ధ్రువీకరణ పత్రం అందుకున్న విజయసాయిరెడ్డి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి బుధవారం రాజ్యసభకు ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. ఆయన వైఎస్ఆర్ సీపీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ సాయిరెడ్డి శాసనసభ ప్రాంగణంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన శాయశక్తుల కృషి చేస్తామన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. ప్రత్యేక హోదాపై తమ పోరాటం కొనసాగుతోందని, ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోరాడుతూనే ఉందన్నారు. హోదా విషయంలో అన్ని పార్టీల మద్దతుతో ముందుకు వెళతామన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్నా, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆ పార్టీ విఫలం అయిందని విజయ సాయిరెడ్డి విమర్శించారు. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి, టీడీపీ నుంచి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, బీజేపీ నుంచి సురేష్ ప్రభు, తెలంగాణ నుంచి డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయిన విషయం విదితమే. సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీ శ్రీనివాస్ ఈ నెల 4వ తేదీనే ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.