విజయనగరంలో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి బొత్స
సాక్షి, అమరావతి/విజయనగరం: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రమే సముచిత స్థానం కల్పించిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన బుధవారం అసెంబ్లీలోని వైఎస్సార్‌సీఎల్పీ కార్యాలయంలోను, విజయనగరంలో బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేసిన మేలును ప్రజలకు వివరించేందుకు రాష్ట్రంలో సామాజిక న్యాయభేరి పేరిట గురువారం నుంచి బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నాలుగు రోజులు బస్సుయాత్ర కొనసాగుతుందన్నారు. విజయనగరం, రాజమహేంద్రవరం, నరసరావుపేట, అనంతపురంలలో బహిరంగ సభలు నిర్వహించి బడుగు, బలహీన వర్గాలకు జరిగిన అభివృద్ధిని చాటిచెబుతామని వివరించారు. విజయనగరంలో గురువారం సాయంత్రం జరిగే తొలి బహిరంగసభలో 17 మంది మంత్రులతో పాటు ప్రభుత్వం నియమించిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారని చెప్పారు. అంబేడ్కర్ ఆశించిన సమసమాజ స్థాపనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని తెలిపారు.
ఈ క్రమంలోనే అనాదిగా రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వ, వివిధ నామినేటెడ్ పదవుల్లో 50 శాతానికి పైగా అవకాశాలు కల్పించారని ఆయన వివరించారు. సామాజిక న్యాయభేరి యాత్రలో ప్రదర్శించేందుకు రూపొందించిన వీడియోను వైఎస్సార్‌సీఎల్పీ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కె.నారాయణస్వామి, అంజాద్‌బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, మేరుగ నాగార్జున, కారుమూరి వెంకటనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బహిరంగసభ ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి బొత్స వెంట మంత్రులు జోగి రమేష్, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనర్సయ్య, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment