
గుజ్జర్లపూడి ప్రమీల, బొజ్జా రామయ్య
ముమ్మిడివరం/పిఠాపురం/సత్తెనపల్లి: తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలో వైఎస్సార్‌సీపీ ధాటికి ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయి. మొత్తం 20 వార్డుల్లో 14 వార్డులను అధికార పార్టీ కైవసం చేసుకోగా టీడీపీ కేవలం ఆరింటికే పరిమితమైంది. కాగా, 17వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొంతు సత్యశ్రీనివాస్.. జనసేనకు చెందిన జక్కంశెట్టి బాలకృష్ణపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.
ఒక్క ఓటుతో కౌన్సిలర్ పదవి
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మునిసిపాలిటీలో ఐదో వార్డు కౌన్సిలర్‌గా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొజ్జా రామయ్య ఒక్క ఓటు మెజార్టీతో గెలిచారు. తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్క ఓటు మాత్రమే ఎక్కువ సాధించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య రీకౌంటింగ్ నిర్వహించిన అధికారులు చివరకు ఒక్క ఓటు మెజారిటీతో రామయ్య గెలిచినట్టు ప్రకటించారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రెండు ఓట్లతో గెలుపు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి 8వ వార్డు నుంచి పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ రెబల్ అభ్యర్థి గుజ్జర్లపూడి ప్రమీల రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రమీలకు 585, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రేపూడి విజయకుమారికి 584, టీడీపీ అభ్యర్థి గుజ్జర్లపూడి ఝాన్సీకి 48 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో ప్రమీల గెలుపొందడంతో రీకౌంటింగ్ చేయాలని అధికార పార్టీ అభ్యర్థి రేపూడి విజయకుమారి కోరారు. రీకౌంటింగ్‌లో ప్రమీలకు మరో ఓటు పెరిగి 586 ఓట్లు రావడంతో 2 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment