సాక్షి, అమరావతి: అమ్మ దీవించింది. అవ్వా తాతలు ఆశీర్వదించారు. అక్కచెల్లెమ్మలు ఆత్మీయత పంచారు.. అన్నా తమ్ముళ్లు అండగా నిలిచారు. అఖిలాంధ్ర ఓటర్లు జననేతకు బ్రహ్మరథం పట్టారు. వయో భేదం లేకుండా వైఎస్ జగన్ విజయాన్నే కోరుకున్నారు. కులమతాలు, ప్రాంతాలతో ప్రమేయం లేకుండానే జగన్ వైపే జనం నిలిచారు. వెన్నుపోటు రాజకీయం బతుకు భరోసా లేకుండా చేస్తుందనే కసితో జనం ఓటేశారు. విపక్ష నేతగా ప్రజల కోసం పోరాడిన జగన్‌ను గెలిపించుకోవడం బాధ్యతగా భావించారు. భావితరాల కోసం ఆయననే గెలిపించాలన్న ఆకాంక్ష వెలిబుచ్చారు. ఇప్పుడు గెలిచింది ప్రజలు.. వారి విశ్వాసం. నమ్మకం.
అవధులు లేని ఆనందం ‘నా అన్నే సీఎం అయ్యాడు’ అని ప్రతీ చెల్లీ భావిస్తోంది. ‘నా తమ్ముడే సీఎం అయ్యాడు’ అని ప్రతీ అక్కా ఆనందపడుతోంది. ‘మనవడొచ్చాడు’ అంటూ అవ్వాతాతల్లో ఆనందం కన్పిస్తోంది. ‘గెలిచామన్నా’ అనేది తమ్ముళ్ల సంతోషం. ఇక రైతే రాజని కర్షకులు.. కష్టానికి ఫలితమొచ్చిందని కార్మికులు భావిస్తున్నారు. చావు బతుకుల్లో పోరాడుతున్న రోగులకు జగన్ గెలుపు ధైర్యాన్నిస్తుంది. ఆరోగ్యశ్రీ ఆయువు పోస్తుందనే ధీమా తెచ్చింది. రాష్ట్రానికి హోదా దక్కుతుందన్న ధీమా ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.
జిమ్మిక్కులు లెక్కచేయని అక్కచెల్లెమ్మలు..
తాయిలాలు ఇస్తే ఎన్నికల్లో మహిళలు ఓట్లు వేయరనే విషయం ఈ ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును ఏ అక్కాచెల్లీ నమ్మలేదు. జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి తీరాలని తీర్మానించుకున్నారు. ‘ఈ తాయిలం మాకెందుకు... జగన్ గెలిస్తే ఇంతకన్నా ఎన్నో రెట్లు మేలు జరుగుతుంది’ అని చెప్పి మరీ అక్కాచెల్లెమ్మలు ఓట్లేశారు. అవ్వాతాతలదీ అదే దారి. పాదయాత్రలో కష్టాలు చెప్పినప్పుడు జగన్ కరిగిపోయాడు. అధికారంలోకొస్తూనే అందరికీ పింఛన్ ఇస్తానన్నాడు. ఇచ్చే పింఛన్ పెంచుతానన్నాడు. చంద్రబాబు హడావుడిగా పింఛన్ పెంచేశారు. జగన్ మాటతోనే ఇంత కదలిక వస్తే.. ఆయనే సీఎం అయితే.. ఆ నమ్మకమే అవ్వాతాతలు జగన్‌కు ఓటేసేలా చేసింది.
అదిగో మన నేత....
‘అదిగో ఆయనే. మన ఇంటికొచ్చింది ఆయనే. మనతో కలిసి నడిచిందీ ఆయనే’ ఆనందం మేళవించిన అనుభూతిలో జనహృదయ స్పందన ఇది. నిన్నటిదాకా తమ ముందే తిరిగిన నేత రాష్ట్రాధినేత అవ్వడంతో ప్రజలు మురిసిపోతున్నారు. పాదయాత్రలో జగన్‌తో సెల్ఫీ దిగని వ్యక్తి లేరు. హారతులు పట్టని పల్లె లేదు. ఆదరించని ఊరు లేదు. మండువేసవిలోనూ, జోరువానలోనూ జననేతతో అడుగులో అడుగులేశారు. ఎముకలు కొరికే చలిలోనూ తమ నేత కోసం పడిగాపులుగాశారు. ప్రజల కష్టాలను విన్నారు. వారికి భరోసా ఇచ్చారు. పాదయాత్రలో ప్రతీ అడుగూ జన ప్రభంజనమే. తమ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న వ్యక్తి.. తమవాడే అన్న నమ్మకం కలిగించిన వ్యక్తి ముఖ్యమంత్రి పీఠమెక్కాడనే గర్వం జనంలో స్పష్టంగా కన్పిస్తోంది.
రాక్షస సంహారమే...
వైఎస్సార్‌సీపీ అఖండ విజయాన్ని ప్రజలు నరకాసుర సంహారమే అంటున్నారు. కష్టాలను అనుభవించిన వాళ్లు, కసితో ఓటేసిన వారి అభిప్రాయమది. ఐదేళ్లుగా గిట్టుబాటు ధర లేని రైతు గుండె మంట నుంచీ వచ్చే మాటిది. రుణమాఫీ ద్వారా మోసపోయిన రైతుల, దగాపడ్డ అక్కచెల్లెమ్మల ఆవేదనిది. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆక్రందనల ఫలితమిది. జన్మభూమి కమిటీల దోపిడీ మూకలపై జనం తిరుగుబాటిది. అధికార అహంకారంపై ప్రభుత్వ ఉద్యోగుల కన్నెర్ర ఫలితం ఇది. సహజ వనరులను దోచుకుని, నల్లధనంతో విపక్ష ఎమ్మెల్యేలను సంతలో çపశువుల్లా కొన్న అప్రజాస్వామిక విధానాలకు చెప్పిన గుణపాఠమిదని ప్రజలు భావిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీకి మహిళల బ్రహ్మరథం
తమను గెలిపిస్తుందని చంద్రబాబు కోటి ఆశలు పెట్టుకున్న పసుపు– కుంకుమ పథకం టీడీపీని చావు దెబ్బే తీసింది. ఐదేళ్లుగా అనేక రకాలుగా మోసం చేసినా రాష్ట్రంలో 95 లక్షల మంది దాకా ఉన్న డ్వాక్రా మహిళలకు ఎన్నికల ముందు ఏదో ఒక తాయిలం ఇస్తే వాళ్ల ఓట్లన్నీ తమకే పడతాయని భ్రమల్లో ఉన్న టీడీపీ అధినేతకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు మహిళలను విశేషంగా ఆకట్టుకోవడంతో వైఎస్సార్‌సీపీకి వారంతా బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లుండగా.. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 3,13,33,631 మంది ఓటు వేశారు. మొత్తం ఓటర్లలో 1,98,79,421 మంది మహిళా ఓటర్లే. కాగా 1,57,87,759 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహిళలు అత్యధికంగా ఓట్లు వేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా.. మొత్తం సీట్లను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది.
మాఫీ పేరుతో మాయ
మొత్తం 1.98 కోట్ల మంది మహిళా ఓటర్లలో దాదాపు కోటి మంది డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 2014 ఎన్నికల వాగ్దానంలో భాగంగా తాను అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. జీరో వడ్డీ పథకానికి నిధులు మంజూరు చేయలేదు. ఎన్నికలకు నెల రోజుల ముందు పసుపు–కుంకుమ పేరుతో ఎన్నికల తాయిలం ప్రకటించారు. సరిగ్గా పోలింగ్‌కు రెండురోజుల ముందు నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి డ్వాక్రా మహిళలకు డబ్బులిచ్చారు. దీంతో మహిళల ఓట్లన్నీ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకే పడ్డాయని, గెలుపు తమదేనని చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రచారం చేశారు. తీరా టీడీపీకి మహిళలు దిమ్మ తిరిగిపోయే ఫలితాన్నివ్వడంతో డీలాపడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment