Non-profit organization
-
పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభంలో భారతీయులను ఆదుకునేందుకు ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. గివ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ .5 కోట్లు విరాళంగా ఇవ్వనున్నారు. భారతదేశంలో కోవిడ్ -19, లాక్డౌన్ ఇబ్బందుల్లో ఉన్నా రోజువారీ వేతన కార్మికుల కుటుంబాలకు నగదు సహాయం అందించడానికి రూ.5 కోట్ల నిధులను అందించనుంది. ఈ సందర్భంగా గివ్ ఇండియా ట్విటర్ ద్వారా సుందర్ పిచాయ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. కరోనా వైరస్ పోరులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు, ప్రపంచవ్యాప్తంగా 100 ప్రభుత్వ సంస్థలకు గూగుల్ 800 మిలియన్ డాలర్ల సాయాన్నిప్రకటించింది. అలాగే చిన్న వ్యాపారాలకు మూలధనాన్ని అందించే ప్రయత్నాల్లో భాగంగా స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులకు 200 మిలియన్ల డాలర్లను పెట్టుబడులను ప్రకటించింది. అంతేకాకుండా వాస్తవాల నిర్ధారణ, తప్పుడు సమాచారంపై లాభాపేక్ష లేకుండా పోరాటం చేసేందుకు 6.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.49 కోట్లు) తక్షణ సాయాన్ని అందిస్తున్నట్టు కూడా గూగుల్ ప్రకటించింది. భారత్‌తో పాటు ప్రపంచ మొత్తం ఈ సేవలు అందించనుంది. (కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు) మహమ్మారి కరాళ నృత్యంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్డౌన్లోకి వెళ్లి పోయాయి. రవాణా సహా, ఇతర వాణిజ్య సేవలన్నీ నిలిచిపోయాయి. వినిమయ డిమాండ్ పూర్తిగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థలు మరింత మాంద్యంలోకి కూరుకు పోతున్నాయి. ఉపాధి మార్గాలు లేక ముఖ్యంగా రోజువారీ కార్మికులు, పేద వలస కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. దీంతో వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు కృషి చేస్తున్నాయి. ఇందుకోసం భారీఎత్తున విరాళాల సేకరణ కూడా చేపట్టాయి. అలాంటి వాటిల్లో ఒకటి గివ్ ఇండియా అనే సంస్థ. తినడానికి తిండిలేక నానా అగచాట్లు పడుతున్న కోవిడ్-19 బాధిత కుటుంబాలను గుర్తించి, వారిని ఆదుకుంటోందీ సంస్థ. మాస్క్ లు, సబ్బులు, శానిటరీ కిట్స్తోపాటు ప్రధానంగా నగదు నేరుగా బాధిత కుటుంబాలకు అందేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ గివ్ ఇండియాకు తన తాజా విరాళాన్ని ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, గివ్ ఇండియా సమాజంలో ఇప్పటివరకు రూ .12 కోట్లు సమీకరించింది. కాగా మహమ్మారి కారణంగా భారతదేశంలో మరణించిన వారి సంఖ్య 308 కు పెరిగింది. సోమవారం 35 కొత్త మరణాలు సంభవించగా, కేసుల సంఖ్య 9,152 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి : కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్ Thank you @sundarpichai for matching @Googleorg 's ₹5 crore grant to provide desperately needed cash assistance for vulnerable daily wage worker families. Please join our #COVID19 campaign: https://t.co/T9bDf1MXiv @atulsatija — GiveIndia (@GiveIndia) April 13, 2020 -
‘మధ్యాహ్న భోజనాన్ని’ ప్రైవేట్‌పరం చేయవద్దు
శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కమల గాంధీనగర్ : మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ ఎ. కమల డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్‌కు కట్టబెట్టాలన్న ఆలోచనను నిరసిస్తూ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం లెనిన్‌సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అరకొర వసతులతోనే పదిహేనేళ్లుగా భోజనపథకం నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదన్నారు. భోజన పథకం కార్మికులకు కనీస వసతులు కల్పించడం లేదని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. పథకంలో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, సరైన సౌకర్యాలు కల్పించి గతం నుంచి పనిచేస్తున్న కార్మికులకే మధ్యాహ్న భోజన పథకం అప్పగించాలని డిమాండ్‌చేశారు. సమస్యల ప రిష్కరించాలని కోరుతూ విజయవాడ నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు అందజేయనున్నామని చెప్పారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నగర అధ్యక్షురాలు దుర్గాభవానీ, పి. లక్ష్మీ, రమాదేవి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
టాటా ట్రస్ట్స్ ఉచిత ఆన్లైన్ విద్య
ఖాన్ అకాడమీతో భాగస్వామ్యం ముంబై: భారత్‌లో ఉచిత ఆన్లైన్ విద్యను అందించేందుకు టాటా ట్రస్ట్స్ ముందుకొచ్చింది. ఇందుకోసం అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న నాన్-ప్రాఫిట్ సంస్థ ఖాన్ అకాడమీతో జతకడుతున్నట్లు ఆదివారం ఇక్కడ ప్రకటించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్-యాక్సెస్ ఆన్లైన్ మాధ్యమాల్లో ఒకటిగా నిలుస్తున్న ఖాన్ అకాడమీకి టాటా ట్రస్ట్స్ నిధులను అందించనుంది. ఐదేళ్లపాటు ఈ భాగస్వామ్యం కొనసాగుతుంది. అయితే, ఎంతమేరకు నిధులు ఇస్తున్నారన్న విషయాన్ని టాటా ట్రస్ట్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రతన్ టాటా వెల్లడించలేదు. 100 బిలియన్ డాలర్ల టాటా గ్రూప్‌నకు హోల్డింగ్ కంపెనీగా ఉన్న టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు 66 శాతం వాటా ఉంది. ‘దేశంలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. అంతేకాకుండా అక్షరాస్యత రేటును పెంచేందుకు కూడా దీనివల్ల సాధ్యపడుతుంది. అందుకే ఆన్లైన్ ద్వారా ఉచితంగా విద్యను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఖాన్ అకాడమీని ఎంచుకున్నాం. ఒక భారతీయుడిగా, ఈ భూమిపై నివశిస్తున్న ఒక పౌరుడిగా దీన్ని ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నా. భావితరాల్లో ఒక మార్పును తీసుకురావాలన్నదే మా ఈ ప్రయత్నం ముఖ్యోద్దేశం’ అని రతన్ టాటా పేర్కొన్నారు. ఇప్పటికే భారతీయ విద్యార్ధులు తమ అకాడెమీ కంటెంట్‌ను వినియోగిస్తున్నారని.. అయితే, ప్రత్యేకంగా భారత్ కోసం ఇంగ్లిష్, హిందీ భాషల్లో కంటెంట్‌ను రూపొందించే పనిలో ఉన్నట్లు ఖాన్ అకాడెమీ వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ చెప్పారు. ఆయన గతంలో హెడ్జ్ ఫండ్ ఎనలిస్ట్ కావడం గమనార్హం. సీఎస్ఆర్ వ్యయం పన్నులాంటిదే: రతన్ టాటా కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కోసం వెచ్చిస్తున్న తప్పనిసరి వ్యయం ఒక విధంగా పన్ను కిందే లెక్కని టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. అసలు దీనికి సంబంధించి నిర్ధిష్టంగా లబ్ధిదారులను ప్రభుత్వమే గుర్తిస్తే మంచిదని కూడా ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల్లో 2 శాతం మేర సీఎస్ఆర్ కోసం(సామాజిక కార్యకలాపాలు) తప్పనిసరిగా ఖర్చు చేయాలని కొత్త కంపెనీల చట్టంలో నిబంధనలను చేర్చిన సంగతి తెలిసిందే. ‘దాతృత్వం లేదా సామాజిక సేవ అనేది స్వచ్ఛందంగా చేసేది. అంతేకానీ బలవంతంగా దీన్ని చేయించాలని చూస్తే ఫలితాలు పక్కదారిపట్టే అవకాశం ఉంది’ అని టాటా అభిప్రాయపడ్డారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్బర్గ్ కంపెనీలో తనకున్న వాటాలో 99 శాతం షేర్లను(విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లు) సామాజిక సేవ కోసం దానం చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రతన్ టాటా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీఎస్ఆర్ ద్వారా సమకూరే భారీ నిధులను ఏ ప్రాజెక్టులు, రంగాల్లో వెచ్చించాలనేది ప్రభుత్వమే నిర్ధేశించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని టాటా అభిప్రాయపడ్డారు.