నిరంకుశ నిర్ణయాలు, అవినీతి వ్యవహారాలు, చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో పరాభవం భారంతో టీడీపీ అధినాయకత్వం పట్ల అసమ్మతి జ్వాలలు రాజుకుంటున్నాయి.కౌంటింగ్‌కు కొద్ది రోజుల ముందు వరకు కూడా నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షల పేరుతో హడావుడి చేసిన చంద్రబాబు అసమ్మతి భయంతోనే ఇప్పుడు ఆ అంశాన్ని పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు.‘రా... కదలిరా...’ అంటూ దివంగత ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో స్పందించి టీడీపీకి మద్దతిచ్చిన వర్గాలు ఒక్కో ఎన్నికలో ఆ పార్టీకి దూరమవుతూ వచ్చాయి. సొంతమామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సారథ్యంలో టీడీపీ దయనీయ స్థితికి చేరుకుంటోంది.రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యపార్టీకీ ఎదురుకాని విధంగా తాజా ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలవడానికి చంద్రబాబు వైఖరే కారణమని పార్టీ సీనియర్ నేతలు, శ్రేణులు మండిపడుతున్నాయి.
– సాక్షి, అమరావతి
బీజేపీ హవాలో రెండుసార్లు గట్టెక్కిన బాబు
టీడీపీ ఆవిర్భావం తరువాత 1983 నుంచి 2014 వరకు అసెంబ్లీకి ఎనిమిదిసార్లు ఎన్నికలు జరగగా ఐదుసార్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ నాయకత్వంలో మూడుసార్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ హయాంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఇతర పార్టీలు కూడా లబ్ధి పొందాయి. 1994 ఎన్నికల్లో టీడీపీ చరిత్రలో అత్యధిక స్థానాలు గెల్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అడ్డదారిలో ప్రభుత్వాన్ని, పార్టీని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు బాబు తిలోదకాలిచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, రూ.2కే కిలో బియ్యం, రూ.50కే హార్స్‌పవర్ విద్యుత్తు లాంటి పథకాలకు చంద్రబాబు స్వస్తి పలికి ప్రజలపై పెనుభారం మోపారు.
టీడీపీని ధనవంతులు, కాంట్రాక్టర్లకు మేలు చేసే పార్టీగా మార్చేశారు. ఈ ధోరణితో ఒకప్పుడు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వర్గాలన్నీ క్రమేపీ దూరమయ్యాయి. చంద్రబాబు నాయకత్వంలో 2019 వరకు ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న టీడీపీ 1999, 2014లో మాత్రమే విజయం సాధించింది. గెలిచిన రెండుసార్లు కూడా బీజేపీ హవాలో టీడీపీ గట్టెక్కడం గమనార్హం. అయితే గతంలో ఓట్ల శాతం, సీట్లతో పోలిస్తే చాలా తగ్గాయి. చంద్రబాబు సొంతంగా పార్టీని ఏనాడూ విజయపథంలో నడిపించలేకపోయారు. ఎన్టీఆర్ హయాంలో అత్యధికంగా 216 అసెంబ్లీ సీట్లు, 46.21 శాతం ఓట్లు సాధించిన టీడీపీ చంద్రబాబు నాయకత్వంలో 23 సీట్ల స్థాయికి దిగజారిపోవడం, ఓట్ల శాతం క్షీణించడం పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందనేందుకు నిదర్శనం.
వ్యతిరేకించిన కాంగ్రెస్‌తోనే చేతులు కలిపి....
కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించగా చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ అదే పార్టీతో పొత్తులు కుదుర్చుకోవడం సొంత శ్రేణులనే నివ్వెరపరిచింది. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి జైలు పాలు చేయించారు. తాను గెలిచే పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులు కుదుర్చుకున్న చంద్రబాబుకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. ఈ పరిణామంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తెరవెనుక ఒప్పందాలు చేసుకున్నారు. జాతీయ స్థాయిలో ఆ పార్టీతో అంటకాగారు. ఈ పరిణామాలు సొంత శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లోనూ వ్యతిరేకతను పెంచాయి. ఫలితంగా ఎన్నడూ లేని రీతిలో పరాజయాన్ని చవిచూసింది.
10 శాతానికిపైగా ఓట్ల వ్యత్యాసంతో వైఎస్సార్‌సీపీ విజయభేరీ..
2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి, టీడీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 1.96 శాతం మాత్రమే కావడం గమనార్హం. అతి తక్కువ ఓట్ల ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు ఐదేళ్లుగా చేసిన అరాచకాలు, అక్రమాలను భరించలేక రాష్ట్ర ప్రజలు తాజా ఎన్నికల్లో గట్టి గుణపాఠం నేర్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 151 అసెంబ్లీ సీట్లు రాగా టీడీపీ 23 సీట్లు, జనసేన 1 స్థానానికి పరిమితమయ్యాయి. వైఎస్సార్ సీపీకి, టీడీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం ఏకంగా 10.7 శాతం ఉండడం గమనార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 1,56,86,511 ఓట్లు (49.95 శాతం) రాగా, టీడీపీకి 1,23,03,620 ఓట్లు (39.18 శాతం) వచ్చాయి.
దళితులపై దారుణమైన వ్యాఖ్యలు..
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ గాలికి వదిలేయడంతో రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, విద్యార్ధుల్లో ఆ పార్టీపై వ్యతిరేకత పెరిగింది. సంక్షేమ పథకాల్లో కోత పెట్టడమే కాకుండా ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ చంద్రబాబు దారుణంగా అవమానించే వ్యాఖ్యలు చేయడంతో ఆ వర్గాలు టీడీపీకి దూరమయ్యాయి. విజయవాడ సహా పలుచోట్ల ప్రార్థనా మందిరాలను కూల్చడం, పుష్కరాలను ప్రచారం కోసం వాడుకుని అమాయకుల మృత్యువాతకు కారణం కావడంతో ప్రజలు ఓటు ద్వారా తమ తీర్పును వెల్లడించారు. చంద్రబాబు ఒంటెత్తు పోకడల వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని పార్టీలో సీనియర్ నేతలతో పాటు క్యాడర్ పేర్కొంటోంది. కాంగ్రెస్‌తో పొత్తును ప్రజలు సహించరని, తరిమి కొడతారని చింతకాయల అయ్యన్నపాత్రుడు లాంటి వారు బహిరంగంగానే చెప్పారు. పార్టీకి ఎలాంటి సేవలు చేయని నారాయణ, సుజనాచౌదరి లాంటి వారికి ప్రాధాన్యం కల్పించడం, కుటుంబరావు లాంటి షేర్ బ్రోకర్లకు ప్రభుత్వంలో చోటు కల్పించడం, గ్రామాల్లో జన్మభూమి కమిటీల అరాచకాలు తదితర అంశాలను జీర్ణించుకోలేని పార్టీ శ్రేణులు ఈసారి ఎన్నికల్లో టీడీపీకి దూరమయ్యాయి.
తిరుగుబాటు భయం!
ఈ ఎన్నికల్లో దాదాపుగా మంత్రులంతా పరాజయం పాలవడం, ముఖ్యమంత్రి తనయుడు ఘోరంగా ఓడిపోవడం, నాలుగు జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోవడం లాంటి పరిణామాలతో టీడీపీలో అసమ్మతి స్వరాలు ఊపందుకుంటున్నాయి. కౌంటింగ్‌కు ముందు చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలను ప్రారంభించినా కార్యకర్తలు, నేతల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాల అనంతరం సమీక్షలు నిర్వహించడానికి కూడా ఆయన ధైర్యం చేయడం లేదు. పార్టీలో తన పట్ల అసమ్మతి తీవ్రంగా ఉండడంతో ఈ తరుణంలో సమీక్షలు నిర్వహిస్తే తిరుగుబాటు తప్పదనే ఆందోళన ఆయనలో వ్యక్తమవుతోంది. ఏటా మే 27, 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. ఓటమి తప్పదని ముందే గ్రహించిన చంద్రబాబు ఈసారి మహానాడు నిర్వహించడం లేదని ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment