విజయవాడలో అభిమానుల కేరింతలు
మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌సీపీ దేశంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసి ప్రభంజనం సృష్టించింది. ‘ఫ్యాన్’ ప్రభంజనంతో 97.33 శాతం మున్సిపాలిటీలలో పాగా వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కీలక నిర్ణయాలకు ప్రజలు పట్టం కట్టారు. ప్రతిపక్ష పెద్దలు ఎంతగా రెచ్చగొట్టినా, కుట్రలకు తెరలేపినా.. తమ తీర్పు ఇదేనని తేల్చి చెప్పారు. అటు న్యాయ రాజధాని.. ఇటు పరిపాలనా రాజధాని.. మధ్యలో శాసన రాజధానిలోనూ విస్పష్ట తీర్పునిచ్చారు.
ఈ ఎన్నికలపై సీఎం జగన్ ఒక్క మాట మాట్లాడింది లేదు.. ఓటు వేయండని అడిగింది లేదు. పాలనలో తన మార్క్ ఏమిటో స్పష్టంగా చూపారు.. కష్ట కాలంలో అందరికీ అండగా నిలి చారు. మాటలు కాదు.. చేతల ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు.. సంక్షేమాభివృద్ధికి పెద్ద పీట వేశారు. రెండేళ్లు పూర్తవకుండానే ఇంత చేస్తే, ఇంకా అవకాశం ఇస్తే మరింత చేస్తారని జనం నమ్మారు. ఆ నమ్మకాన్ని ఓట్ల రూపంలో చూపిం చారు. హుందాతనాన్ని మరచిన విపక్షాలకు కర్రు కాల్చి వాత పెట్టారు.. బాధ్యతతో మెలగాలని హితవు పలికారు.
(సాక్షి, అమరావతి): పురపాలక ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టారు. ‘ఫ్యాన్’ను హోరెత్తించారు. దాదాపు రెండేళ్లుగా ప్రగతిదాయక, సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు మనస్ఫూర్తిగా దీవించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు.. అన్ని జిల్లాల్లోనూ పార్టీ అఖండ విజయం సాధించింది. ఫలితాలు ప్రకటించిన 11 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాల్లోని 2,742 డివిజన్లు, వార్డుల్లో ఏకగ్రీవాలతోసహా 2,265 వార్డుల్లో విజయ దుందుభి మోగించింది. టీడీపీ కేవలం 348 డివిజన్లు, వార్డులకే పరమితమైంది. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టిన 11 నగర పాలక సంస్థలనూ వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 75 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో గతంలోనే 4 పురపాలక సంఘాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 71 పురపాలక సంఘాల్లో 69 చోట్ల పూర్తి మెజార్టీ సాధించింది. మైదుకూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక తాడిపత్రిలో సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. తిరుగులేని ప్రజా మద్దతుతో వైఎస్సార్‌సీపీ సృష్టించిన రాజకీయ సునామీలో ప్రతిపక్ష టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయింది. నగర పాలక సంస్థల్లో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ.. మున్సిపాలిటీలల్లోనూ బోర్లా పడింది. కనీసం ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. ఇక జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలు అసలు పత్తా లేకుండా పోయాయి.
11 నగర పాలక సంస్థల్లోనూ వైఎస్సార్‌సీపీ జెండా
ఫలితాలు ప్రకటించిన 11 నగర పాలక సంస్థల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. ఒక్క చోట కూడా టీడీపీ ప్రభావం చూపించలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన రాజధానిగా ప్రకటించిన మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించింది. మొత్తం 98 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 58 వార్డుల్లో ఘన విజయం సాధించింది.
► విజయవాడ నగర పాలక సంస్థ(జీఎంసీ)లో మొత్తం 64 వార్డుల్లో 49 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేసింది. గుంటూరులో 57 వార్డులకు గాను 44 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది.
► తిరుపతి, కడప, అనంతపురం, విజయనగరం నగర పాలక సంస్థల్లో 50 చొప్పున వార్డులు ఉన్నాయి. ఆ నాలుగు చోట్లా కూడా వైఎస్సార్‌సీపీ 48 వార్డుల చొప్పున కైవసం చేసుకుని విజయఢంకా మోగించింది.
► మచిలీపట్నం నగర పాలక సంస్థలో 50 వార్డులకు గాను 44, ఒంగోలు నగర పాలక సంస్థలో 50 వార్డులకు గాను 41, చిత్తూరు నగర పాలక సంస్థలో 50 వార్డులకు గాను 46, కర్నూలులో 52 వార్డులకు గాను 41 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ జయ కేతనం ఎగురవేసింది.
మునిసిపాలిటీల్లో విజయ ఢంకా
ఎన్నికలు జరిగిన 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో మొత్తం 2,794 వార్డులున్నాయి. కోర్టు తీర్పు కారణంగా ఏలూరు కార్పొరేషన్‌లో ఓట్ల లెక్కింపు జరగలేదు. ఈ కార్పొరేషన్‌లో 50 వార్డులు ఉన్నాయి. మిగతా 2,744 వార్డులకు గాను 2,265 వార్డులలో (ఏకగ్రీవాలతో సహా) వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. వాటిలో 11 నగర పాలక సంస్థల్లో 515 వార్డులు, పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల్లో 1,750 వార్డులు ఉన్నాయి.
► నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల్లో కలిపి టీడీపీ కేవలం 348 వార్డుల్లోనే గెలిచింది. వాటిలో నగర పాలక సంస్థల్లో 78 వార్డులు, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 270 వార్డులు ఉన్నాయి.
► జనసేన.. నగర పాలక సంస్థల్లో 7 వార్డుల్లో, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 19 వార్డుల్లో గెలిచింది. జనసేన మిత్రపక్షమైన బీజేపీకి నగర పాలక సంస్థల్లో కేవలం ఒక వార్డు, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 8 వార్డులు దక్కాయి.
► స్వతంత్రులు నగర పాలక సంస్థల్లో 14 వార్డులు, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 39 వార్డుల్లో గెలిచారు. ఇతరులు నగర పాలక సంస్థల్లో 5 వార్డులు, పురపాలక సంఘాల్లో 15 వార్డుల్లో గెలిచారు.
► పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో వైఎస్సార్‌సీపీ అన్ని వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకుంది. దాంతో అక్కడ చైర్‌పర్సన్ పీఠాలు వైఎస్సార్‌సీపీ పరమయ్యాయి. ఇవి పోగా, ఎన్నికలు జరిగిన 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో రాయచోటి, ఎర్రగుంట్ల, కనిగిరి, ధర్మవరం, వెంకటగిరి, తుని పురపాలక సంఘాల్లో వైఎస్సార్‌సీపీ అన్ని వార్డుల్లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది.
► నిడదవోలు, ఆదోని, డోన్, సూళ్లూరుపేట, గుత్తి, ప్రొద్దుటూరు పురపాలక సంఘాల్లో ఒక్కో వార్డు మినహా మిగిలిన అన్ని వార్డుల్లో విజయం సాధించింది. మొత్తం మీద 75 పురపాలక సంఘాల్లో 73 మున్సిపల్ చైర్మన్ పీఠాలను వైఎస్సార్‌సీపీ సునాయసంగా గెలుచుకోనుంది.
టీడీపీ కుదేలు
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పురపాలక ఎన్నికల్లో పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయింది. ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించడంతో టీడీపీ కనీస పోటీ కూడా ఇవ్వలేక కుదేలైపోయింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్.. ఎన్నికల్లో ప్రచారం చేసినప్పటికీ, ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించేందుకు యత్నించినప్పటికీ ప్రజలు టీడీపీని ఏమాత్రం నమ్మలేదు. చిత్తుగా ఓడించారు.
► అనంతపురంలో ఒక్క వార్డులోనూ గెలవకపోగా, విజయనగరం, తిరుపతి, కడప నగర పాలక సంస్థల్లో కేవలం ఒక్కో వార్డుకే పరిమితమైంది. చిత్తూరులో 3, మచిలీపట్నంలో 5, కర్నూలులో 8, గుంటూరులో 9 వార్డుల చొప్పున మాత్రమే గెలిచింది. విశాఖపట్నంలో 30, విజయవాడలో 14 వార్డుల్లో విజయం సాధించింది. మొత్తం మీద ఫలితాలు ప్రకటించిన 11 నగర పాలక సంస్థల్లో 9 చోట్ల రెండంకెల లోపు వార్డులతో సరిపెట్టుకుంది.
పురపాలక సంఘాల్లో చిత్తు చిత్తు
► పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో టీడీపీ కేవలం 270 వార్డుల్లోనే గెలిచింది. 9 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో ఆ పార్టీ బోణి కూడా కొట్టలేకపోయింది. రామచంద్రాపురం, నరసాపురం, పెడన, చీరాల, సూళ్లూరుపేట, నాయుడుపేట, ప్రొద్దుటూరు, ఆదోని, నందికొట్కూరు, ఆత్మకూరు (కర్నూలు జిల్లా), గుత్తిలో ఆ పార్టీ కేవలం ఒక్కో వార్డులో మాత్రమే గెలిచింది. కేవలం నాలుగు పురపాలక సంఘాల్లో మాత్రమే టీడీపీ రెండంకెల సంఖ్యలో వార్డుల్లో విజయం సాధించింది.
సోదిలోలేని బీజేపీ, జనసేన
► పొత్తు పెట్టుకుని తొలిసారి పోటీ చేసిన బీజేపీ, జనసేన పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఆ పార్టీలను అసలు ఓటర్లు ఏమాత్రం పట్టించుకోలేదు. జనసేన నగర పాలక సంస్థల్లో 7 వార్డుల్లో, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 19 వార్డుల్లో మాత్రమే గెలిచింది.
► బీజేపీ నగర పాలక సంస్థల్లో ఒక వార్డులో, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 8 వార్డులకే పరమితమైంది. స్వతంత్రులు నగర పాలక సంస్థల్లో 14 వార్డుల్లో, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 39 వార్డుల్లో గెలిచారు. ఇతరులు నగర పాలక సంస్థల్లో 5 వార్డుల్లో, పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 15 వార్డుల్లో గెలుపొందారు.
మూడు ప్రాంతాల్లోనూ మూకుమ్మడి తీర్పు
► రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజలు మూడు రాజధానులకు ఆమోదం తెలుపుతున్నామన్నట్లు తమ తీర్పును స్పష్టంగా ప్రకటించారు.
► ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించిన 9 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. వాటిలో మొత్తం 237 వార్డులకు గాను ఆ పార్టీ 164 వార్డుల్లో విజయభేరి మోగించింది. టీడీపీ కేవలం 57 వార్డుల్లోనే గెలిచింది. విజయనగరం, విశాఖపట్నం నగర పాలక సంస్థల్లోని 148 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 106 వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం 31 వార్డులకే పరిమితమైంది.
► కోస్తా ప్రాంతంలోని 6 జిల్లాల్లోని 36 పురపాలక సంఘాలు /నగర పంచాయతీల్లో వైఎసార్‌సీపీ విజయకేతనం ఎగరవేసింది. వాటిలోని 973 వార్డుల్లో ఆ పార్టీ ఏకంగా 812 వార్డుల్లో ఘన విజయం సాధించింది. వైఎస్సార్‌సీపీ రెబల్స్ 12 వార్డులు దక్కించుకున్నారు. టీడీపీ కేవలం 114 వార్డుల్లోనే గెలిచింది. జనసేన 16 వార్డులకు, బీజేపీ 2 వార్డులకే పరిమితమయ్యాయి. స్వతంత్రులు 11 వార్డులు, ఇతరులు 5 వార్డులు గెలుచుకున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు నగర పాలక సంస్థల్లోని మొత్తం 221 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 178 వార్డుల్లో విజయ ఢంకా మోగించింది. టీడీపీ కేవలం 34 వార్డులకే పరిమితమైంది.
► రాయలసీమలోని 4 జిల్లాల్లో 27 పురపాలక సంఘాలు / నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 25 చోట్ల వైఎసార్‌సీసీ తిరుగులేని విజయాన్ని సాధించింది. రాయలసీమలో మొత్తం 913 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 778 వార్డుల్లో విజయం సాధించింది. వైఎస్సార్‌సీపీ రెబల్స్ 3 వార్డులు దక్కించుకున్నారు. టీడీపీ కేవలం 99 వార్డుల్లోనే గెలిచింది. బీజేపీ ఆరు వార్డుల్లో, జనసేన ఒక వార్డులో గెలిచాయి. స్వతంత్రులు 17 వార్డులు, ఇతరులు 9 వార్డులు సాధించారు.
► రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం నగర పాలక సంస్థల్లో మొత్తం 252 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 231 వార్డుల్లో ఘన విజయం సాధించింది. టీడీపీ కేవలం 13 వార్డులతో సరిపెట్టుకుంది.
2014లో అలా.. 2021లో ఇలా...
2014లో జరిగిన పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 939 వార్డుల్లో గెలిచింది. అప్పటి ఎన్నికల్లో 36.52 శాతం వార్డులను కైవసం చేసుకుంది. టీడీపీ 1,424 వార్డుల్లో గెలిచి 55.39 శాతం వార్డుల్లో విజయం సాధించింది. కాగా ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ఏకంగా 2,265 వార్డులను కైవసం చేసుకుంది. 81.07 శాతం వార్డుల్లో విజయ దుందుభి మోగించింది. టీడీపీ కేవలం 348 వార్డులకే పరమితమైంది. ఆ పార్టీ కేవలం 12.70 శాతం వార్డులతో సరిపెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment