'పురం'లోనూ ఫ్యాన్‌ హవా | YSR Congress Party unanimous victory in 571 wards and divisions | Sakshi
Sakshi News home page

'పురం'లోనూ ఫ్యాన్‌ హవా

Published Thu, Mar 4 2021 3:31 AM | Last Updated on Thu, Mar 4 2021 5:33 AM

YSR Congress Party unanimous victory in 571 wards and divisions - Sakshi

సాక్షి, అమరావతి:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పట్ల రాష్ట్రంలో తిరుగులేని ప్రజాదరణ వ్యక్తమవుతోందని మరోసారి స్పష్టమైంది. పురపాలక ఎన్నికల్లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా ఘన విజయం సాధించనుందని దాదాపు తేటతెల్లమైపోయింది. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 12 నగర పాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల్లో బుధవారం ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.  వైఎస్సార్‌సీపీ ఏకంగా 571 వార్డులు/డివిజన్లను ఏకగ్రీవంగా గెలుచుకుంది. (తిరుపతిలో మరో డివిజన్‌ విషయంలో ఎన్నికల కమిషన్‌ గురువారం నిర్ణయం తీసుకోనుంది. అది కూడా వైఎస్సార్‌సీపీ పరం అయ్యే అవకాశాలున్నాయి). రాష్ట్రంలో మొత్తం 2,794 వార్డులు/డివిజన్లకు గాను 578 వార్డులు/డివిజన్లలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వాటిలో ఏకంగా 571 వార్డులు/డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలుపొందడం విశేషం. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీల్లో అన్ని వార్డులనూ వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. రాయచోటి, పలమనేరు, నాయుడుపేట, ఆత్మకూరు (కర్నూలు జిల్లా), డోన్‌ మున్సిపాలిటీలలో మూడింట రెండొంతుల వార్డులు వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. సూళ్లూరుపేట, కొవ్వూరు, తుని మున్సిపాలిటీల్లో సగం వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకుని ఆ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం ఖాయమని తేల్చి చెప్పింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ ఏకగ్రీవాల్లో వైఎస్సార్‌సీపీ పూర్తి స్థాయిలో ఆధిపత్యం కనబరిచి ప్రజాభిప్రాయం తమ పక్షమే అని పునరుద్ఘాటించింది.  
  
ఏకగ్రీవాల్లో ‘ఫ్యాన్‌’ ప్రభంజనం 
పురపాలక ఎన్నికల్లో ఏకగ్రీవాల్లో ‘ఫ్యాన్‌’ ప్రభంజనం సృష్టించింది. మొత్తం ఏకగ్రీవాల్లో 98.80 శాతం వైఎస్సార్‌సీపీ పరమయ్యాయి. తిరుపతిలో ఓ డివిజన్‌లో మళ్లీ నామినేషన్‌కు ఎన్నికల కమిషన్‌ అవకాశం ఇచ్చింది. దాంతో ఒకరు రీ నామినేషన్‌ వేశారు. కానీ రీ నామినేషన్‌కు అవకాశం ఇస్తూ ఎన్నికల కమిషన్‌ ఇచి్చన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. దాంతో ఆ డివిజన్‌లో వేసిన రీ నామినేషన్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది చెల్లకపోతే ఆ డివిజన్‌ను కూడా వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంటుంది. ఇక రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థులు 6 వార్డుల్లో, బీజేపీ అభ్యర్థి ఒక వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 578 ఏకగ్రీవమైన వార్డులు/డివిజన్లలో 130 వార్డులతో చిత్తూరు జిల్లా మొదటి స్థానం సాధించగా, 120 వార్డులు/డివిజన్లతో వైఎస్సా‌ర్‌ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 
 
చిత్తూరు, తిరుపతి, కడప కార్పొరేషన్లలో హవా 
► పోలింగ్‌తో నిమిత్తం లేకుండానే 3 నగర పాలక సంస్థలు, 13 పురపాలక సంఘాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకోవడం ఖాయమని తేలిపోయింది.  
► చిత్తూరు నగర పాలక సంస్థలో 50 డివిజన్లలో 37 ఏకగ్రీవంగా గెలుచుకుంది. తిరుపతి నగర పాలక సంస్థలో 50 డివిజన్లలో 21, కడప నగర పాలక సంస్థలో 50 డివిజన్లలో 23 డివిజన్లను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది.  
 
మున్సిపాలిటీలలో వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవాలు ఇలా.. 
► పులివెందుల (31), పుంగనూరు (31), పిడుగురాళ్ల (33), మాచర్ల (31) మున్సిపాలిటీలలో అన్ని వార్డులను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఈ మున్సిపాలిటీలో పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరమే లేదు.  
► రాయచోటిలో 34 వార్డులకు గాను 31, నాయుడుపేటలో 25 వార్డులకు గాను 23, పలమనేరులో 26 వార్డులకు గాను 18, డోన్‌లో 32 వార్డులకు గాను 22, ఆత్మకూరు (కర్నూలు జిల్లా)లో 24 వార్డులకు గాను 18,  కొవ్వూరులో 23 వార్డులకు గాను 13, తునిలో 30 వార్డులకు గాను 15 వార్డులు వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవమయ్యాయి. సూళ్లూరుపేటలో 25 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలో 20 వార్డులకు గాను 12 వార్డులను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది.  
  
విశాఖలో నాలుగు చోట్ల టీడీపీకి అభ్యర్థులు కరువు  
► గ్రేటర్‌ విశాఖ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు నాలుగు వివిజన్లలో అభ్యర్థులు కరువయ్యారు. 15, 49, 72, 78 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో లేరు.  
► వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు, రాయచోటి, పులివెందుల, బద్వేలు మున్సిపాలిటీల్లో కూడా వైఎస్సార్‌సీపీ పలు కౌన్సిలర్‌ స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. 
► ఏలూరులో టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు పోటీలో లేని చోట్ల తాను జనసేనకు ప్రచారం చేస్తానని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని అన్నారు. బుధవారం చింతమనేని కార్పొరేషన్‌ కార్యాలయం వద్దకు వచ్చి కొద్దిసేపు హల్‌చల్‌ చేశారు. టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారని తిట్ల దండకం అందుకున్నారు. ఏలూరులోని టీడీపీ నాయకులను కూడా ఇష్టారాజ్యంగా తిట్టారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement