ఏకగ్రీవంతో పల్లెలు ప్రశాంతం | Sajjala Ramakrishna Reddy Comments On TDP | Sakshi
Sakshi News home page

ఏకగ్రీవంతో పల్లెలు ప్రశాంతం

Published Wed, Jan 27 2021 4:03 AM | Last Updated on Wed, Jan 27 2021 8:44 AM

Sajjala Ramakrishna Reddy Comments On TDP - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ దిశగా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తలపెట్టిన సంక్షేమ మహాయజ్ఞం నిర్విఘ్నంగా సాగేందుకు గ్రామాల్లో ప్రశాంతత అవసరమన్నారు. ఏకగ్రీవాలను ప్రోత్సహించాల్సిన ఎన్నికల కమిషన్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని ఆక్షేపించారు. ఎన్నికల పేరుతో పల్లెల్లో కక్షలు రగిల్చేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని, ప్రలోభాలకు గురిచేస్తే కఠినంగా శిక్షించే చట్టాలను ప్రభుత్వం తెచ్చిందని గుర్తు చేశారు. వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మంగళవారం మీడియాతో మాట్లాడారు.

గ్రామీణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అందుకే ఈ పంచాయతీ ఎన్నికలు చరిత్రాత్మకమైనవి. కొత్త నాయకత్వానికి అవసరమైన అన్ని సదుపాయాలూ సీఎం ఇప్పటికే సమకూర్చారు. మహాత్ముడు కోరుకున్న గ్రామ స్వరాజ్యం రావాలంటే పంచాయతీ ఎన్నికలు అవసరమే. అయితే ఇవి పట్టుదల, కక్షలకు కారణమవుతున్నాయి. గ్రామ ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితి రాకూడదని ప్రభుత్వం కోరుకుంటోంది. అందుకే పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలను స్వాగతిస్తోంది. 

ఏకగ్రీవాలకు కృషి చేద్దాం...
గ్రామాభివృద్ధిని కాంక్షించే స్వచ్ఛంధ సంస్థలు, మేధావులు, రాజకీయ పార్టీలూ పట్టుదలకు పోకుండా ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి. ఏకగ్రీవ ఎన్నికలు జరిగే పంచాయతీలకిచ్చే ప్రోత్సాహాకాలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పెంచింది. ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగేలా ప్రోత్సహిస్తాం. అన్ని పార్టీలూ దీనికి సహకరించాలని కోరుతున్నాం. గ్రామాల్లో పెద్ద మనుషులతో కూర్చుని మాట్లాడుకుని ఏకగ్రీవం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 

ప్రలోభాలకు జైలే... 
పంచాయతీ ఎన్నికల చట్టంలో అనేక మార్పులు తెచ్చాం. ఎన్నికల సమయాన్ని తగ్గించాం. హింస, ప్రలోభాలకు పాల్పడితే అనర్హత వేటు, మూడేళ్ల వరకు జైలు శిక్ష  పడుతుంది. ఎన్నికైన తర్వాత కూడా ఆరేళ్లపాటు పోటీ చేసే అవకాశం ఉండదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సగంలో ఆపేసి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు తెరమీదకు తెచ్చిన ఎన్నికల కమిషన్‌పై మాకు అనుమానాలున్నాయి. ఆయన మాటల్లోనూ దురుద్దేశం ఉందనేది స్పష్టమైంది. గత మార్చిలో ఏకగ్రీవాలు సమ్మతమన్న ఎన్నికల కమిషనర్‌ ఇప్పుడు ఏకగ్రీవాలు జరిగే పంచాయతీలను ఓ చూపు చూడాలని హెచ్చరించడం వింతగా ఉంది. 60 ఏళ్లుగా ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని అంతా కోరుకున్నారు. ఏకగ్రీవాల కోసం ప్రోత్సాహకాలూ ఇస్తున్నారు. ఇందుకు భిన్నంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మాట్లాడటం విచారకరం.

 ఉద్రిక్తతలకు టీడీపీ కుట్ర
ఎస్‌ఈసీ ఉద్దేశాల వెనుక ప్రతిపక్ష టీడీపీ ఉందనే అనుమానం కలుగుతోంది. పల్లెల్లో కక్షలు రెచ్చగొట్టి, వర్గాలుగా చీల్చే కుట్ర కోణం ఉందనే సందేహాలొస్తున్నాయి. దేవాలయాల్లో  మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసిన ఈ పార్టీ ఇప్పుడు కక్షలు, కార్పణ్యాలు రెచ్చగొట్టాలనే దుర్భుద్దితో ఉందని తెలుస్తోంది. డబ్బు, మద్యం ద్వారా నీతిమాలిన వ్యవహారాలు చేస్తే కఠిన శిక్ష తప్పదని గుర్తుంచుకోవాలి. రెచ్చగొట్టే మాటలు విని యువత బలి కావద్దు. ముఖ్యంగా టీడీపీ నేతల తప్పుడు మాటలు ఏమాత్రం వినొద్దు. జీవితాలను పాడు  చేసుకోవద్దు. గ్రామాల్లో కక్షలకు కారణం కావద్దు. 

సంక్షేమ యజ్ఞం సజావుగా సాగాలనే... 
వైఎస్సార్‌ సీపీ 50 శాతానికిపైగా ఓట్లతో అధికారంలోకొచ్చింది. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల అమలుతో 90 శాతం ప్రజలు మావైపే ఉన్నారు. టీడీపీ మాతో పోటీ పడే స్థాయిలో లేదనేది స్పష్టం. ముఖ్యమంత్రి జగన్‌ తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ యజ్ఞం ముందుకు సాగాలంటే గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి. అందుకే  ఏకగ్రీవాలను కోరుకుంటున్నాం. పార్టీ బలాబలాలు పరీక్షించుకోవడానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలున్నాయి కదా? అక్కడ చూసుకుందాం. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లు పూర్తై వైఎస్సార్‌ సీపీ 90 శాతం గెలుచుకునే పరిస్థితి ఉండటంతో టీడీపీ ఎన్నికల కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చి ఎన్నికలను నిలిపివేయించింది. వాటిని నిర్వహించకుండా పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం దురాలోచనే. దీని వెనుక టీడీపీ హస్తం ఉంది. గ్రామాల్లో కక్షలు రేపే దుర్భుద్ది ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అలజడి సృష్టించాలని చూస్తోంది. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement