సాక్షి, అమరావతి: ఓటరు దేవుడి నిర్ణయం వెల్లడయ్యేం దుకు ఇక 48 గంటలే మిగిలింది. ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఇప్పటికే ప్రజాతీర్పు ఎలా ఉండనుందో తెలిసినా అధికారికంగా ఫలితాలు ప్రకటించే దాకా నిరీక్షణ తప్పదు. పోలింగ్ పూర్తయిన తరువాత ఓట్లు లెక్కించేందుకు గతంలో ఎప్పుడూ ఇన్ని రోజుల సమయం లేదు. రాష్ట్రంలో గత నెల 11వ తేదీన అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించినా చివరి దశ ఆదివారం ముగియడంతో ఓటర్ల తీర్పు కోసం ఈసారి ఏకంగా 43 రోజులు ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,118 మంది అభ్యర్ధులు ఎన్నికల్లో తలపడ్డారు. 25 ఎంపీ స్థానాలకు 319 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. వైఎస్సార్‌సీపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేసింది. టీడీపీ లోపాయికారీ పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగింది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పరస్పరం సహకరించుకున్నాయి.
జగన్‌కు జైకొట్టిన ఎగ్జిట్ పోల్స్
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌కే జనామోదం లభించినట్లు తేల్చి చెప్పాయి, దీంతో ఫలితాలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. టీడీపీ మాత్రం లగడపాటి చిలక జోస్యాన్ని నమ్ముకుని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఊహలకు గురువారం మధ్యాహ్నాం తెరపడనుంది. ఈ నెల 23వతేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓటింగ్ సరళి ద్వారా ఎవరి జాతకాలు ఏమిటో మధ్యాహ్నం కల్లా తేలనున్నాయి.
వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాకే..
గురువారం ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. ఒక నియోజకవర్గంలో ఈవీఎంల లెక్కింపు అన్ని రౌండ్లు పూర్తయిన తరువాత ఐదు వీవీప్యాట్ యంత్రాలను లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. ఆ వీవీ ప్యాట్‌ల్లోని స్లిప్‌లను లెక్కించడం పూర్తయ్యాక నియోజకవర్గ ఫలితాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేసిన తరువాత అధికారికంగా వెల్లడిస్తారు. వీవీప్యాట్ యంత్రాల్లో స్లిప్‌లు లెక్కించడానికి సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి ఆలస్యమైనా ఈవీఎంలు లెక్కించిన తరువాత అనధికారికంగా ఫలితం తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment