తాడిపత్రి, మైదుకూరు ఎవరి వైపు? | No single party has a clear majority in Tadipatri and Mydukur | Sakshi
Sakshi News home page

తాడిపత్రి, మైదుకూరు ఎవరి వైపు?

Published Mon, Mar 15 2021 4:36 AM | Last Updated on Mon, Mar 15 2021 12:10 PM

No single party has a clear majority in Tadipatri and Mydukur - Sakshi

సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రి, వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీల్లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. దీంతో ఈ రెండుచోట్లా ఏ పార్టీకి చైర్‌పర్సన్‌ పీఠం దక్కుతుందో అన్నదానిపై సస్పెన్స్‌ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్వీప్‌ చేయగా.. ఈ 2 మున్సిపాలిటీల్లో మాత్రం వైఎస్సార్‌సీపీతో టీడీపీ పోటాపోటీగా నిలిచింది. కానీ, సొంతంగా చైర్‌పర్సన్‌ పదవిని దక్కించుకునే మ్యాజిక్‌ ఫిగర్‌ను ఏ పార్టీ సాధించలేకపోయాయి. దీంతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక జరిగే 18వ తేదీపైనే అందరి కళ్లూ ఉన్నాయి. ఆ రోజు అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ రెండుచోట్లా ఎక్స్‌అఫిషియో సభ్యుల ఓట్లూ కీలకంగా మారనున్నాయి.

మైదుకూరులో ఎక్స్‌ ఆఫిషియో ఓట్లు వైఎస్సార్‌సీపీకే ఎక్కువ
మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. ఎక్స్‌ అఫిషియో ఓట్లతో కలిపి మొత్తం 26 ఓట్లు ఉన్నట్లు లెక్క. ఇందులో 14 ఓట్లు ఏ పార్టీకి వస్తే వారికి చైర్‌పర్సన్‌ పదవి దక్కుతుంది. ఇక్కడ మొత్తం 24 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 11 చోట్ల, తెలుగుదేశం 12 చోట్ల, జనసేన ఒక స్థానంలో గెలుపొందాయి. వైఎస్సార్‌సీపీకి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప లోకసభ సభ్యుడు అవినాష్‌రెడ్డి మైదుకూరు మున్సిపాలిటీలో ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా తమ పేర్లు నమోదు చేసుకోవడంతో ఇక్కడ వైఎస్సార్‌సీపీ బలం 13కు పెరిగింది. జనసేన టీడీపీకి మద్దతు పలకని పక్షంలో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ పీఠాన్ని దక్కించుకుంటుంది. ఒకవేళ టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చినా కూడా టీడీపీకి చైర్‌పర్సన్‌ పదవి  దక్కదు. ఎందుకంటే.. జనసేనతో కలిపి టీడీపీ బలం 13కు పెరిగి వైఎస్సార్‌సీపీతో సమానమవుతుంది. ఇదే పరిస్థితి ఉత్పన్నమైతే టాస్‌ వేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్‌ అధికారులు చెప్పారు. 

తాడిపత్రిలోనూ అదే గందరగోళం..
మైదుకూరు మాదిరిగానే తాడిపత్రిలో మున్సిపాల్టీలోనూ సస్పెన్స్‌ వాతావరణం నెలకొంది. ఇక్కడ మొత్తం 36 వార్డులుండగా టీడీపీ 18చోట్ల.. వైఎస్సార్‌సీపీ 16 చోట్ల విజయం సాధించాయి. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి చెరొకచోట గెలుపొందారు. ఇక్కడ స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన ఎక్స్‌అఫిషియో ఓటును ఇప్పటికే నమోదు చేసుకున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ బలం 17కి పెరిగింది. అనంతపురం ఎంపీ రంగయ్య ఇప్పటి దాకా తన ఎక్స్‌ అఫిషియో ఓటు ఇంకా ఎక్కడా నమోదు చేసుకోలేదని మున్సిపల్‌ శాఖ అధికారులు వెల్లడించారు. మున్సిపల్‌ ఎన్నికల చట్టం సెక్షన్‌–5 క్లాజ్‌ (3) ప్రకారం.. పొలింగ్‌ తేదీ తర్వాత 30 రోజుల్లోపు ఆయన ఎక్కడో ఒకచోట తన పేరును ఎక్స్‌ అఫిషియో సభ్యునిగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో తలారి రంగయ్య తన ఓటును తాడిపత్రి మున్సిపాలిటీలో నమోదు చేసుకునే పక్షంలో అక్కడ వైఎస్సార్‌సీపీ బలం కూడా 18కు పెరిగి టీడీపీతో సమానంగా ఉంటుంది. అప్పుడు సీపీఐ, స్వతంత్ర సభ్యుల ఓట్లు కీలకంగా మారతాయి. వారు ఎవ్వరికీ మద్దతివ్వని పక్షంలో.. లేదా చేరొక పార్టీకి మద్దతిచ్చినా ఇక్కడా టాస్‌ తప్పకపోవచ్చని ఎన్నికల కమిషన్‌ అధికారులు తెలిపారు. ఇద్దరూ కలిసి ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ చైర్‌పర్సన్‌ పీఠం దక్కించుకుంటుంది. మొత్తంగా ఇక్కడా చైర్‌పర్సన్‌ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. 

మైదుకూరులో క్యాంపు రాజకీయాలకు తెరలేపిన టీడీపీ
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు మునిసిపాలిటీ ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో చైర్మన్‌ పదవి ఎవరికి దక్కుతుందనే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. మునిసిపాలిటీలో మొత్తం 24 వార్డులున్నాయి. వైఎస్సార్‌సీపీ 11 వార్డుల్ని, టీడీపీ 12 వార్డులు, జనసేన ఒక వార్డు గెలుచుకున్నాయి. మునిసిపాలిటీలో స్పష్టమైన ఆధిక్యత రావాలంటే 13 వార్డులు గెలవాల్సి ఉంది. ఈ మునిసిపాలిటీలో ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్‌అఫిషియో సభ్యులు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీకి 13 మంది ఉన్నట్లవుతుంది. దీంతో ఈ మునిసిపాలిటీ వైఎస్సార్‌సీపీకే దక్కే అవకాశాలున్నాయి. మరోవైపు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ తమ 12 మంది వార్డు సభ్యులను ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయానికి తరలించారు. సభ్యులపై నమ్మకంలేక వారిని నిర్బంధించినట్లు సమాచారం. మరోవైపు జనసేన సభ్యుడితోనూ టీడీపీ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. 

రహస్య ప్రాంతానికి టీడీపీ విజేతలు
తాడిపత్రి : అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీలో పొలిటికల్‌ హైటెన్షన్‌ నెలకొంది. ఇక్కడ హంగ్‌ ఏర్పడడంతో తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. వారు ఎక్కడ జారిపోతారోనని ఆదివారం ఉదయం కౌంటింగ్‌ ప్రారంభం కాగానే ఆయన వారందరినీ తన నివాసంలోనే నిర్బంధించారు. అభ్యర్థుల తరఫున కేవలం ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్‌ కేంద్రానికి పంపించారు. ఆ తర్వాత మధ్యాహ్నం టీడీపీ విజేతలందరినీ రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement