
కర్నూలు (రాజ్‌విహార్): ఏకగ్రీవాలు జరిగిన చోట ఎంపీడీవోలను మార్చాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలు రాయడం సరి కాదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డితో కలిసి బొత్స సత్యనారాయణ మీడియాతో బుధవారం మాట్లాడారు.
గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల క్రమంలో ఏకగ్రీవాలు అయిన చోట ఎంపీడీవోలను బదిలీ చేయాలని సీఎస్‌కు ఎస్‌ఈసీ లేఖ రాయడం విచారకరమన్నారు. గ్రామ స్వరాజ్యానికి విఘాతం కలిగించేలా నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్‌లు ఉన్నప్పటికీ ఎస్‌ఈసీ ప్రత్యేక యాప్ తయారు చేసిందని, ఇది తమ హక్కు అని చెప్పే ముందు బాధ్యతలను తెలుసుకుని అనుసరించాలని బొత్స పేర్కొన్నారు.