![Rise of CM Jagan YSRCP seen before general elections - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/20/LAYOUT-1_PAGE-1R.jpg.webp?itok=OB5jr0MV)
సాక్షి, అమరావతి: ‘సందేహమే లేదు.. రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ సునామీ సృష్టించడం తథ్యం.. అందుకు తార్కాణమే చరిత్రాత్మక రాప్తాడు సభ’ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభకు సుమారు పది నుంచి 11 లక్షల మంది అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారని అంచనా. అదీ రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 52 శాసనసభ స్థానాల పరిధి నుంచే ఇంత భారీ స్థాయిలో ప్రజలు కదలిరావడం గమనార్హం.
రాప్తాడులో 250 ఎకరాల సువిశాల మైదానంలో ‘సిద్ధం’ సభను వైఎస్సార్‌సీపీ నిర్వహించింది. ఇందులో 200 ఎకరాల విస్తీర్ణంలో సభను వీక్షించడానికి ఏర్పాట్లు చేసింది. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో ఇసుకేస్తే రాలనంత స్థాయిలో సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో 1982లో పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో విజయవాడలో కృష్ణా నది ఇసుక తిన్నెలపై సీపీఎం నిర్వహించిన సభకు 5 లక్షల మంది హాజరయ్యారని అప్పట్లో అంచనా.
1990లో వరంగల్‌లో వంద ఎకరాల మైదానంలో పీపుల్స్ వార్ నిర్వహించిన రైతు కూలీ సభకు పది లక్షల మంది హాజరయ్యారని నిర్వాహకులు ప్రకటించారు. కానీ.. వాస్తవంగా ఆ సభకు ఆరు నుంచి ఏడు లక్షల మంది వచ్చారని అంచనా. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఎన్టీఆర్ ఆధ్యర్యంలో టీడీపీ నిర్వహించిన సభకు పది లక్షల మంది ప్రజలు హాజరయ్యారని నిర్వాహకులు చెప్పుకున్నారు. కానీ.. పరేడ్ గ్రౌండ్స్‌తోపాటు పక్కనున్న జింఖానా గ్రౌండ్స్, బౌసన్పోలో గ్రౌండ్ కలిసినా దాని విస్తీర్ణం 90 ఎకరాలే.
ఈ లెక్కన ఆ సభకు వాస్తవంగా హాజరైంది ఐదు లక్షల మందేనని అంచనా. ఈ మూడు సభలకు ఉమ్మడి రాష్ట్ర పరిధిలోని 23 జిల్లాల నుంచి ప్రజలను సమీకరించడం గమనార్హం. ఇక 2010లో వరంగల్‌లో వంద ఎకరాల విస్తీర్ణంలో టీఆర్‌ఎస్ నిర్వహించిన తెలంగాణ గర్జన సభకు పది లక్షల మంది హాజరయ్యారని నిర్వాహకులు చెప్పుకున్నారు. కానీ.. ఆ సభకు వాస్తవంగా హాజరైంది ఏడు లక్షల మందికి కాస్తా అటూ ఇటూ అని అంచనా.
వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు సభే అతి పెద్ద ప్రజా సభ అని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పెత్తందారులపై పోరుకు సిద్ధమా? అంటూ సీఎం జగన్ పిలుపునిస్తే.. 10 నుంచి 11 లక్షల మంది ఒక్కసారిగా పిడికిలి పైకెత్తి, దిక్కులు పిక్కటిల్లేలా ‘మేం సిద్ధమే’ అంటూ ప్రతిస్పందించారు. ఇది రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జైత్ర యాత్రతో సునామీ సృష్టించడం ఖాయమనడానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
రణనినాదమై మారుమోగుతున్న ‘సిద్ధం’
‘మేమంతా సిద్ధం’ అని వైఎస్సార్‌సీపీ శ్రేణుల ప్రతిస్పందన రణ నినాదమై రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి జనవరి 27న భీమిలి.. ఈనెల 3న దెందులూరు.. ఆదివారం రాప్తాడులలో ‘సిద్ధం’ పేరుతో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన సభలు ఒకదాన్ని మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. భీమిలి సభకు సముద్రంతో పోటీపడుతూ ఉత్తరాంధ్ర ప్రజానీకం కదలివచ్చారు. దెందులూరు సభకు భీమిలి సభ కంటే రెట్టింపు స్థాయిలో ఉత్తర కోస్తా ప్రాంత అభిమానులు పోటెత్తారు. ఇక రాప్తాడు సభ తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజా సభగా నిలిచింది.
మూడు సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణుల్లో సరి కొత్త జోష్ నింపింది. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన మూడు సభల్లోనూ.. పెత్తందారులపై యుద్ధానికి సిద్ధమా? మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధమా? పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు.. మరోసారి మన పార్టీ వైఎస్సార్‌సీపీని గెలిపించేందుకు సిద్ధమా? అని సీఎం జగన్ ప్రశ్నిస్తే.. మేం సిద్ధమే అంటూ ఒక్కసారిగా లక్షలాదిమంది ప్రతిస్పందించారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ చేసిన దిశా నిర్దేశం మేరకు 175కు 175 శాసనసభ.. 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా జైత్రయాత్రకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి.
సీఎం జగన్ నాయకత్వంపై విశ్వాసానికి ప్రతీక
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అధికారం చేపట్టిన తొలి ఏడాదే 95 శాతం సీఎం జగన్ అమలు చేశారు. ఇప్పటికి 99.5 శాతం హామీలు అమలు చేశారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.55 లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.76 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు.
దేశ చరిత్రలో డీబీటీ, నాన్‌డీబీటీ రూపంలో రూ.4.31 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు లేవు. ఓ వైపు సంక్షేమాభివృద్ధి పథకాలు.. మరో వైపు విద్య, వ్యవసాయ, వైద్య, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు.. ఇంకో వైపు సుపరిపాలనతో ప్రతి ఇంట్లో.. ప్రతి గ్రామంలో.. ప్రతి నియోజకవర్గంలో సీఎం జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. దాంతో సీఎం జగన్‌పై ప్రజల్లో మద్దతు రోజు రోజుకూ పెరుగుతోంది. ‘మేం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలం, అభిమానులం’ అంటూ కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పుకునే రీతిలో సీఎం జగన్ పరిపాలిస్తుండటం ఆయన నాయకత్వంపై శ్రేణుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచింది. ఇది ‘సిద్ధం’ సభల్లో మరోసారి ప్రతిబింబించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
టీడీపీ–జనసేన శ్రేణులు కకావికలం
టీడీపీ–జనసేనల మధ్య పొత్తుల లెక్కలు ఇప్పటికీ తేలలేదు. రెండు పార్టీల మధ్య సిగపట్లు కొనసాగుతున్నాయి. రా కదలి రా.. పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేస్తున్నారు. ఇటు ‘సిద్ధం’ సభల్లో లక్షలాది మంది ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త్తలు, అభిమానులు ‘పోరుకు మేం సిద్ధమే’ అంటూ చేసిన రణనినాదం మోరుమోగుతుండగా.. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలకు జన స్పందన కన్పించకపోవడంతో టీడీపీ–జనసేన అగ్రనేతల వెన్నులో వణుకు పుట్టించింది.
సిద్ధం సభలు నింపిన జోష్‌తో ప్రజా క్షేత్రంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ముందుకు దూసుకెళ్తున్నాయి. మరో వైపు పొత్తులు తేలక, చంద్రబాబు–పవన్‌ల సభలకు జన స్పందన లేక టీడీపీ–జనసేన శ్రేణులు కకావికలమయ్యాయి. ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే వైఎస్సార్‌సీపీ శ్రేణులు చారిత్రక విజయమే లక్ష్యంగా కదం తొక్కుతుంటే.. టీడీపీ–జనసేన శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి చెల్లాచెదురయ్యాయి. ఇది 2019 ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సునామీ సృష్టించడం ఖాయమనడానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment