ఆంధ్రప్రదేశ్‌కు ఇక శుభదినాలే | Posani Krishna Murali Comments On AP Election Results | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌కు ఇక శుభదినాలే

Published Sat, May 25 2019 4:58 AM | Last Updated on Sat, May 25 2019 4:58 AM

Posani Krishna Murali Comments On AP Election Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి శుభదినాలు మొదలయ్యాయని ప్రముఖ సినీ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా గెలుపొందాలని, గెలిస్తే బట్టలు పెడతానని దేవుళ్లకు మొక్కుకున్నానని చెప్పారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. జీవితంలో అన్ని కోరికలు తీరిపోయాయని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నది తన చివరి కోరిక అని, అది కూడా నెరవేరిందని పేర్కొన్నారు. తానెంత సంతోషంగా ఉన్నానో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కూడా అంతే సంతోషంగా ఉన్నారని చెప్పారు. జగన్‌ గొప్ప ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోవాలని, మంచిపేరు తెచ్చుకోవాలని పోసాని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి ఏపీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అన్ని మీడియాలు తనకు సహకరించాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు గురించి తాను ఎంత గట్టిగా మాట్లాడానో అంతే స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాయని ప్రశంసించారు. 

పోసాని ఇంకా ఏం మాట్లాడారంటే...  
‘‘ఎన్నికల్లో ప్రజల తీర్పును చూసి చంద్రబాబులో మార్పు వచ్చినట్లుంది. అందుకే జగన్‌మోహన్‌రెడ్డికి, ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. నిన్నటి వరకు జగన్‌ను వాడు వీడు, రౌడీ, గూండా, ఫ్యాక్షనిస్టు అని సంబోధించిన చంద్రబాబు నేడు మనసు మారిపోయి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు గతంలో జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి, మీడియాను అడ్డం పెట్టుకొని జైలుకు పంపించారు. జగన్‌ అవినీతిపరుడు కాదని ప్రజలు గ్రహించారు. ఆయనను కుట్రపూరితంగా, అన్యాయంగా జైలుకు పంపించారని గుర్తించారు. జగన్‌పై అడ్డదారిలో పెట్టించిన కేసులను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబును కోరుతున్నా.  

లోకేశ్‌కు ఓటేయడం న్యాయమా?   
ఎన్నికల తేదీ కూడా తెలియని వ్యక్తి నారా లోకేశ్‌ను ప్రజలు ఎలా గెలిపిస్తారు? ముఖ్యమంత్రుల కుమారులు ఎన్నికల్లో గెలవాలని ఎక్కడా లేదు. ముఖ్యమంత్రులు కూడా మట్టి కరిచారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి తండ్రి గతంలో సర్పంచిగా పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించారు. ఆయన తల్లి కూడా సర్పంచిగా పనిచేసి నిరంతరం ప్రజల కష్టాలు తీర్చేవారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రామకృష్ణారెడ్డికి ప్రజలు ఓట్లు వేయడం న్యాయమా లేక ఎన్నికల తేదీ తెలియని నారా లోకేశ్‌కు వేయడం న్యాయమా?   

పవన్‌ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారు   
పవన్‌ కల్యాణ్‌ కొత్త పార్టీ స్థాపిస్తూనే చంద్రబాబు నాయుడు సీనియర్‌ అని ఆయనకే మద్దతు తెలిపితే పార్టీ ఇమేజ్‌ని ఏవిధంగా పెంచుతాడు? అధికారంలో ఉన్న నాయకులను పక్కనపెట్టి జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడం పవన్‌కు మాత్రమే సాధ్యపడింది. అందుకే పవన్‌ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. పవన్‌ను ఒక సోదరుడిగా భావించి చెపుతున్నా.. కొడతాను, తంతాను అన్న పదాలను ఇకనైనా నీ డిక్షనరీలోంచి తీసెయ్‌. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడో ఫ్రంట్‌ అంటూ పొరపాటు చేశారు’’ అని పోసాని కృష్ణమురళి అభిప్రాయపడ్డారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement