ఏకగ్రీవంతో గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం | Elections must be unanimous if villages are to prosper | Sakshi
Sakshi News home page

ఏకగ్రీవంతో గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం

Published Sun, Feb 7 2021 6:05 AM | Last Updated on Sun, Feb 7 2021 6:05 AM

Elections must be unanimous if villages are to prosper - Sakshi

తాళ్ల చెరువు గ్రామం

అచ్చంపేట (పెదకూరపాడు): ‘‘గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలి. అందుకే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చినంత నేనూ ఇస్తా.. అందరం కలసి గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకుందాం. వృథా చేసే డబ్బుతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరికీ ఆదర్శంగా నిలుద్దాం’’ అని ఓ ఎన్‌ఆర్‌ఐ ముందుకు వచ్చారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని తాళ్లచెరువుకు చెందిన దొండేటి మర్రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో స్థిరపడ్డారు. వ్యవసాయ ప్రాధాన్యత గల తాళ్లచెరువులో 4,206 మంది ఓటర్లు. వారిలో 2,066 మంది పురుషులు, 2,140 మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం పంచాయతీ సర్పంచ్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు అయింది. ప్రతి పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్‌ అభ్యర్థిని గెలుపించుకోవాలంటే సుమారు రెండు వర్గాలు చెరో రూ. 50 లక్షలు ఖర్చు చేస్తారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచే మద్యం ఏరులై పారుతుంది. గెలిచిన అభ్యర్థి ఏడవలేక నవ్వితే, ఓడిన అభ్యర్థి అక్కడే తీవ్ర ఆవేదన పడటం సర్వసాధారణం.

వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టాలన్న ఆలోచనతో మర్రెడ్డి ముందుకొచ్చారు. ఓ సమర్థ అభ్యర్థిని ఎంపిక చేసుకుని ఏకగ్రీవం చేసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకం రూ. 10 లక్షలకు తోడు తాను మరో రూ. 10 లక్షలు గ్రామానికి విరాళంగా ఇస్తానని ప్రకటించారు. అలా కాని పక్షంలో మరో మార్గాన్ని కూడా తానే వివరించారు. ప్రస్తుతం తన తల్లి దొండేటి అన్నమ్మ తాళ్లచెరువులోనే ఉంటున్నారని, ఆమెను ఏకగ్రీవంగా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షలతో పాటు సామాజిక అవసరాలకు ఉపయోగపడేలా గ్రామానికి సమీపంలోని అర ఎకరం భూమిని ఇచ్చి, అందులో అధునాతన వ్యవసాయ విధానాలకు ఉపయోగపడేలా ఒక భవనాన్ని నిర్మించి ఇస్తానని సూచించారు. ఈ రెండు మార్గాల్లో ఎందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని, దీనివల్ల తన జన్మభూమి అయిన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం తప్ప మరే విధమైన స్వార్థం లేదని వివరించారు. 

పెట్టిన ఖర్చు తిరిగిరాదు
ఇప్పటి వరకు అనేక మంది సర్పంచ్‌లుగా గెలిచారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్మును కూడా సంపాదించుకోలేకపోయారు. కేవలం ప్రెస్టేజీకి పోయి ఉన్న ఆస్తులను పోగొట్టుకున్నారు. ఈసారైనా గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నా సూచనలు ఆలకిస్తే మంచిది.
– దొండేటి మర్రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ, తాళ్లచెరువు గ్రామం

గ్రామం బాగుపడాలనే...
మా అబ్బాయి అమెరికాలో స్థిరపడ్డాడు. ఇక్కడికి వచ్చి పెత్తనం చెలాయించాలని అతనికి లేదు. స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేశాడు. హైస్కూల్లో ప్రతి తరగతి గదికి టీవీలు ఇచ్చాడు. నిరుపేదలకు అండగా నిలిచాడు. ఇవన్నీ కేవలం గ్రామం బాగుపడాలనే.
– దొండేటి అన్నమ్మ, ఎన్‌ఆర్‌ఐ తల్లి, తాళ్లచెరువు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement