ఫ్యాన్‌ గాలికి..  సై'కిల్‌' | YS Jaganmohan Reddy created Wave in AP Elections | Sakshi
Sakshi News home page

ఫ్యాన్‌ గాలికి..  సై'కిల్‌'

Published Fri, May 24 2019 4:12 AM | Last Updated on Fri, May 24 2019 5:16 AM

YS Jaganmohan Reddy created Wave in AP Elections - Sakshi

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనానికి తెలుగుదేశం పార్టీ కకావికలమైంది. 2019 ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో ఫ్యాను గాలి హోరులో తెలుగుదేశం అభ్యర్ధులు అనేక స్థానాల్లో కొట్టుకుపోయారు. స్పీకర్, మంత్రులు, సీనియర్‌ నాయకులు సైతం పరాజయం పాలయ్యారు. టీడీపీ చరిత్రలోనే కాదు, రాష్ట్ర చరిత్రలో కూడా ఏ పార్టీకి ఇలాంటి పరాభవం ఎదురుకాలేదు. ఇంతటి ఘోరమైన పరాభవాన్ని చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చవిచూసింది. హామీలన్నీ గాలికొదిలేసి.. గత ఐదేళ్లుగా చంద్రబాబు సాగించిన ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయిన ఓటర్లు టీడీపీకి గుణపాఠం చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.   
– సాక్షి, అమరావతి

మహామహుల ఓటమి
ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 20 మాత్రమే దక్కాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లోని మంత్రుల్లో అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప మినహా తక్కిన వారంతా ఓటమి చెందారు. పార్టీలో ఓటమి ఎరుగని నేతలుగా పేరుపడ్డ సీనియర్‌ నేతలు సైతం ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఇప్పటివరకు 9సార్లు ఎన్నికలు జరిగాయి. ఏనాడూ ఇంతటి ఘోరపరాభవాన్ని టీడీపీ ఎదుర్కొనలేదు. 
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావు ఎచ్చెర్లలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని, తొలిసారిగా పోటీకి దిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గొర్లె కిరణ్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. 
- సీనియర్‌ నాయకుడు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓటమిపాలయ్యారు.  
- ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఓడిపోయారు.  
- చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మంత్రి నారాయణ నెల్లూరులో పోటీచేసి వైఎస్సార్‌సీపీ గాలిలో కొట్టుకుపోయారు.  
- మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రడు, పితాని సత్యనారాయణ, జవహర్, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, అమర్‌నాధరెడ్డి.. ఇలా మంత్రులంతా ఇంటిబాటపట్టారు.  
- విశాఖ జిల్లా అరకులో వైఎస్సార్‌సీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు నక్సల్స్‌ చేతిలో హతమవ్వగా.. ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌ను టీడీపీలోకి తీసుకొని మంత్రి పదవి కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో తండ్రి చనిపోయిన సెంటిమెంటు కూడా కలసిరాక శ్రావణ్‌ ఓడిపోయారు. విచిత్రమేమంటే ఇక్కడ టీడీపీకి వచ్చిన ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. 

టీడీపీకి మాయని మచ్చ
తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంతటి ఘోర పరాభవం మాయనిమచ్చగా మిగిలిపోనుంది.ఆ పార్టీ ఇదివరకెన్నడూ ఇంత ఘోరంగా ఓడిపోలేదు. రాష్ట్ర చరిత్రలో కూడా ఇలాంటి అపజయం వేరే పార్టీకి కూడా రాలేదు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఎంతలా దూరమైందో ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేస్తోంది. గడచిన అయిదేళ్ల కాలంలో చంద్రబాబు అప్రజాస్వామిక పాలన, అవినీతి అక్రమాలు చూసిన ప్రజలు విసుగెత్తిపోయారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? ఎప్పుడు గుణపాఠం చెబుదామా? అని అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూశారు. కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, బీసీలు, నిరుద్యోగులు, విద్యార్ధులు.. ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు పాలనలో నానా అవస్థలు పడ్డారు.  

హామీలన్నీ గాలికి
2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి, బీజేపీ, జనసేన పార్టీల మద్దతులో చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు. అధికారంలోకి వచ్చాక తాను ఇచ్చిన హామీలను ఒక్కదాన్నీ నిలబెట్టుకోలేదు. వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి.. ఇలా అనేక హామీలను గాలికి వదిలేశారు. పైగా రైతులతో సహ అన్ని వర్గాల ప్రజలను తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, ఇలా ఒకరేమిటి అందరినీ వేధించారు. అంతేకాకుండా జన్మభూమి కమిటీలంటూ తన పార్టీ నాయకుల ద్వారా  ప్రజలను 
దోపిడీ చేశారు.  

వేల కోట్ల దోపిడి
రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు నుంచి అన్ని ప్రాజెక్టుల పనుల్లో, కాంట్రాక్టు పనుల్లో వేలకోట్ల మేర దోపిడీ చేశారు. ఇసుక నుంచి బొగ్గువరకు, మట్టినుంచి గనుల వరకు.. అన్ని వనరులను టీడీపీ నేతలు కొల్లగొట్టారు. అడ్డు వచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధించారు. రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదాను తన స్వార్థంకోసం ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి కేంద్రానికి తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారు. ప్రత్యేక హోదా అన్నవారిపై కేసులు పెట్టించారు. చివరకు తన రాజకీయ అవసరాలకోసం కేంద్రం నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నా ప్రజలు ఆయన మాటలు విశ్వసించలేదు. మరోవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి టీడీపీలోకి చేర్చుకోవడమే కాకుండా.. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన తీరును రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.  

ప్రజాధనం వృథా
రాష్ట్రం తీరని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీక్షలు, విదేశీ యాత్రలంటూ చంద్రబాబు వందలకోట్ల నిధులు వృధాగా ఖర్చు చేశారు. కొత్తగా రేషన్‌కార్డులు, పెన్షన్లు, నిరుపేదల చిన్నచిన్న అవసరాలకు నిధులు లేవంటూ ఇలా వృధా చేయడం ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. రైతుల నుంచి తీసుకున్న భూములను తనకు కావలసిన వారికి వందల ఎకరాలను చాలా తక్కువ ధరలకు ధారదత్తం చేశారు. పోలీసు విభాగం సహ పలు శాఖలను తన సొంత పనులకు, రాజకీయ అవసరాలకు వాడుకుంటూ వ్యవస్థలను నీరుగార్చారు. ముఖ్యంగా పోలీసు అధికారులను చట్టం ప్రకారం పనిచేయనివ్వకుండా కేవలం ప్రత్యర్థి పార్టీలను వేధించడానికి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయించడానికి ఇతర అప్రజాస్వామిక పనులకు వాడుకోవడం ప్రజలలో టీడీపీ పట్ల వ్యతిరేకతను పెంచింది. ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో ఇవన్నీ ప్రతిబింబించి తెలుగుదేశాన్ని మట్టికరిపించాయి.  ప్రస్తుతం వెలువడిన ఫలితాలు తెలుగుదేశంపై, చంద్రబాబుతో సహ ఆపార్టీ నేతలకు చెంపపెట్టులాంటిదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

తొలిసారి ఒంటరిపోటీలో దిగి
తెలుగుదేశం గతంలో ఏనాడూ ఒంటరిగా పోటీచేయలేదు. ఈసారి కూడా జనసేన, కాంగ్రెస్‌ పార్టీలతో తెరచాటు ఒప్పందాలతో చంద్రబాబు ఒంటరి పోరుకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక ద్వారా ఎన్నికల్లో గండం గట్టెక్కవచ్చన్న అభిప్రాయంతో ఇలా చేసినా ఆ ప్రయోగం వికటించినట్లు ప్రస్తుత ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. చంద్రబాబునాయుడు 1995లో తన మామ ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో గద్దెనెక్కారు. 1999లో బీజేపీ అండతో, వాజిపేయి హవాలో విజయం సాధించారు. 2004లో పొత్తుల్లో పోటీచేసి ఓడిపోయి బీజేపీ వల్లనే ఓటమి అంటూ నెపాన్ని ఆపార్టీపైకి నెట్టేశారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అంటూ పలు పార్టీలను కలుపుకొని పోటీకి దిగినా చంద్రబాబుకు పరాభవం తప్పలేదు. 2014లో తిరిగి బీజేపీతో పొత్తులు, మోడీ ప్రభంజనం, జనసేన మద్దతుతో అత్తెసరు ఓట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఈ గణాంకాలు చూస్తే ఏనాడూ చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ఒంటరిగా పోటీచేసి గెలుపొందలేదు. కేవలం ఇతర పార్టీల మద్దతుతోనే బతికిబట్టకట్టిందన్నది తేటతెల్లం. ఈ ఎన్నికల్లోనూ ఎన్ని మాయోపాయాలు పన్నినా ప్రజలు టీడీపీని, చంద్రబాబును గట్టిగా తిరస్కరించారు. 

పలు జిల్లాల్లో ఖాతా తెరవని వైనం
గతంలో తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆపార్టీ కొన్ని జిల్లాల్లో ఖాతాలనూ తెరవలేకపోయింది. కడప, నెల్లూరు, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ఒక్క స్థానాన్నీ గెల్చుకోలేకపోయింది. కొన్నిజిల్లాల్లో ఒకటి, రెండు స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ‘పార్టీకి ఇంతటి ఘోరమైన ఫలితాలు వస్తాయని కలలో కూడా ఊహించలేకపోతున్నాం. ఒకప్పుడు అన్నివర్గాలు ముఖ్యంగా బీసీలు వెన్నెముకగా ఉన్న టీడీపీకి ఇంటి ఘోరపరాజయం ఎదురవ్వడానికి పార్టీ అధిష్ఠానం తీరే కారణం. ఒంటెత్తుపోకడలు, మితిమీరిన అవినీతి అక్రమాలు, విచ్చలవిడితనంతో ప్రభుత్వమంటేనే ప్రజల్లో ఏవగింపు కలిగేలా చంద్రబాబు చేశారు. పార్టీకి, పార్టీ యంత్రాంగానికి దూరం పెంచేశారు. నాయకులే కాదు గ్రామస్థాయిలో కూడా జన్మభూమి కమిటీల పేరిట చేసిన దుర్మార్గాలు ప్రజల్లో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. వాటిఫలితమే ప్రస్తుత ఫలితాలు’ అని పార్టీ సీనియర్‌నేత ఒకరు వ్యాఖ్యానించారు. 

ఎన్ని మాయోపాయాలు పన్నినా
ఈ ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు చేయని కుట్రలు, కుతంత్రాలు లేవు. ఒకపక్క జనసేనతో లోపాయికారీ ఒప్పందాలు కొనసాగిస్తూ.. మరోవైపు ఆ పార్టీని వేరుగా బరిలోకి దించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేందుకు ప్రయత్నించారు. ఏకంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అపాయింట్‌మెంటు కూడా ఇవ్వని మాయవతితో మాట్లాడించి బీఎస్పీతో జనసేనకు పొత్తులు కుదిర్చారు. ఆ పార్టీ అభ్యర్ధులను తానే నిర్ణయించడమే కాకుండా.. ఏకంగా వారికి కావలసిన ఆర్థిక వనరులు కూడా చంద్రబాబు సమకూర్చారు. మరోవైపు  కేఏపాల్‌ను ప్రజాశాంతి పార్టీని బరిలోకి దించి ఓట్లు చీల్చేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పోలిన విధంగా కండువాలు, జెండాలు ఏర్పాటు చేయించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఫ్యాను గుర్తును పోలి ఉండేలా హెలికాప్టర్‌ గుర్తును కూడా ప్రజాశాంతి పార్టీకి రావడం ద్వారా ఓట్లు చీలుతాయనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాయమాటలు, చేష్టలు గమనించి ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చకుండా మోసం చేయడమే కాకుండా .. ఈ ఎన్నికల ముందు మళ్లీ పసుపు కుంకుమ, పెన్సన్ల మొత్తం పెంపు, నిరుద్యోగ భృత వంటివి తెరపైకి తెచ్చినా చంద్రబాబును ప్రజలు విశ్వసించలేదు.

నానాటికీ తీసికట్టుగా టీడీపీ
ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన సీట్లు చూస్తుంటే.. గతంలో ఏ పార్టీకి ఇంతట ఆదరణ లేదన్నది సుస్పష్టమవుతోంది. 1983లో ఎన్టీరామారావు టీడీపీని స్థాపించి పోటీచేసిన స్థానాలు 290 కాగా.. గెలిచిన స్థానాలు 204 అంటే 70.30 శాతం స్థానాలను గెల్చుకున్నారు. అదే 1985లో వివిధ పార్టీలతో పొత్తులు కుదుర్చుకొని 250 స్థానాల్లో టీడీపీ పోటీచేయగా.. 202 (80శాతం) చోట్ల గెలిచింది. మళ్లీ 1994లో వివిధ పార్టీలతో పొత్తుల్లో 251 స్థానాల్లో పోటీచేసిన టీడీపీ 216 (86శాతం) స్థానాల్లో గెలుపొందారు. అదే చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. 1999లో బీజేపీతో పొత్తుల్లో 269 స్థానాల్లో పోటీచేసిన టీడీపీ 180 (66 శాతం) స్థానాలకు పరిమితమైంది.

ఆ తరువాత 2004, 2009లో వరుసగా ఓటమి పాలైంది. 2014లో బీజేపీ, జనసేన పొత్తుల్లో 163 స్థానాల్లో పోటీచేసి 102 (62 శాతం) స్థానాల్లో నిలిచింది. ఆ ఎన్నికల్లో టీడీపీ కి సీట్లు పెరిగినా ఓట్ల శాతం మాత్రం చాలా తక్కువే. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కన్నా కేవలం 1.96 ఓట్లు మాత్రమే అదనంగా సాధించి ప్రభుత్వంలోకి వచ్చింది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. రాత్రివరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీడీపీ 175 నియోజకవర్గాల్లో తొలిసారిగా ఒంటరిగా పోటీచేసింది. ఆ పార్టీకి కేవలం 20 స్థానాలు మాత్రమే సాధించగలిగింది. ఇక ఓట్ల శాతాలు భారీగా తగ్గినట్లు ఆయా అభ్యర్దులకు వచ్చిన మెజార్టీలు చెబుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement