బద్వేరా/జమ్మూ,కశ్మీర్ : కుల, మతాల కుమ్ములాటలతో భారతావని ఓ పక్క ‘రాజకీయాల’ల్లో చిక్కుకుని తల్లడిల్లుతోంటే.. కశ్మీర్‌లోని ఓ గ్రామం మాత్రం అందరికీ కనువిప్పు కలిగే పనిచేసింది. గ్రామంలో ఉన్న ఒకేఒక్క ముస్లిం కుటుంబానికి అధికారాన్నిచ్చింది. కులం, మతం కాదు ముఖ్యం.. పనిచేసే తత్వం అని ప్రపంచానికి తెలియజెప్పింది.
వివరాలు.. కశ్మీర్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో బేలన్-కరోఠి గ్రామం చౌదరీ మహ్మద్ హుస్సేన్ (54) అనే వ్యక్తిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మొత్తం 450 కుటుంబాలు గల ఈ గ్రామంలో హుస్సేన్‌ది మాత్రమే ముస్లిం కుటుంబం. మిగతా వారంతా హిందువులే. తమ మధ్య హిందూ ముస్లిం భేదాలు లేవని ప్రపంచానికి తెలిపేందుకు, హుస్సేన్ కుటుంబం ఒంటరిది కాదని దన్నుగా నిలిచేందుకే ఆయన్ని తమ గ్రామ పెద్దగా ఎన్నుకున్నామని అక్కడి ప్రజలు తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. తద్వారా ‘భారతదేశం భిన్న మతాల సమ్మేళనం. భిన్నత్వంలో ఏకత్వం భారత్ సొంతం’ అనే మాటలకు నిజమైన అర్థం చెప్పారు.
హుస్సేన్‌కు నలుగురు కుమార్తెలు, ఐదుగురు కుమారులున్నారు. గ్రామం మొత్తం హిందువులే నివసిస్తున్నా హుస్సేన్ కుటుంబం మాత్రం ఎప్పుడూ వివక్షకు గురికాలేదు. స్థానికులతో సన్నిహితంగా ఉంటూ, అందరితోనూ తలలో నాలుకలా మెలిగే హుస్సేన్ అంటే గ్రామస్తులకు ఎంతో గౌరవం. అందుకనే ప్రస్తుత ఎన్నికల్లో ఆయనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుని మతసామరస్యాన్ని చాటారు. ‘ఈ గ్రామంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను’అని హుస్సేన్ ఉద్వేగంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment