వైఎస్ జగన్ సర్కారు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు నగరాల్లోనూ మేరు నగవులై నిలిచాయి. పేద, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాయి. ఆ సానుకూల పవనాలు ప్రభంజనంలా వీచాయి. వైఎస్సార్‌సీపీకి అరుదైన ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టాయి. నగర ఓటర్లు విలువలు, విశ్వసనీయతకే పట్టం గట్టారు. కృత్రిమ ఉద్యమాలతో దగా చేయాలనుకున్న ప్రతిపక్షాలకు కీలెరిగి వాత పెట్టారు. అటు న్యాయ రాజధాని.. ఇటు పరిపాలనా రాజధాని..శాసన రాజధానిలోనూ విశ్లేషకుల ఊహకందని ఫలితాలు ఇచ్చారు.
– సాక్షి నెట్‌వర్క్
బెజవాడలో ఫ్యాన్ దూకుడు
విజయవాడ నగరంలోనూ ఫ్యాన్ గాలి బలంగా వీచింది. వైఎస్సార్‌సీపీ జెండాను రెపరెపలాడించింది. బెజవాడ ప్రజలు మూడు రాజధానులకే ఓటేశారు. అమరావతి రాజధాని సెంటిమెంట్‌కు ఏ మాత్రం విలువ లేదని తేల్చేశారు. విజయవాడ గడ్డపై ఎలాగైనా గెలిచి అమరావతి సెంటిమెంట్ ఉందని చూపాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ ఫలితాలు చెంపపెట్టులా మారాయి. బీజేపీతో జతకట్టి విజయవాడ నగరపాలక సంస్థలో పాగా వేయాలని భావించిన జనసేన పార్టీ చతికిలపడింది. ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్‌సీపీ పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేసిన టీడీపీ ఫ్యాన్ దూకుడు ముందు నిలబడలేకపోయింది. మొత్తం 64 డివిజన్లు ఉండగా.. 49 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. టీడీపీ 14 డివిజన్లతో సరిపెట్టుకోగా.. ఒకచోట సీపీఎం అభ్యర్థి గెలుపొందారు. జనసేన పత్తా లేకుండాపోయింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21, పశ్చిమ నియోజకవర్గంలో 22, తూర్పు నియోజకవర్గంలో 21 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడి ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నప్పటికీ వైఎస్సార్‌సీపీ మాత్రం సార్వత్రిక, పంచాయతీ ఎన్నికల మాదిరిగానే విజయబావుటా ఎగురవేస్తామని మొదటి నుంచీ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. ఆ విధంగానే ఫలితాలు వచ్చాయి.
గుంటూరులో టీడీపీకి చావు దెబ్బ
‘గుంటూరు నగరపాలక సంస్థను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంటే అధికార వికేంద్రీకరణకు మద్దతు తెలిపినట్టే. ఎన్నికల్లో టీడీపీకి ఓటేసి గుంటూరు ప్రజలు అమరావతి రాజధానికి మద్దతు తెలపాలి’ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ నెల 8న గుంటూరులో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓటర్లకు పదేపదే చెప్పారు. ‘గుంటూరు ప్రజలకు సిగ్గు, శరం, రోషం లేదు. అమరావతి కోసం రాజధానిలో ఆందోళనలు చేస్తుంటే మీరేం చేశారు. కనీసం మద్దతు తెలిపారా? మీరు బతికున్నట్టా? లేనట్టా? చేవ చచ్చిపోయారు’ అంటూ ప్రజల్ని రెచ్చగొట్టి.. అమరావతి సెంటిమెంట్‌తో ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజా తీర్పు ఆదివారం వెలువడింది. సంక్షేమానికి, అభివృద్ధి వికేంద్రీకరణకే ప్రజలు ఓటేశారు.
గుంటూరు నగరపాలక పీఠాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. గత సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలైన టీడీపీ ఘోర పరాజయాల పరంపర పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగింది. నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ ఓట్లు దండుకునేందుకు టీడీపీ వేసిన అమరావతి పాచిక పారలేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని అంటూ భ్రమలు కల్పించిన చంద్రబాబుకు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. మరోమారు అదే అమరావతి అజెండాగా మున్సిపల్ ఎన్నికల్లో నెగ్గుకు రావాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు ఓటర్లు గండికొట్టారు. చిత్తశుద్ధితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికీ, అన్నివర్గాల సంక్షేమానికీ కట్టుబడి ఉన్న వైఎస్సార్‌సీపీకి పట్టంగట్టారు. అమరావతి ఉద్యమాల పేరుతో టీడీపీ చేపట్టిన ఆందోళనలతో పారీ్టకి మైలేజితోపాటు, పూర్వ వైభవం రావడం ఖాయమని నాయకులు భావించారు. చంద్రబాబు రంగంలోకి దిగినా ఆశించిన ఫలితాలు రాలేదు. నగరపాలక సంస్థ పరిధిలో 57 డివిజన్లకు గాను 44 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలుపొందారు. టీడీపీ కేవలం 9 డివిజన్లకే పరిమితమైంది. జనసేన రెండుచోట్ల, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు.
విశాఖలో విజయ దరహాసం
కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖ నగరం విజయ దరహాసం చేసింది. వికేంద్రీకరణకే నగర ప్రజలు ఓటేశారు. అమరావతి రాజధానే ఆమోద యోగ్యమంటూ విశాఖలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజలు చుక్కలు చూపించారు. నగరంలో వరుసగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారన్న బలుపు చూపించిన టీడీపీకి విశాఖ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. విలక్షణ తీర్పునిచ్చి విశాఖ మహానగర ఎన్నికల్లో తొలిసారిగా ఒకే పార్టీకి భారీ మెజారిటీ కట్టబెట్టారు. విశాఖ నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత ఏ ఎన్నికల్లోనూ ఒకే పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ కట్టబెట్టని ఓటర్లు చరిత్రలో తొలిసారి వైఎస్సార్‌సీపీకి తిరుగులేని విజయాన్ని అందించారు. 98 డివిజన్లకు గాను 58 డివిజన్లలో వైఎస్సార్ సీపీ సత్తా చాటి గ్రేటర్ పీఠంపై జెండా ఎగరేసింది. చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా టీడీపీ 30 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక రెబల్స్‌లోనూ వైఎస్సార్‌సీపీకి చెందిన వారే ఎక్కువగా విజయం సాధించడం కొసమెరుపు.
బాబు, లోకేశ్ ప్రచారం చేసినచోటా అభాసుపాలు
విశాఖ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రచారం నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ ప్రచారం నిర్వహించిన డివిజన్లలో ఆ పార్టీకి మరింత భంగపాటు తప్పలేదు. చంద్రబాబు పర్యటించిన 6 ,9, 24, 25, 29, 43, 44, 45, 46, 47, 58, 59, 60, 61, 81, 91 ,92, 95 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, 48వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. లోకేశ్ పర్యటించిన 1, 4, 65, 66, 68, 71, 72, 73, 74 డివిజన్లలోనూ వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగరేసింది. 66, 68 వార్డుల్లో చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ప్రచారం నిర్వహించినా.. ప్రజలు మాత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే ఓటేయడం విశేషం. ఓట్ల కోసం ప్రజల్ని ఎంత రెచ్చగొట్టాలని చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నించినా నగర ప్రజలు మాత్రం వారి మాటల్ని విశ్వసించకుండా అధికార పార్టీకి పట్టం గట్టారు. పార్టీ అధినేతలు వచ్చి ప్రచారం చేసినా ఓటమి తప్పకపోవడంతో టీడీపీ అభ్యర్థులు తలలు పట్టుకున్నారు.
ఆ నియోజకవర్గాల్లోనూ ఫ్యాన్ గాలి
2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నగరంలోని నాలుగు స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించింది. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీకి గుడ్‌బై చెప్పారు. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. అయినా.. ఆ మూడు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎక్కువ మంది విజయం సాధించి.. టీడీపీ కోటల్ని బద్దలుగొట్టారు. తూర్పు నియోజకవర్గంలో 15 డివిజన్లకు గాను 10, పశి్చమలో 14 డివిజన్లకు గాను 10, ఉత్తర నియోజకవర్గంలో 17 డివిజన్లకు గాను 15 స్థానాలను వైఎస్సార్ సీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
వాత పెట్టిన చిత్తూరు
చిత్తూరు నగరపాలక సంస్థగా అవతరించిన తరువాత 2014లో తొలి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో బీసీ మహిళకు రిజర్వు అయిన మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోగా.. ఆ పదవి కటారి అనురాధను వరించింది. ఏడాది కూడా ఆమెను ఆ కుర్చీలో కూర్చోనివ్వలేదు. కటారి కుటుంబంలో చిచ్చురేపిన టీడీపీలోని ఓ సామాజిక వర్గ నేతలు అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యలకు పరోక్ష కారణమయ్యారు. ఆ తరువాత మేయర్ పీఠంపై రెండేళ్లకు పైగా పురుషుడు కూర్చుని పాలన సాగించినా అడిగే దిక్కు లేకుండాపోయింది. జంట హత్యల తరువాత చిత్తూరును గుప్పెట్లోకి తెచ్చుకున్న ఆ సామాజిక వర్గం మునిసిపల్ కార్యాలయంలో ఉద్యోగుల్ని కొట్టడం, టెండరు వేసినందుకు ప్రతిపక్ష నేత ఇంటిపై రాళ్లు వేయడం, మరో ఆర్యవైశ్యుడిని కార్పొరేషన్ కార్యాలయంలో తన్నడం, చెప్పిన పనులు చేయని అధికారులను నిర్ధాక్షిణ్యంగా తరిమేయడం వంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇది చాలదన్నట్టు ప్రతి అభివృద్ధి పనికి స్టాండింగ్ కమిటీ 8 శాతం చొప్పున బహిరంగంగానే లంచాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. చివరి ఏడాదిలో కటారి కుటుంబం నుంచి హేమలత మేయర్ పీఠాన్ని అధిష్టించినా.. నగరాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో విఫలమయ్యారు. ఈ పరిణామాలతో చిత్తూరు నగర ఓటర్లు టీడీపీకి ఓటెయ్యకూడదనే నిర్ణయానికి వచ్చారు. ప్రజా సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ముంగిటకే చేరుస్తూ వైఎస్ జగన్ వారి విశ్వాసాన్ని చూరగొన్నారు. ఈ క్రమంలోనే చిత్తూరు కార్పొరేషన్ తాజా ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ చరిత్రాత్మక విజయం సాధించింది. 50కి గాను 46 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించింది. ఒకప్పుడు టీడీపీకి జై కొట్టిన చిత్తూరు వాసులు ఆ పార్టీ నేతల హత్యా రాజకీయాలు, అవినీతిని చూసి ఈ ఎన్నికల్లో వాళ్లను ఛీకొట్టి పక్కకు పెట్టేశారు.
న్యాయ రాజధానికి నీరాజనం
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఇక్కడి ప్రజలు జై కొట్టారు. కర్నూలులో హైకోర్టుతో లాభం ఏమీ ఉండదని వాదించే టీడీపీ అధినేత చంద్రబాబుకు బ్యాలెట్‌తో సమాధానం చెప్పారు. ఏకపక్షంగా సాగిన పోరులో టీడీపీ అభ్యర్థులు ఓటమిని మూట కట్టుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు తన ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. 18 డివిజన్లతో ఆయన ప్రచారం చేస్తే ఒక్కచోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి గెలుపొంద డం గమనార్హం. మొత్తం 52 డివిజన్లకు గాను 41 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచారు. మరో మూడు స్థానాల్లో ఆ పార్టీ రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. 8 డివిజన్లలోనే టీడీపీ గెలిచింది.
హైకోర్టును వ్యతిరేకించి..
ఏపీ విభజన తర్వాత రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని సీమవాసులు కోరారు. 2014లో సీఎంగా ఉన్న చంద్రబాబు ఏకపక్షంగా అమరావతిలో రాజధాని ఏర్పాటుకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో కర్నూలులో కనీసం హైకోర్టు అయినా ఏర్పాటు చేయాలని కోరినా వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్.. 2019 డిసెంబర్ 13న మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంతో కర్నూలు వాసులు వైఎస్సార్‌సీపీకి ఘన విజయాన్ని అందించారు.
‘అనంత’ అభిమానం
అనంతపురం నగరపాలక సంస్థ చరిత్రను వైఎస్సార్ సీపీ తిరగరాసింది. నగరపాలక సంస్థ ఆవిర్భవించాక కనివినీ ఎరుగని రీతిలో ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టడం విశేషం. మొత్తం 50 స్థానాల్లో 48 స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోగా.. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ప్రతిపక్ష టీడీపీ నామరూపాల్లేకుండా పోయింది. టీడీపీకి వంత పాడిన వామపక్షాలు, జనసేన, బీజేపీ కూడా మట్టికరిచాయి. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్‌లు ఇక్కడే నివాసముంటున్నా.. టీడీపీ ఉనికి కోల్పోయింది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి నివాసముంటున్న 37వ డివిజన్‌లో 628 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొమ్మా అనిల్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. మాజీ మేయర్ స్వరూప సొంత వార్డు 30వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నరసింహులు 500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
మచిలీపట్నంలో విజయఢంకా
మునిసిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన మచిలీపట్నం నగరానికి జరిగిన తొలి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించింది. ఇక్కడ మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 44 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, ఐదుచోట్ల టీడీపీ, ఒకచోట ఇతరులు గెలుపొందారు.
‘కడప’ గడపలో..
కడప నగరపాలక సంస్థలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించింది. ఆ దెబ్బకు ప్రతిపక్ష టీడీపీ కొట్టుకుపోయి కనుమరుగైంది. ప్రజల మద్దతుతో అధికార పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. నగరంలో 50 డివిజన్లు ఉండగా 24 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 26 డివిజన్లకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలతో కలుపుకుని అధికార పార్టీ అభ్యర్థులు 48 డివిజన్లలో విజయం సాధించారు. ప్రతిపక్ష టీడీపీ కేవలం ఒక్క డివిజన్‌కే పరిమితమైంది. మరో డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
ఒంగోలులో తిరుగులేని విజయం
ఒంగోలు నగరపాలక సంస్థలోనూ వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 41 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించింది. 6 స్థానాల్లో టీడీపీ, మూడు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.
సంక్షేమమే ‘విజయ’ రహస్యం
విజయనగరం నగరపాలక సంస్థగా ఆవిర్భవించాక జరిగిన తొలి ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అనూహ్య విజయం సాధించింది. మొత్తం 50 స్థానాలకు 48 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేయగా, టీడీపీ, ఇండిపెండెంట్ చెరో స్థానం చొప్పున దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రభావం ఫలితాల్లో స్పష్టంగా ప్రతిఫలించింది. టీడీపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, ఆయన తనయ అదితి గజపతిరాజు స్వయంగా ప్రచారం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా నిలిచిన విజయనగరం ఇప్పుడు వైఎస్సార్‌సీపీ పరమైంది.
ఆధ్యాత్మిక నగరంలోనూ అదే జోరు
తిరుపతి నగరపాలక సంస్థకు 19 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 7వ డివిజన్‌లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన 49 డివిజన్లలో ఎన్నికలు జరగ్గా.. టీడీపీ కేవలం ఒక్క డివిజన్‌తో సరిపెట్టుకుంది. 22 డివిజన్లు వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవం కాగా, 27 డివిజన్లలో పోలింగ్ నిర్వహించారు. 26 డివిజన్లలోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా.. ఏకగ్రీవ స్థానాలతో కలిసి వైఎస్సార్‌సీపీకి 48 స్థానాలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment