సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం రికార్డులను తిరగరాసింది. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 52.63 శాతం ఓట్లను వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. 82.60 శాతం వార్డుల్లో విజయ కేతనం ఎగుర వేసింది. పురపాలక ఎన్నికల్లో పోలైన ఓట్ల సరళి వైఎస్సార్‌సీపీ జైత్రయాత్రకు తార్కాణంగా నిలుస్తోంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు రెండేళ్లుగా విజయవంతంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి విధానాలకు ప్రజామోదం లభించిందన్నది స్పష్టమైంది. 11 కార్పొరేషన్లలో 45,80,762 ఓట్లు ఉన్నాయి. వాటిలో పోలింగ్ రోజున 27,36,268 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో 57,847 ఓట్లు చెల్ల లేదు. దాంతో 26,78,421 ఓట్లు చెల్లిన ఓట్లుగా గుర్తించి వాటిని ఓట్ల లెక్కింపులో పరిగణనలోకి తీసుకున్నారు.
► 75 మున్సిపాలిటీల్లో 30,13,702 ఓట్లు ఉన్నాయి. వాటిలో 21,06,200 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 38,426 ఓట్లు చెల్లుబాటు కాలేదు. దాంతో మిగిలిన 20,67,774 ఓట్లు చెల్లినవిగా గుర్తించి వాటిని ఓట్ల లెక్కింపులో పరిగణనలోకి తీసుకున్నారు.
► మొత్తం మీద 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో 75,94,464 ఓట్లలో 48,42,468 ఓట్లు పోలయ్యాయి. వాటిలో 96,273 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 47,46,195 ఓట్లు చెల్లినవిగా గుర్తించి ఓట్ల లెక్కింపులో పరిగణనలోకి తీసుకున్నారు.
52.63 శాతం ఓట్లు ‘ఫ్యాన్’కే
► 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో మొత్తం చెల్లిన 47,46,195 ఓట్లలో వైఎస్సార్‌సీపీ 24,97,741 ఓట్లు దక్కించుకుంది. అంటే 52.63 శాతం ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్‌కు వచ్చాయి. టీడీపీకి కేవలం 14,58,346 ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీ 30.73 శాతం ఓట్లకే పరిమితమైంది.
► 11 కార్పొరేషన్లలో 26,78,421 చెల్లిన ఓట్లలో వైఎస్సార్‌సీపీకి 13,19,466 ఓట్లు పడ్డాయి. అంటే నగర పాలక సంస్థల్లో 50 శాతం ఓట్లను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. టీడీపీకి కేవలం 8,35,534 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ 31 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది.
► 75 మున్సిపాలిటీల్లో మొత్తం 20,67,774 చెల్లిన ఓట్లలో 11,78,275 ఓట్లు వైఎస్సార్‌సీపీకి పడ్డాయి. అంటే పురపాలక సంఘాల్లో 57 శాతం ఓట్లు వైఎస్సార్‌సీపీకే దక్కాయి. టీడీపీ కేవలం 6,22,812 ఓట్లతో 30 శాతానికి పరిమయింది.
2,265 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ జయభేరి
► 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో మొత్తం మీద 2,742 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు. వాటిలో వైఎస్సార్‌సీపీ 2,265 వార్డుల్లో జయభేరి మోగించింది. అంటే వైఎస్సార్‌సీపీ రికార్డు స్థాయిలో ఏకంగా 82.60 వార్డుల్లో విజయకేతనం ఎగుర వేసింది.
► 11 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించిన 620 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 515 వార్డుల్లో విజయ దుందుభి మోగించింది. అంటే 83.06 శాతం వార్డుల్లో ఘన విజయం సాధించింది. దీంతో 11 మేయర్ స్థానాలు వైఎస్సార్‌సీపీకి దక్కనున్నాయి. అంటే 100 శాతం విజయం సాధించింది.
► 75 పురపాలక సంఘాలు /నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించిన 2,122 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 1,750 వార్డుల్లో గెలుపొందింది. అంటే 82.46 శాతం వార్డులను చేజిక్కించుకుంది.
► 75 మున్సిపాలిటీల్లో 97.33 శాతం వైఎస్సార్‌సీపీ పరమయ్యాయి. 73 మున్సిపాలిటీల్లో 90 శాతానికిపైగా వార్డులను దక్కించుకుంది. ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో మైదుకూరు పురపాలక సంఘాన్ని దక్కించుకునే అవకాశాలున్నాయి. ఇక తాడిపత్రి పురపాలక సంఘం ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠ భరితంగా మారింది.
► రాష్ట్రంలో 10 పురపాలక సంఘాల్లో 100 శాతం వార్డుల్లో గెలిచి వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులూ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక తుని, కనిగిరి, వెంకటగిరి, ధర్మవరం, రాయచోటి, ఎర్రగుంట్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డుల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయడంతో ఆ 10 పురపాలక సంఘాల్లో ప్రతిపక్షమన్నదే లేకుండా పోయింది.
మరో రెండు అడుగులు ముందుకు..
గత సార్వత్రిక ఎన్నికల్లో (2019) వైఎస్సార్‌సీపీ దాదాపు 50 శాతం ఓట్లను సాధించి ఘన విజయం సాధించింది. అప్పట్లో టీడీపీకి 39.99 శాతం ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ.. దాదాపు రెండేళ్లుగా చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు, విప్లవాత్మక నిర్ణయాల కారణంగా ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరింతగా ఆదరించారని స్పష్టమైంది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సింహభాగం గెలుపొందడటం, నిన్నటి పురపాలక ఎన్నికల్లో ఏకంగా 52.63 ఓటు బ్యాంకును సాధించడం విశేషం. టీడీపీ మాత్రం 30.73 శాతానికే పరిమితమైంది. అంటే దాదాపు 9 శాతం ఓటు బ్యాంకును కోల్పోయింది. ఇదే సమయంలో బీజేపీ, జనసేనలకు ఉన్న కాస్తోకూస్తో ఓటు బ్యాంకు సైతం భారీగా గల్లంతయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment