కోటి ఆశలు.. కొంగొత్త ఆకాంక్షలు | AP First Assembly Session Starts From Today | Sakshi
Sakshi News home page

కోటి ఆశలు.. కొంగొత్త ఆకాంక్షలు

Published Wed, Jun 12 2019 3:29 AM | Last Updated on Wed, Jun 12 2019 11:09 AM

AP First Assembly Session Starts From Today - Sakshi

సాక్షి, అమరావతి : నవ్యాంధ్రలో నూతన శకానికి తెరతీసిన 15వ శాసనసభ తొలిసారిగా నేడు కొలువుదీరనుంది. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆశలను మోసుకుంటూ భవితకు భరోసానిస్తూ తొలిసారిగా బుధవారం సమావేశం కానుంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అఖండ మెజార్టీతో ప్రజలు ఓ పార్టీకి అధికారం అప్పగించిన శాసనసభ. చరిత్ర సృష్టిస్తూ సుదీర్ఘ పాదయాత్ర చేసిన జననేత ముఖ్యమంత్రిగా సభా నాయకుడి హోదాను అలంకరించబోతున్న సభ కూడా ఇదే. 25 మంది మంత్రుల్లో ఏకంగా 19 మంది కొత్త మంత్రులుగా అధికార స్థానాల్లో కూర్చొనబోతున్న సభ. గత 30 ఏళ్లలో అత్యధిక శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు చట్టసభలో అడుగుపెట్టబోతున్న సభ కూడా ఇదే.. అందుకే బుధవారం తొలిసారిగా కొలువుదీరనున్న 15వ శాసనసభపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. గత శాసనసభ ప్రజాస్వామ్యానికి మిగిల్చిన మరకలను చెరిపేస్తూ.. గత ఐదేళ్ల కష్టాల నుంచి సాంత్వన కోరుతూ కొత్త శాసనసభ వైపు ఆశగా చూస్తున్నారు.

ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యోన్ముఖులయ్యారు. ప్రజాస్వామ్య విలువలకు పట్టం కడుతూ సుపరిపాలనకు మార్గం సుగమం చేసేలా శాసనసభ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. గత శాసనసభ చరిత్రలో మిగిల్చిన మరకలను పారదోలేలా చట్టసభలపై ప్రజలకు విశ్వాసం పెరిగేలా శాసనసభ ఉండాలని కృతనిశ్చయంతో ఉన్నారు. 15వ శాసనసభ తొలి సమావేశాలు బుధవారం నుంచి ఐదురోజుల పాటు జరగనున్నాయి. బుధ, గురువారాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. శాసనసభ స్పీకర్‌ ఎన్నికను గురువారం నిర్వహిస్తారు. 

అఖండ విజయంతో వైఎస్సార్‌సీపీకి అధికార స్థానం 
రాష్ట్రం యావత్తూ కొత్త శాసనసభ వైపు చూస్తోంది. 15వ శాసనసభ తొలిసారి బుధవారం కొలువుదీరనుండటమే దీనికి కారణం. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నో విశిష్టతలు సంతరించుకున్న ఈ కొత్త శాసనసభ పట్ల ప్రజల్లో అంతటి ఆసక్తి వ్యక్తమవుతోంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ రెండో శాసనసభ ఇది. నవ్యాంధ్ర ప్రదేశ్‌లోనే కాదు గతంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంత భారీ మెజార్టీతో ఓ పార్టీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. శాసన సభలోని 175 సీట్లలో 151 సీట్లు గెలుచుకుని వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించింది.

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా దాదాపు 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లు దక్కించుకుని ఓ పార్టీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. గత ఐదేళ్లు పరిపాలించిన టీడీపీ ఘోర పరాజయం పాలై కేవలం 23 సీట్లకు పరిమితం కావడం గమనార్హం. 14వ శాసనసభలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల స్థానాలు అటు ఇటూ మారాయి. గత శాసనసభలో సమర్థ ప్రతపక్షంగా వ్యవహరించిన వైఎస్సార్‌సీపీ ప్రజల మనసు గెలుచుకుని 15వ శాసనసభలో అధికార పక్షంగా అడుగు పెట్టనుంది. గత శాసనసభలో కేవలం 1.50 శాతం అధిక ఓట్లతో అధికారాన్ని దక్కించుకున్న టీడీపీ ఐదేళ్ల పాలనలో ఘోర వైఫల్యం చెంది ప్రజల తిరస్కారానికి గురై ప్రస్తుత శాసనసభలో ప్రతిపక్ష స్థానానికి చేరింది.  

తిరుగులేని ప్రజా మద్దతుతో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌
అశేష ప్రజాభిమానంతో తిరుగులేని జననేతగా గుర్తింపు పొందిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనసభలో బుధవారం అడుగుపెట్టనున్నారు. అద్వితీయమైన ప్రజాదరణ ఉన్న నేత సభా నాయకుడి స్థానాన్ని అధిష్టించడం రాష్ట్ర చరిత్రలో ఇది మూడోసారి. గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీ రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి సభా నాయకులుగా రాష్ట్ర శాసనసభకు వన్నె తెచ్చారు. మళ్లీ కొత్త చరిత్రను లిఖిస్తూ వైఎస్‌ జగన్‌ అద్వితీయమైన ప్రజాదారణతో పార్టీని విజయపథంలో నడిపించి ప్రజా ముఖ్యమంత్రిగా శాసనసభలో సభానాయకుడి స్థానాన్ని అలంకరించనున్నారు.

2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గత శాసనసభలో ప్రధాన ప్రతిపక్షనేతగా సమర్థవంతంగా పనిచేసిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన అసెంబ్లీ వేదికగా పోరాడారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. శాసనసభ విలువలు, రాజ్యాంగ నిబంధనలు, ప్రజాస్వామ్య ప్రమాణాల కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. అయినప్పటికీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో ఆ శాసనసభ సమావేశాలను పూర్తిగా బహిష్కరించి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. ఏకంగా 14 నెలల పాటు 3,648 కి.మీ సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం రగిలించారు. నవరత్నాల పథకాలతో రాజన్న రాజ్యం తీసుకు వస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆయన చిత్తశుద్ధి, నాయకత్వ పటిమను గుర్తించిన ప్రజలు వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని  కట్టబెట్టారు. 


ఘోర పరాజయంతో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు
గత శాసనసభలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఈసారి ప్రధాన ప్రతిపక్ష నేత స్థానంలోకి మారనున్నారు. అంతేకాదు ప్రధాన ప్రతిపక్షం అత్యంత బలహీనంగా ఉండటం గమనార్హం. గత శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీకి 67 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ప్రతిపక్షంగా మిగిలిన టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. గత శాసనసభలో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన వారిలో 23 మంది ఎమ్మెల్యేలను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ప్రలోభాలకు గురిచేసి రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేర్చుకున్నారు. కాగా 15వ శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల కాగా... టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యే స్థానాలే దక్కడం దేవుడు రాసిన స్క్రిప్టు అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత శాసనసభలో రాజ్యంగ విలువలను కాలరాస్తూ ప్రతిపక్ష ఎమ్మల్యేల కొనుగోలుకు కొమ్ము కాసిన స్పీకర్‌ కోడెల శివ ప్రసాదరావు ఇటీవల ఎన్నికల్లో పరాజయం పాలై శాసనసభలో అడుగుపెట్టలేకపోవడం విశేషం.

ఉనికి కోల్పోయిన జాతీయ పార్టీలు  
జాతీయ పార్టీలకు రాష్ట్ర 15వ శాసనసభలో స్థానం లేకుండా పోయింది. జాతీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం లేకుండా రాష్ట్ర శాసనసభ కొలువు దీరడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల నుంచి 15వ శాసనసభకు ఎవరూ ఎన్నిక కాలేదు. కాగా, కొత్తగా ఆవిర్భవించిన ప్రాంతీయ పార్టీ జనసేన 15వ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఆ పార్టీ తరఫున తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి రాపాక వరప్రసాద్‌ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు.

అత్యధికులు కొత్త మంత్రులు, కొత్త ఎమ్మెల్యేలే 
రెండు దశాబ్దాలకు ఓసారి రాష్ట్ర శాసనసభలోకి అత్యధికంగా కొత్త తరం నేతలు రావడం సహజ పరిణామం. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ 15వ శాసనసభలోకి రికార్డు స్థాయిలో కొత్త ఎమ్మెల్యేలు అడుగు పెట్టనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఎన్టీ రామారావు రాజకీయ ప్రవేశం సమయం 1983లో, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో 2004లో రాష్ట్ర శాసనసభకు అత్యధికంగా కొత్త ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ గత రికార్డులు తిరగరాసింది. దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అత్యధిక శాతం మంది మంత్రుల హోదాలో తొలిసారిగా శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలోని 25 మందిలో 19 మంది తొలిసారి అమాత్యులు అయినవారే కావడం విశేషం. 

సామాజిక న్యాయానికి ప్రతీక 
సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన కొత్త శకానికి 15వ శాసనసభ ప్రాతినిధ్యం వహించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు దాదాపు 60 శాతం మంత్రి పదవులు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తొలిసారి ఐదు మంది ఉప ముఖ్యమంత్రి హోదాలో శాసనభలో ఆసీనులయ్యే మహోన్నత అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కల్పించారు. అందులోనూ ఆ ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నాలుగు కేటాయించడం సామాజిక న్యాయం పట్ల ఆయన చిత్తశుద్ధికి తార్కాణంగా నిలుస్తోంది. వారిలో ఒకరు గిరిజన మహిళ కూడా ఉండటం ముదావహం. రాష్ట్రంలో తొలిసారి ఓ ఎస్సీ మహిళ హోం మంత్రి హోదాలో శాసనభలో ప్రవేశించనున్నారు.  శాసనసభ స్పీకర్‌ పదవిని కూడా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యేగా ఎన్నికైన బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే నిర్ణయించడం పట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. 

ప్రజల ఆకాంక్షలకు దీపిక
ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. అందుకు శాసనభను ఆలయంగా భావించి ప్రజలకు త్రికరణశుద్ధిగా పనిచేస్తానని మాటిచ్చారు. అందుకు తగ్గట్లుగానే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మేనిఫెస్టో అమలుకు శ్రీకారం చుట్టారు. పింఛన్ల పెంపుదలపై తొలి సంతకం చేశారు. తాను పాదయాత్రలో గుర్తించిన ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యుక్తులయ్యారు. సోమవారం నిర్వహించిన తన మంత్రివర్గ తొలి సమావేశంలోనే దాదాపు 50 కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అదే విధంగా రానున్న ఐదేళ్లలో మేనిఫెస్టో అమలు.. ప్రజా సంక్షేమం.. రాష్ట్ర ప్రగతికి శాసనభను వేదికగా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృతనిశ్చయంతో ఉన్నారు. సుపరిపాలనకు మార్గం సుగమం చేస్తూ రాష్ట్రంలో రాజన్న పాలనకు 15వ శాసనసభ వేదికగా నిలుస్తుందని రాజకీయ పరిశీలకులతోపాటు ప్రజలూ విశ్వసిస్తున్నారు. 

నేటి ఉదయం 11.05 గంటలకు సభ ప్రారంభం
రాష్ట్ర 15వ శాసనసభ తొలి సమావేశం బుధవారం ఉదయం 11.05 గంటలకు ప్రారంభించాలని ముహూర్తం నిర్ణయించారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత ముఖ్యమంత్రి, సభానాయకుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబు, మంత్రులు, సభ్యులతో అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 175 మంది సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ముగియని పక్షంలో గురువారం ఉదయం కొనసాగిస్తారు. 13వ తేదీన స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు.

అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, మంత్రులు ఆయన్ను ఆధ్యక్ష స్థానం దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేయనున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన సీతారాంకు సభ అభినందనలు తెలియజేస్తుంది. మరుసటి రోజు అంటే 14వ తేదీ ఉదయం 9 గంటలకు ఉభయసభల సభ్యులనుద్ధేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు. కొత్త  ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలను గవర్నర్‌ తన ప్రసంగం ద్వారా స్పష్టం చేయనున్నారు. గవర్నర్‌ ప్రసంగం ముగిశాక సభ వాయిదా పడుతుంది. 15, 16వ తేదీలు సెలవు రోజులు కావడంతో సభ తిరిగి 17వ తేదీన ప్రారంభం అవుతుంది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగుతుంది. సభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెబుతారు. దీంతో ఈ సమావేశాలు ముగుస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement