టాటా ట్రస్ట్స్ ఉచిత ఆన్‌లైన్ విద్య
ఖాన్ అకాడమీతో భాగస్వామ్యం
ముంబై: భారత్‌లో ఉచిత ఆన్‌లైన్ విద్యను అందించేందుకు టాటా ట్రస్ట్స్ ముందుకొచ్చింది. ఇందుకోసం అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న నాన్-ప్రాఫిట్ సంస్థ ఖాన్ అకాడమీతో జతకడుతున్నట్లు ఆదివారం ఇక్కడ ప్రకటించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్-యాక్సెస్ ఆన్‌లైన్ మాధ్యమాల్లో ఒకటిగా నిలుస్తున్న ఖాన్ అకాడమీకి టాటా ట్రస్ట్స్ నిధులను అందించనుంది. ఐదేళ్లపాటు ఈ భాగస్వామ్యం కొనసాగుతుంది.
అయితే, ఎంతమేరకు నిధులు ఇస్తున్నారన్న విషయాన్ని టాటా ట్రస్ట్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రతన్ టాటా వెల్లడించలేదు. 100 బిలియన్ డాలర్ల టాటా గ్రూప్‌నకు హోల్డింగ్ కంపెనీగా ఉన్న టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు 66 శాతం వాటా ఉంది.
‘దేశంలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. అంతేకాకుండా అక్షరాస్యత రేటును పెంచేందుకు కూడా దీనివల్ల సాధ్యపడుతుంది. అందుకే ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా విద్యను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఖాన్ అకాడమీని ఎంచుకున్నాం. ఒక భారతీయుడిగా, ఈ భూమిపై నివశిస్తున్న ఒక పౌరుడిగా దీన్ని ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నా.
భావితరాల్లో ఒక మార్పును తీసుకురావాలన్నదే మా ఈ ప్రయత్నం ముఖ్యోద్దేశం’ అని రతన్ టాటా పేర్కొన్నారు. ఇప్పటికే భారతీయ విద్యార్ధులు తమ అకాడెమీ కంటెంట్‌ను వినియోగిస్తున్నారని.. అయితే, ప్రత్యేకంగా భారత్ కోసం ఇంగ్లిష్, హిందీ భాషల్లో కంటెంట్‌ను రూపొందించే పనిలో ఉన్నట్లు ఖాన్ అకాడెమీ వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ చెప్పారు. ఆయన గతంలో హెడ్జ్ ఫండ్ ఎనలిస్ట్ కావడం గమనార్హం.
సీఎస్‌ఆర్ వ్యయం పన్నులాంటిదే: రతన్ టాటా
కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కోసం వెచ్చిస్తున్న తప్పనిసరి వ్యయం ఒక విధంగా పన్ను కిందే లెక్కని టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. అసలు దీనికి సంబంధించి నిర్ధిష్టంగా లబ్ధిదారులను ప్రభుత్వమే గుర్తిస్తే మంచిదని కూడా ఆయన పేర్కొన్నారు.
కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల్లో 2 శాతం మేర సీఎస్‌ఆర్ కోసం(సామాజిక కార్యకలాపాలు) తప్పనిసరిగా ఖర్చు చేయాలని కొత్త కంపెనీల చట్టంలో నిబంధనలను చేర్చిన సంగతి తెలిసిందే. ‘దాతృత్వం లేదా సామాజిక సేవ అనేది స్వచ్ఛందంగా చేసేది. అంతేకానీ బలవంతంగా దీన్ని చేయించాలని చూస్తే ఫలితాలు పక్కదారిపట్టే అవకాశం ఉంది’ అని టాటా అభిప్రాయపడ్డారు.
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్‌బర్గ్ కంపెనీలో తనకున్న వాటాలో 99 శాతం షేర్లను(విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లు) సామాజిక సేవ కోసం దానం చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రతన్ టాటా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీఎస్‌ఆర్ ద్వారా సమకూరే భారీ నిధులను ఏ ప్రాజెక్టులు, రంగాల్లో వెచ్చించాలనేది ప్రభుత్వమే నిర్ధేశించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని టాటా అభిప్రాయపడ్డారు.