మండపేటలోని కలువుపువ్వ సెంటరు
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: గౌతమి, వృద్ధగౌతమి, వైనతేయ, వశిష్ట నదుల సవ్వడితో రాజకీయ చైతన్యం మెండుగా ఉండే తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పు ఎప్పుడూ విలక్షణంగానే ఉంటుంది. అవి సార్వత్రిక ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా.. ఏ ఎన్నికలైనా ఇక్కడి ఓటర్ల తీర్పు ఏకపక్షంగానే ఉంటుంది. ఆ తీర్పునకు ప్రాంతాలు, పార్టీలు, వర్గాలు అనే వ్యత్యాసం ఉండదు. ఇందుకు 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలే నిదర్శనం. నాటి ఎన్నికల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 14 చోట్ల వైఎస్సార్‌సీపీకి తూర్పు ఓటర్లు పట్టం కట్టారు. తాజాగా పార్టీ రహితంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం 90 శాతం ఆ పార్టీ అభిమానుల్నే గెలిపించారు. వారం రోజుల్లో జరగనున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో సైతం పంచాయతీ ఫలితాలే పునరావృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా రెండు నగరపాలక సంస్థలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలు.. ఈ జిల్లాలో ఉన్నాయి. వీటిలో కాకినాడ నగరపాలక సంస్థకు పాలకవర్గం ఉంది. పంచాయతీల విలీన వివాదం న్యాయస్థానంలో ఉండటంతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు జరగడం లేదు. తుని, అమలాపురం, మండపేట, పెద్దాపురం, సామర్లకోట, రామచంద్రపురం, పెద్దాపురం మున్సిపాలిటీలకు, గొల్లప్రోలు, ముమ్మిడివరం, ఏలేశ్వరం నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మొత్తం 268 వార్డులుండగా 35 ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారంతా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే.
► 1959లో ఆవిర్భవించిన తుని మున్సిపాలిటీ పేరున ఒక అరుదైన రికార్డు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 30 వార్డుల్లోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థులే విజయం సాధించారు. ప్రస్తుతం 30 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా.. 15 వార్డులలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఎన్నికలు జరిగే 15 వార్డుల్లో 10 చోట్ల గెలుపుపై వైఎస్సార్‌సీపీ ధీమాగా ఉంది.
► కేరళ తరువాత కొబ్బరికి పుట్టిల్లు కోనసీమలో ఏ కైక మున్సిపాలిటీ అమలాపురంలో కూడా వైఎస్సార్‌సీపీకే అనుకూలంగా ఉంది. స్వాతం్రత్యానంతరం 1948లో ఏర్పాటైన ఈ మున్సిపాలిటీలో గత టీడీపీ హయాంలో ఆ పార్టీ 22 వార్డులు, వైఎస్సార్‌సీపీ 8 వార్డుల్లో గెలుపొందాయి. ఈసారి 30 వార్డుల్లో ఇప్పటికే ఆరు వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఎన్నికలు జరిగే 24 వార్డుల్లో 20కిపైనే వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టణాన్ని ఆనుకుని ఉన్న మూడు మేజర్ పంచాయతీలు కామనగరువు, బండార్లంక, పేరూరుల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు సర్పంచులుగా విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఫలితాలే పునరావృతం కానున్నాయని అంచనా.
► ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న మండపేటలో ఈసారి ఆ పార్టీ ఎదురీదుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 43 పంచాయతీలకు 31 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులను ప్రజలు ఎన్నుకున్నారు. పట్టణ సమీపంలోని టీడీపీ ఓటమి ఎరుగని ఏడిద, నేలటూరు, మారేడుబాక, అర్తమూరు తదితర పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయం సాధించడంతో మున్సిపల్ ఎన్నికల్లోను అదే ఒరవడి కనిపిస్తోంది.
► పెద్దాపురంలోని 29 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్‌సీపీ సునాయసంగా గెలిచే అవకాశాలున్నాయి. మిగిలిన వార్డుల్లో సైతం పారీ్టకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. పట్టణానికి దగ్గర్లోని గుడివాడ, ఆర్‌బీ కొత్తూరు, కట్టమూరు, దివిలి వంటి పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ పాగా వేయడంతో మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతం కానున్నాయి.
► టీడీపీకి కంచుకోట అయిన సామర్లకోటలో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మున్సిపాలిటీ సమీపాన వేట్లపాలెం, మేడపాడు మేజర్ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీలోని 31 వార్డుల్లో రెండింటిని వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 20 నుంచి 22 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
► రామచంద్రపురంలోని 28 వార్డుల్లో 10 వార్డులను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. 12 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందే సూచనలున్నాయి.
పిఠాపురంలో 30 వార్డులున్నాయి. ఒక వార్డును ఏకగ్రీవంగా గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ మరో 26 వార్డుల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి.
నగర పంచాయతీల్లో..
వాణిజ్యపంటల కేంద్రమైన గొల్లప్రోలు నగర పంచాయతీలో 20 వార్డులున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ చెరిసగం గెలుచుకున్నాయి. టీడీపీ అధికారబలంతో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచినవ్యక్తిని లోబరుచుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 15 వార్డులకుపైగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముమ్మిడివరం, ఏలేశ్వరం నగర పంచాయతీ పీఠాలను సైతం వైఎస్సార్‌సీపీ కైవశం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శకంగా అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు పల్లె ప్రజలతో పాటు పట్టణ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment