ట్రస్టులకు రతన్ టాటా గుడ్బై?
ట్రస్టులకు రతన్ టాటా గుడ్బై?
Published Fri, Dec 16 2016 9:43 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
ముంబాయి : టాటా సన్స్లో 66 శాతం మెజార్టీ కంట్రోల్తో గ్రూప్ను నడిపిస్తున్న టాటా ట్రస్ట్స్కు రతన్ టాటా గుడ్బై చెప్పనున్నారట. టాటా ట్రస్ట్ల చైర్మన్ పదవి నుంచి ఆయన దిగిపోనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థం చివరి వరకు కొత్త చెర్మన్ను ఎంపికచేసేందుకు టాటా ట్రస్ట్స్ కసరత్తు చేస్తున్నాయట. ఈ విషయంలో తమకు మార్గనిర్దేశం చేయాలని బాహ్య సలహాదారులను కూడా ట్రస్ట్స్ ఆదేశించాయని తెలిసింది. ట్రస్ట్స్కు కాబోయే చైర్మన్ కచ్చితంగా భారతీయుడే ఉండి ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కానీ ట్రస్ట్స్ చైర్మన్గా టాటా ఫ్యామిలీకి లేదా పార్సి సభ్యులకు చెందినవారు ఉండరని టాటాల దీర్ఘకాల అంతరంగికుడు కృష్ణ కుమార్ చెప్పారు.
తదుపరి చైర్మన్ దూర దృష్టితో ఆలోచించే నైపుణ్యంతో పాటు, టాటా గ్రూప్ స్థాపకుల సంకల్పం నెరవేర్చే వారినే ఎంపికచేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్కు ఏదైతే మంచిదో అది పూర్తిగా అర్థం చేసుకున్నవారై ఉండాలని టాటా ట్రస్ట్స్ భావిస్తున్నాయని చెప్పారు. అంతేకాక మొదటి నుంచి రతన్టాటాతో కలిసి పనిచేసిన వారై కూడా ఉండొచ్చని కుమార్ పేర్కొన్నారు. అయితే ట్రస్టీలకు చైర్మన్గా ఎంపికయ్యే వారికి పదవీ విరమణ కాలం ఉండదు. వారు జీవితాంతం ట్రస్టులకు చైర్మన్గా వ్యవహరించవచ్చు. జేఆర్డీ టాటా తాను మరణించేంత వరకు అంటే 1993 వరకు టాటా ట్రస్టీలకు చైర్మన్గా వ్యవహరించారు. అంతకు రెండేళ్ల ముందే రతన్ టాటా, టాటా సన్స్ బాధ్యతలు స్వీకరించారు. లిస్టు అయిన టాటా కంపెనీల్లో టాటా ట్రస్ట్లే 14 బిలియన్ డాలర్ల(రూ.94,948కోట్లకు పైగా) పెట్టుబడులు కలిగిఉన్నాయి.
2012లో మిస్త్రీకి టాటా గ్రూప్ సారథ్య బాధ్యతలు అప్పగించినప్పుడు టాటా ట్రస్ట్ల చైర్మన్ బాధ్యతను రతన్ టాటానే కొనసాగించనున్నట్టు చెప్పారు. అంతకముందు టాటా సన్స్ను, టాటా ట్రస్ట్లను రతన్ టాటానే ఒంటిచేతుల మీద నడిపేవారు. మిస్త్రీకి టాటా గ్రూప్గా బాధ్యతలు అప్పగించిన తర్వాత ట్రస్ట్ చేసిన సూచనలను మిస్త్రీ పెడచెవిన పెట్టేవారని తెలిసింది. దీంతో టాటా ట్రస్ట్ల సూచన మేరకే మిస్త్రీని గ్రూప్ చైర్మన్గా బయటికి గెంటివేశారని గ్రూప్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలోకూడా చెప్పారు.
Advertisement
Advertisement