రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం
ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు
బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ సూచనలే కీలకం
నేడు ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్న కమిషన్
ఆ వెంటనే రిజర్వేషన్ల ఖరారుకు కసరత్తు చేపట్టనున్న సర్కారు
రాష్ట్రంలో 570 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ సీట్లు, 12,848 సర్పంచ్ స్థానాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల్లో అమలు చేసే రిజర్వేషన్ల లెక్క తేలడమే మిగిలింది. బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ బీసీ కమిషన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. సోమవారం ఈ మేరకు ప్రత్యేక సమావేశం జరగనుంది. కమిషన్ నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే నిబంధన ఉండటంతో.. ఆ మేరకు రిజర్వేషన్లకు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,848 గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలు 5,817, ఎంపీపీలు 570, జెడ్పీటీసీ స్థానాలు 570 ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలన్నీ ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. మిగతా ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయిస్తారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా ఉండేలా చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సైతం స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసుకుంది.
బీసీ రిజర్వేషన్లు 23శాతంలోపే..!
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రకారం.. రాష్ట్ర జనాభాలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) 17.43 శాతం, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) 10.45 శాతం ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి, అదే సమయంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదు. దీనితో ఎస్సీలకు 17.43 శాతం, ఎస్టీలకు 10.45 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. వీటిని మినహాయిస్తే.. బీసీలకు 22.12 శాతమే రిజర్వేషన్లు అందుతాయి. ఇందులో డెడికేటెడ్ బీసీ కమిషన్ ఇచ్చే నివేదికకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వస్తోంది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. ఈ నెల 10న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓటర్ల జాబితాలను జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లలో పరిశీలన కోసం ప్రదర్శించాలని ఆదేశిస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ రాణీ కుముదిని ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీ నియోజకవర్గాల వారీగా విభజించేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై 11న జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా కొనసాగుతోంది. ఈనెల 15న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాలను ప్రచురించనున్నారు. మొత్తంగా ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment