ఆంధ్రావనిలో జగన్నినాదం | YSR Congress Party Got Above 49 percent of votes in the general election | Sakshi
Sakshi News home page

ఆంధ్రావనిలో జగన్నినాదం

Published Sat, May 25 2019 3:34 AM | Last Updated on Sat, May 25 2019 3:35 AM

YSR Congress Party Got Above 49 percent of votes in the general election - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు సగం (49.95 శాతం) ఓట్లు ‘ఫ్యాన్‌’ ఖాతాలో పడ్డాయి. ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకపోయినా, చీకటి ఒప్పందాలతో పోటీ చేసిన టీడీపీ 39.18 శాతం ఓట్లకు పరిమితమైంది. అంటే.. టీడీపీతో పోల్చితే 10.77 శాతం అధికంగా ఓట్లు సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 85 శాతానికిపైగా అంటే 151 శాసనసభ స్థానాలను.. 90 శాతానికిపైగా అంటే 22 లోక్‌సభ స్థానాలను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1962 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ.. సింగిల్‌(ఒక్కటి)గా పోటీ చేసిన ఏ పార్టీ ఇంతటి భారీ స్థాయిలో విజయం సాధించిన దాఖలాలు లేవు. 1994 ఎన్నికల్లో వామపక్షాలతో జట్టుకట్టి టీడీపీ ఇదే తరహాలో ఓట్లు సాధించినా, అది ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ సాధించిన విజయానికి సాటి రాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు, టీఆర్‌ఎస్‌ పొత్తులతో బరిలోకి దిగినా ఈ స్థాయి విజయాన్ని సాధించలేకపోయాయని గుర్తు చేస్తున్నారు. ఎలాంటి పొత్తులు లేకుండా ఈ ఎన్నికల్లో పోటీచేసిన వైఎస్సార్‌సీపీ ఆఖండ విజయం సాధించి రికార్డు సృష్టించింది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును గురువారం పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 1,56,86,511 ఓట్లను దక్కించుకుంది. 2014 ఎన్నికల్లో 1,29,31,730  ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 27,54,581 ఓట్లను అదనంగా సాధించింది. బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ గత ఎన్నికల్లో 1,34,95,305 ఓట్లు దక్కించుకోగా.. ఈ ఎన్నికల్లో 1,20,03,620 (39.18) శాతం ఓట్లకు పరిమితమైంది. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో టీడీపీ 14,91,685 ఓట్లను కోల్పోయింది. 

అన్నింటా ఏకపక్షమే 
ఈ ఎన్నికల్లో్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సింగిల్‌గా పోటీ చేసింది. టీడీపీ ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోకున్నా, పరోక్షంగా రాజకీయ పార్టీలతో అవగాహన కుదుర్చుకుని పోటీ చేసింది. అయినా సరే.. అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించింది. రాయలసీమలో 52 శాసనసభ స్థానాలకుగాను 49 స్థానాల్లో వైఎస్సార్‌సీసీ అభ్యర్థులు గెలిచారు. టీడీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. ఉత్తరాంధ్రలో 34 శాసనసభ స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 28 స్థానాల్లో ఘన విజయం సాధిస్తే, టీడీపీ అభ్యర్థులు ఆరు స్థానాల్లో అత్తెసరు మెజార్టీతో గెలిచారు. కోస్తాలో 89 శాసనసభ స్థానాలకుగాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు 74 స్థానాల్లో ఘన విజయం సాధిస్తే.. టీడీపీ అభ్యర్థులు 14 స్థానాల్లో గెలిచారు. జనసేన కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. రాయలసీమలో ఎనిమిది లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక ఉత్తరాంధ్రలో ఐదు లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిలో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధిస్తే.. శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో సాంకేతిక సమస్యల వల్ల టీడీపీ అభ్యర్థి అత్తెసరు మెజార్టీతో విజయం సాధించారు. కోస్తాలో 12 లోక్‌సభ స్థానాలకుగాను పదింటిని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటే, టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. ఇందులో గుంటూరు లోక్‌సభ పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో సాంకేతిక సమస్యల వల్ల ఐదు వేల ఓట్ల వ్యత్యాసంతో, విజయవాడ లోక్‌సభ స్థానంలో ఎనిమిది వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులు గట్టెక్కారు. అంటే.. కేవలం పది వేల లోపు ఓట్ల తేడాతో వైఎస్సార్‌సీపీ మూడు లోక్‌సభ స్థానాలను కోల్పోయినట్లు వెల్లడవుతోంది. 

వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో కూలిన కోటలు  
వైఎస్సార్‌సీపీ దెబ్బకు టీడీపీ కంచు కోటలు కుప్పకూలాయి. కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని శాసనభ, ఎంపీ స్థానాలను వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మిగతా 9 జిల్లాల్లో సింహభాగం శాసనసభ, లోక్‌సభ స్థానాలను దక్కించుకుంది. వైఎస్‌ జగన్‌ ప్రభంజనంలో ముగ్గురు మినహా బాబు మంత్రివర్గంలోని సభ్యులందరూ ఓడిపోయారు. లోకేష్‌ మంగళగిరిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. బొబ్బిలి, విజయనగరం, కురపాం రాజ వంశీకుల కోటలు కొట్టుకుపోయాయి. కోట్ల, జేసీ వంటి రాజకీయ కుటుంబాలు వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ముందు నిలబడలేకపోయాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement