అఖిలప్రియ ఎన్నిక ఇక లాంఛనమే!
ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టకూడదని నిర్ణయించడంతో ఇక ఆళ్లగడ్డ ఉప ఎన్నిక లాంఛనప్రాయంగా మిగిలింది. కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు.. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలలో తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. అంతకుముందే తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని అక్కడ పోటీచేయించడం లేదని ప్రకటించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏప్రిల్ 24న రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో అమె మరణానంతరం గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఆ స్థానానికి నవంబరు 8న ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియాజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శోభా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేశారు.
శాసనసభ్యులు మృతి చెంది.. పోటీలో వారి కుటుంబసభ్యులే నిలబడితే ఇతర పార్టీలు పోటీ చేయకూడదన్న సాంప్రదాయాన్ని అన్ని పార్టీలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నికలో టీడీపీ కూడా సాంప్రదాయాన్ని కొనసాగించాలంటూ చేసిన విజ్ఞప్తి మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ అభ్యర్థిని పోటీలో నిలబెట్టడం లేదని తక్షణమే ప్రకటించారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే.. అందరూ అక్కడ పోటీ ఉండదని, ఏకగ్రీవం తప్పదని భావించారు. అనుకున్నట్లు గానే.. భూమా అఖిలప్రియ ఏకగ్రీంగా ఎన్నిక కావడం దాదాపు ఖాయమైపోయింది. నామినేషన్లు దాఖలు చేయడానికి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో అప్పటికల్లా మొత్తం విషయం తేలిపోతుంది.