గెలుపు సూత్రం ఇదే.. | YS Jaganmohan Reddy winning formula is Reliability and values | Sakshi
Sakshi News home page

గెలుపు సూత్రం ఇదే..

Published Fri, May 24 2019 7:16 AM | Last Updated on Fri, May 24 2019 7:16 AM

YS Jaganmohan Reddy winning formula is Reliability and values - Sakshi

ఇచ్చిన మాటకు ఆరునూరైనా కట్టుబాటు...చెక్కుచెదరని ధైర్యంతో ముందడుగు...ఆపదొస్తే అందరికీ నేనున్నాననే ఓదార్పు...అవసరమైతే కొండనైనా ఢీ కొట్టే తెగింపు...జన యాత్రలతో మమేకమయ్యే ఓర్పు... ఉక్కు సంకల్పంతో పోరాడే నేర్పు...భవితకు భరోసా ఇచ్చే చల్లని చూపు...‘అన్నా’ అంటూ అక్కున చేర్చుకునే పిలుపు...నైతిక విలువలే ప్రధానమనే తీర్పు...సడలని దీక్షకు అతడే ఓ గుర్తింపు...

సాక్షి, అమరావతి: మాట తప్పని, మడçమ తిప్పని రాజకీయ వారసత్వానికి లభించిన తిరుగులేని అఖండ విజయమిది. పాదయాత్రికుడి కష్టం ఫలించిన తరుణమిది. ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడించిన దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడి, విశ్వసనీయతకు ప్రజలు పట్టం గట్టిన రోజు ఇది. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో తెలుగు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలనే ఆలంబనగా చేసుకుని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన నవరత్నాలపై ప్రజలకు కుదిరిన నమ్మకమిది. దృఢ వ్యక్తిత్వం, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాలనే ఆయుధంగా చేసుకుని ప్రత్యర్థుల కుట్రలను తుత్తునియలు చేస్తూ ఒంటి చేత్తో తన పార్టీకి అఖండ విజయాన్ని సాధించి పెట్టారు.  

 2014 ఎన్నికల ఓటమిని ఓ అనుభవంగా తీసుకున్న జగన్, తొలుత తన బలాబలాలేమిటో కచ్చితంగా అంచనా వేసుకోవడంతోపాటు పార్టీలో ఉన్న లోటుపాట్లపై క్షుణ్నంగా అధ్యయనం చేశారు. పార్టీ శ్రేణులను ప్రజలతో మమేకమయ్యే విధంగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు సర్కార్‌ మోసంతో నిరాశకు లోనైన రైతులు, మహిళలు, నిరుద్యోగులకు అండగా నిలబడ్డారు. ఎన్నో దీక్షలు, ఆందోళనలు ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అధికార పక్షం శాసనసభలో స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని గొంతు నొక్కే యత్నం చేసినా చలించకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనే స్థాయికి పార్టీని ప్రజలకు చేరువ చేశారు.  

 ప్రజాసంకల్పంతో ప్రజల హృదయాల్లోకి.. 
ప్రజా సమస్యలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి వైఎస్‌ జగన్‌ చేసిన ప్రజాసంకల్ప యాత్ర వారి హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. 341 రోజుల పాటు 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేయడం దేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచింది. ఈ యాత్రలో మహిళలు, వృద్ధులు, యువకులు ఇలా అన్ని వయసుల వారు, వర్గాల వారు జగన్‌ను తమ ఆత్మీయుడిగా అక్కున చేర్చుకున్నారు. పాదయాత్ర ద్వారా జనాదరణ పొందడాన్ని జీర్ణించుకోలేని శక్తుల కుట్ర ఫలితంగా జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. దీన్ని అధికార పక్షం గేలి చేస్తూ మాట్లాడినప్పటికీ.. జగన్‌ సంయమనం, హుందాతనం ఆకట్టుకున్నాయి. 

నవరత్నాలతో నమ్మకం: అన్ని వర్గాల లబ్ధికి జగన్‌ ప్రకటించిన నవరత్నాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ‘గడప గడపకూ వైఎస్సార్‌’, ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’, ‘వైఎస్సార్‌ కుటుంబం’ వంటి కార్యక్రమాలను చేపట్టారు. 175 నియోజకవర్గాల్లో ప్రతి బూత్‌లోనూ పార్టీ జెండా పట్టుకుని ఓట్లేయించే కార్యకర్తలను పార్టీకి సమకూర్చుకోగలిగారు. శాసనసభ, లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో జగన్‌ ఎక్కడా రాజీ పడలేదు. ఇడుపులపాయలో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఒకే రోజు ప్రకటించి సంచలనం సృష్టించారు. 

ప్రత్యేక హోదాపై రాజీలేని పోరు: ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టని టీడీపీ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ జగన్‌ పోరాటానికి నడుం కట్టారు. కేంద్రంలో ఎన్డీయే మిత్రపక్షంగా, భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా ఊసు ఎత్తకపోవడం ఆ పార్టీ ప్రతిష్టను ప్రజల్లో మసకబార్చింది. జగన్‌ ప్రత్యేక హోదా అవసరం ఎంతగా ఉందో తెలియజెబుతూ యువభేరీ సదస్సులు నిర్వహించారు. గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేశారు. 

ఫలించిన బీసీ డిక్లరేషన్‌
బీసీల అభ్యున్నతికి ప్రత్యేక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి వారు చేసిన సూచనలకు అనుగుణంగా ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో జగన్‌ చేసిన బీసీ డిక్లరేషన్‌ వెనుకబడిన వర్గాలపై ఒక మంత్రంగా పనిచేసింది. ప్రభుత్వ పరిధిలోని నామినేటెడ్‌ పదవులన్నింటిలోనూ, కాంట్రాక్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం కేటాయిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా 41 మంది బీసీ అభ్యర్థులకు అసెంబ్లీ సీట్లు, ఏడుగురికి ఎంపీ సీట్లను కేటాయించారు. వీటన్నింటికీ తోడు ‘నిన్ను నమ్మం బాబూ’.. ‘బైబై బాబూ’.. ‘రావాలి జగన్‌– కావాలి జగన్‌’ నినాదాలు ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఒక నాయకుడు పట్టుదలతో పోరాడితే దక్కేది ఘన విజయమేనని నిరూపించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement