన్‌వేశారు. రూ .500 కోట్ల నష్టపరిహారాన్ని కోరుతో ఈ పిటిషన్ దాఖలు చేశారు. సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్లు , మిస్ట్రస్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్ పై ఈ పిటీషన్ వేశారు. 2016 అక్టోబర్ 25న ఒక ఈ మెయిల్లో టాటాసన్స్ డైరెక్టర్లు, టాటా ట్రస్ట్‌కు చెందిన ఇతర ట్రస్టీలకు తప్పుడు ఆరోపణలు చేశారని తన పిటిషన్లో ఆరోపించారు. వెంకటరామన్ (వెంకట్) ఎయిర్ ఏషియా ఇండియా డైరెక్టర్ గా ఉన్నారు. -
రాజీనామాపై రతన్ టాటా క్లారిటీ
న్యూఢిల్లీ : టాటా ట్రస్టుల చైర్మన్ పదవి నుంచి తను రాజీనామా చేయబోతున్నట్టు వస్తున్న వార్తాకథనాలపై రతన్ టాటా స్పందించారు. ప్రస్తుతం టాటా ట్రస్టులకు రాజీనామా చేసే ప్లాన్స్ ఏమీ లేవని తేల్చేసి, మీడియా ఊహాగానాలను కొట్టిపారేశారు. రతన్ టాటా ప్రస్తుతం టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతున్నారని, ఈ సమయంలో టాటా ట్రస్టుల నుంచి ఆయన దిగిపోయే ఉద్దేశాలు ఏమీ లేవని గ్రూప్ కూడా ఓ ప్రకటనలో తెలిపింది. టాటా ట్రస్టుల కార్యక్రమాల్లో ఆయన తన ప్రమేయాన్ని కొనసాగిస్తారని గ్రూప్ పేర్కొంది. ముందస్తు రిపోర్టుల ప్రకారం టాటా సన్స్‌లో 66 శాతం మెజార్టీ కంట్రోల్‌తో గ్రూప్‌ను నడిపిస్తున్న టాటా ట్రస్టులకు రతన్ టాటా గుడ్‌బై చెప్పనున్నారని, చైర్మన్ పదవి నుంచి ఆయన దిగిపోతున్నారని పలు వార్తలొచ్చాయి. వచ్చే ఏడాది ప్రథమార్థం చివరి వరకు కొత్త చెర్మన్‌ను ఎంపికచేసేందుకు టాటా ట్రస్టులు కసరత్తు కూడా చేస్తున్నాయంటూ పేర్కొన్నాయి. కానీ ఆ రిపోర్టులను కొట్టిపారేస్తూ.. టాటా ట్రస్ట్‌ల చైర్మన్ పదవి నుంచి దిగిపోయే ఉద్దేశ్యాలేమీ లేవని రతన్ టాటా ప్రకటించారు. -
ట్రస్టులకు రతన్ టాటా గుడ్‌బై?
ముంబాయి : టాటా సన్స్‌లో 66 శాతం మెజార్టీ కంట్రోల్‌తో గ్రూప్‌ను నడిపిస్తున్న టాటా ట్రస్ట్స్‌కు రతన్ టాటా గుడ్‌బై చెప్పనున్నారట. టాటా ట్రస్ట్‌ల చైర్మన్ పదవి నుంచి ఆయన దిగిపోనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థం చివరి వరకు కొత్త చెర్మన్‌ను ఎంపికచేసేందుకు టాటా ట్రస్ట్స్ కసరత్తు చేస్తున్నాయట. ఈ విషయంలో తమకు మార్గనిర్దేశం చేయాలని బాహ్య సలహాదారులను కూడా ట్రస్ట్స్ ఆదేశించాయని తెలిసింది. ట్రస్ట్స్‌కు కాబోయే చైర్మన్ కచ్చితంగా భారతీయుడే ఉండి ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కానీ ట్రస్ట్స్ చైర్మన్‌గా టాటా ఫ్యామిలీకి లేదా పార్సి సభ్యులకు చెందినవారు ఉండరని టాటాల దీర్ఘకాల అంతరంగికుడు కృష్ణ కుమార్ చెప్పారు. తదుపరి చైర్మన్ దూర దృష్టితో ఆలోచించే నైపుణ్యంతో పాటు, టాటా గ్రూప్ స్థాపకుల సంకల్పం నెరవేర్చే వారినే ఎంపికచేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్‌కు ఏదైతే మంచిదో అది పూర్తిగా అర్థం చేసుకున్నవారై ఉండాలని టాటా ట్రస్ట్స్ భావిస్తున్నాయని చెప్పారు. అంతేకాక మొదటి నుంచి రతన్‌టాటాతో కలిసి పనిచేసిన వారై కూడా ఉండొచ్చని కుమార్ పేర్కొన్నారు. అయితే ట్రస్టీలకు చైర్మన్‌గా ఎంపికయ్యే వారికి పదవీ విరమణ కాలం ఉండదు. వారు జీవితాంతం ట్రస్టులకు చైర్మన్‌గా వ్యవహరించవచ్చు. జేఆర్డీ టాటా తాను మరణించేంత వరకు అంటే 1993 వరకు టాటా ట్రస్టీలకు చైర్మన్‌గా వ్యవహరించారు. అంతకు రెండేళ్ల ముందే రతన్ టాటా, టాటా సన్స్ బాధ్యతలు స్వీకరించారు. లిస్టు అయిన టాటా కంపెనీల్లో టాటా ట్రస్ట్‌లే 14 బిలియన్ డాలర్ల(రూ.94,948కోట్లకు పైగా) పెట్టుబడులు కలిగిఉన్నాయి. 2012లో మిస్త్రీకి టాటా గ్రూప్ సారథ్య బాధ్యతలు అప్పగించినప్పుడు టాటా ట్రస్ట్‌ల చైర్మన్ బాధ్యతను రతన్ టాటానే కొనసాగించనున్నట్టు చెప్పారు. అంతకముందు టాటా సన్స్‌ను, టాటా ట్రస్ట్‌లను రతన్ టాటానే ఒంటిచేతుల మీద నడిపేవారు. మిస్త్రీకి టాటా గ్రూప్‌గా బాధ్యతలు అప్పగించిన తర్వాత ట్రస్ట్ చేసిన సూచనలను మిస్త్రీ పెడచెవిన పెట్టేవారని తెలిసింది. దీంతో టాటా ట్రస్ట్‌ల సూచన మేరకే మిస్త్రీని గ్రూప్ చైర్మన్‌గా బయటికి గెంటివేశారని గ్రూప్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలోకూడా చెప్పారు. -
టాటా ట్రస్ట్స్ ఉచిత ఆన్లైన్ విద్య
ఖాన్ అకాడమీతో భాగస్వామ్యం ముంబై: భారత్‌లో ఉచిత ఆన్లైన్ విద్యను అందించేందుకు టాటా ట్రస్ట్స్ ముందుకొచ్చింది. ఇందుకోసం అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న నాన్-ప్రాఫిట్ సంస్థ ఖాన్ అకాడమీతో జతకడుతున్నట్లు ఆదివారం ఇక్కడ ప్రకటించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్-యాక్సెస్ ఆన్లైన్ మాధ్యమాల్లో ఒకటిగా నిలుస్తున్న ఖాన్ అకాడమీకి టాటా ట్రస్ట్స్ నిధులను అందించనుంది. ఐదేళ్లపాటు ఈ భాగస్వామ్యం కొనసాగుతుంది. అయితే, ఎంతమేరకు నిధులు ఇస్తున్నారన్న విషయాన్ని టాటా ట్రస్ట్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రతన్ టాటా వెల్లడించలేదు. 100 బిలియన్ డాలర్ల టాటా గ్రూప్‌నకు హోల్డింగ్ కంపెనీగా ఉన్న టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు 66 శాతం వాటా ఉంది. ‘దేశంలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. అంతేకాకుండా అక్షరాస్యత రేటును పెంచేందుకు కూడా దీనివల్ల సాధ్యపడుతుంది. అందుకే ఆన్లైన్ ద్వారా ఉచితంగా విద్యను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఖాన్ అకాడమీని ఎంచుకున్నాం. ఒక భారతీయుడిగా, ఈ భూమిపై నివశిస్తున్న ఒక పౌరుడిగా దీన్ని ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నా. భావితరాల్లో ఒక మార్పును తీసుకురావాలన్నదే మా ఈ ప్రయత్నం ముఖ్యోద్దేశం’ అని రతన్ టాటా పేర్కొన్నారు. ఇప్పటికే భారతీయ విద్యార్ధులు తమ అకాడెమీ కంటెంట్‌ను వినియోగిస్తున్నారని.. అయితే, ప్రత్యేకంగా భారత్ కోసం ఇంగ్లిష్, హిందీ భాషల్లో కంటెంట్‌ను రూపొందించే పనిలో ఉన్నట్లు ఖాన్ అకాడెమీ వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ చెప్పారు. ఆయన గతంలో హెడ్జ్ ఫండ్ ఎనలిస్ట్ కావడం గమనార్హం. సీఎస్ఆర్ వ్యయం పన్నులాంటిదే: రతన్ టాటా కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కోసం వెచ్చిస్తున్న తప్పనిసరి వ్యయం ఒక విధంగా పన్ను కిందే లెక్కని టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. అసలు దీనికి సంబంధించి నిర్ధిష్టంగా లబ్ధిదారులను ప్రభుత్వమే గుర్తిస్తే మంచిదని కూడా ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల్లో 2 శాతం మేర సీఎస్ఆర్ కోసం(సామాజిక కార్యకలాపాలు) తప్పనిసరిగా ఖర్చు చేయాలని కొత్త కంపెనీల చట్టంలో నిబంధనలను చేర్చిన సంగతి తెలిసిందే. ‘దాతృత్వం లేదా సామాజిక సేవ అనేది స్వచ్ఛందంగా చేసేది. అంతేకానీ బలవంతంగా దీన్ని చేయించాలని చూస్తే ఫలితాలు పక్కదారిపట్టే అవకాశం ఉంది’ అని టాటా అభిప్రాయపడ్డారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్బర్గ్ కంపెనీలో తనకున్న వాటాలో 99 శాతం షేర్లను(విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లు) సామాజిక సేవ కోసం దానం చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రతన్ టాటా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీఎస్ఆర్ ద్వారా సమకూరే భారీ నిధులను ఏ ప్రాజెక్టులు, రంగాల్లో వెచ్చించాలనేది ప్రభుత్వమే నిర్ధేశించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని టాటా అభిప్రాయపడ్డారు. -
గ్రామీణ ప్రాంతాలకు ‘ఇంటర్నెట్ సైకిల్ బళ్లు’
ముంబై: గ్రామీణ ప్రాంతాల మహిళల్లో ఇంటర్నెట్పై అవగాహన పెంచే దిశగా టాటా ట్రస్ట్స్, గూగుల్ ఇండియా నడుం బిగించాయి. ఇందులో భాగంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన 1,000 ‘ఇంటర్నెట్ సైకిల్ తోపుడు బళ్లను’ మారుమూల గ్రామాలకు పంపనున్నాయి. శుక్రవారం వీటి ఆవిష్కరణ కార్యక్రమంలో టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా, గూగుల్ ఇండియా ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ పాల్గొన్నారు. ఐస్‌క్రీములు, ఇతర ఉత్పత్తులు విక్రయించే సంప్రదాయ తోపుడు బళ్ల తరహాలోనే.. ఇంటర్నెట్పై అవగాహన పెంచేందుకు సైకిల్ బళ్లను ఉపయోగించనున్నట్లు ఆనందన్ పేర్కొన్నారు. తోపుడు బండిని తీసుకొచ్చే ఆపరేటరు (ఇంటర్నెట్ సాథి).. ఆయా గ్రామా ల్లో మహిళలకు ఇంటర్నెట్ వినియోగంపై శిక్షణనిస్తారని వివరించారు. ముందుగా గుజరాత్, రాజస్తాన్, జార్ఖండ్‌లలో ఇంటర్నెట్ సైకిళ్లు సర్వీసులు మొదలవుతాయని, ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని టాటా ట్రస్ట్స్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఆర్ వెంకటరమణన్ తెలిపారు. సుమారు 4-6 నెలల పాటు ఒకో గ్రామం/క్లస్టర్లో వారానికి 2రోజుల పాటు ఈ సైకిల్ కార్ట్ అందుబాటులో ఉంటుందని వివరించారు.