సాక్షి, అమరావతి: రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఐకమత్యంగా ఉండటం ద్వారా గ్రామాలు ప్రగతి బాట పట్టాలని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష, ఆశయం. గ్రామ స్వరాజ్య స్థాపన కోసం కలలుగన్న జాతిపిత మహాత్మాగాంధీ కూడా ఇదే కోరుకున్నారు. గ్రామస్తులంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యతాభావంతో కలసి, మెలసి పరస్పర సుహృద్భావ వాతావరణంలో గ్రామాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని, స్వపరిపాలన సాగించుకోవాలని రాజ్యాంగ నిర్మాతలు కూడా సూచించారు. ఈ లక్ష్యంతోనే గాంధీజీ సొంత రాష్ట్రమైన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల ఎన్నికలను పార్టీ రహితంగా నిర్వహించేలా పంచాయతీరాజ్ చట్టంలో నిబంధన పెట్టాయి. రాజకీయ పార్టీల వారీగా గ్రామాల్లో వర్గాలు ఏర్పడితే మనస్పర్థలు వస్తాయని, గ్రామ ప్రగతిపై ఇవి దుష్ప్రభావం చూపుతాయన్న ఆలోచనతోనే పార్టీ రహిత ఎన్నికలకు బీజం వేశాయి. స్వపరిపాలనే గ్రామ పంచాయతీల లక్ష్యమైనందున గ్రామంలోని వారంతా ఐకమత్యంగా ఉండి అభివృద్ధి ప్రణాళికలు వేసుకోవడం ద్వారా అనూహ్య ప్రగతి సాధించాలన్నదే దీని వెనుక ఉద్దేశమన్నది అందరికీ తెలిసిన అంశమే.
అందుకే ప్రోత్సాహకాలు
– గ్రామంలో కలసి మెలసి ఉన్న వారు ఎన్నికల్లో పరస్పరం పోటీ పడినప్పుడు మనస్పర్థలకు, వివాదాలకు దారితీసిన ఉదంతాలు కోకొల్లలు. పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘర్షణల వల్ల కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వర్గాలు, ఘర్షణలు పల్లెల ప్రగతికి ప్రతిబంధకంగా మారతాయన్నది నిర్వివాదాంశం.
– అందుకే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రజల మధ్య శాంతి సౌభ్రాతృత్వాలు, పరస్పర సహకార భావాలు విరాజిల్లాలని బలంగా కోరుకుంటోంది. గ్రామ ప్రజలంతా పరస్పర సహకారంతో, సోదర భావంతో మెలగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.
– ఐకమత్యంతో సర్పంచి, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్న గ్రామాలను ఉత్తమ/ ఆదర్శ పంచాయతీలుగా గుర్తించి పోత్రాహకాలు అందించే పథనికి ఈ ఉదాత్త ఆశయంతోనే శ్రీకారం చుట్టింది.
– పోటీ లేకుండా ఏకగ్రీవ పంచాయతీ చేసుకుంటే ప్రభుత్వం అందించే ప్రోత్సాహక మొత్తంతో గ్రామంలో ఏమైనా అభివృద్ధి పనులు చేసుకోవచ్చనే ఆశ కల్పించాలన్నదే దీని ఉద్దేశం.
– ఆదర్శ పంచాయతీలకు పోత్సాహకాలు అందించడం ద్వారా గ్రామాలను కక్షలు, కార్పణ్యాలకు దూరంగా ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇది ప్రతిఒక్కరూ ప్రశంసించే అంశమే. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు.
– ఏకగ్రీవ చాయతీలకు నజరానా అందించే విధానం దశాబ్దాలుగా అమల్లో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రత్యేకించి పార్టీ రహిత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోతహించడం అన్నివిధాలా మంచిదేనని అన్ని రంగాల నిపుణులు ప్రశంసిస్తున్నారు.
ఏకగ్రీవ ఎన్నికలతోనే గ్రామ స్వరాజ్యం
మన పరిపాలన వ్యవస్థలో పరిమాణపరంగా గ్రామ పంచాయతీలు చిన్నవి. కానీ అభివృద్ధికి అత్యంత కీలకమైనవి. అటువంటి పంచాయతీల్లో ప్రజలు వర్గ విభేదాలకు అవకాశం లేకుండా సమైక్యంగా ఉంటేనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోగలం. గ్రామ స్వరాజ్యం, అందరి సంక్షేమాన్ని సామరస్యంగా సాధించేందుకు పంచాయతీ ఎన్నికలను ఏకగీవ్రం చేసుకోవడం ఉత్తమ మార్గం.
– ప్రొ.ఆర్‌జీబీ భగవత్ కుమార్, రిటైర్డ్ వీసీ, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
గ్రామాభ్యుదయం సుసాధ్యం
పంచాతీయలకు ఏకగ్రీవ ఎన్నికలతోనే గ్రామాభ్యుదయం సుసాధ్యమవుతుంది. గ్రామాల్లో ప్రజలు అంతా ఒకే కుటుంబం అనే భావనతో పంచాయతీ ఎన్నికల్లో ఏకతాటిపైకి రావాలి. అనవసరమైన పంతాలు, పోటీలు విడిచిపెట్టి గ్రామ అభివృద్ధి కోసం ఏకాభిప్రాయానికి రావాలి. అందరం బాగుండాలి.. తమ గ్రామాలు అభివృద్ధి చెందాలి.. అనే లక్ష్య సాధనకు ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవడం దోహదపడుతుంది. ఇందుకోసం నియోజకవర్గ స్థాయి నేతలు కూడా చొరవ తీసుకుని, గ్రామాల్లోని నేతలను ఏకతాటిపైకి తీసుకురావాలి.
– హెచ్.లజపతిరాయ్, మాజీ వీసీ, బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం.
Comments
Please login to add a commentAdd a comment