వార్‌కు రెడీ
సాక్షి, చెన్నై: తాత్కాలిక ఉద్వాసన పర్వం డీఎంకేలో పెను ప్రకంపనలను సృష్టిస్తున్నది. అధిష్టానంతో ఢీ కొట్టేం దుకు బహిష్కృత నేతలు కేపీ రామలింగం, ఎస్‌ఎస్ పళని మాణిక్యం రెడీ అయ్యారు. ఇక, డీఎంకే పతనం దిశగా పయనిస్తున్నదని, ఆ పార్టీకి నూకలు చెల్లినట్టేనని ఎంకే అళగిరి స్పష్టం చేశారు. ప్రక్షాళన పర్వంలో భాగంగా 33 మంది నాయకులను పార్టీ నుంచి డీఎంకే అధినేత ఎం కరుణానిధి తాత్కాలిక వేటు వేశారు. అయితే తమ బహిష్కరణకు గల కారణాలు వెల్లడించాలంటూ బహిష్కృత నేతలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకులుగా ఉన్న వాళ్ల మీదే వేటు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు.
పార్టీని పూర్తి స్థాయిలో తన గుప్పెట్లోకి తీసుకోవడం లక్ష్యంగా స్టాలిన్ పథకం వేసినట్టున్నారని, అందుకే అళగిరి, కనిమొళి మద్దతుదారులను సైతం సాగనంపేందుకు సిద్ధం అయ్యారని ఆరోపిస్తున్నారు. చెన్నై, ఈరోడ్, విల్లుపురం, కాంచీపురం, తిరునల్వేలి, తేని, మదురై, తిరువణ్ణామలై జిల్లాల కార్యదర్శు లు పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేసినా, వారిని మాత్రం వెనకేసుకు రావడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. అయితే తమ నాయకులను బహిష్కరించడాన్ని నిరసిస్తూ పలు చోట్ల వారి మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. సేలంలో మూడు బస్సులు ధ్వంసం చేశారు. ఆయా ప్రాంతాల్లోని పార్టీ కార్యాలయాలపై తమ ప్రతాపం చూపించారు.
తానుక్కొడే కారణమా? తంజావూరులో తనను కాదని మరొకరికి సీటు ఇచ్చినా, పార్టీ కోసం శ్రమిస్తే, ఓటమికి బాధ్యుడిని చేయడం శోచనీయమని కేంద్ర మాజీ మంత్రి, బహిష్కృత నేత ఎస్‌ఎస్ పళని మాణిక్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా వ్యవహరించానో అధిష్టానం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఓటమికి కారుకులు ఎందరో ఉన్నా, వారందర్నీ పక్కన పెట్టి కేవలం తనను టార్గెట్ చేయడమేంటని ప్రశ్నించారు. అయితే తనకు అధికారికంగా అధిష్టానం నుంచి బహిష్కరణ లేఖ అందాల్సి ఉందన్నారు. అది వచ్చాక, వివరణ ఎలా ఇవ్వాలో, అధిష్టానంతో ఎలా ఢీ కొడతానో అప్పుడు తెలుస్తుంది...చూస్తూ ఉండడంటూ ఎస్‌ఎస్ ప్రకటించడం గమనార్హం.అవమానంగా ఉంది : పార్టీ నుంచి తాత్కాలికంగా బహిష్కరించడం తనకు ఎంతో అవమానంగా ఉందని ఎంపీ, డీఎంకే వ్యవసాయ విభాగం కార్యదర్శి కేపీ రామలింగం ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా డీఎంకే కోసం శ్రమిస్తూ వచ్చిన తనకు చాలా పెద్ద బహుమతిని అధినేత కరుణానిధి ఇచ్చారని విమర్శించారు. అధిష్టానానికి ఎలాంటి వివరణ ఇవ్వాలో తనకు తెలుసునని, వివరణతోనే సరైన సమాధాన్ని ఇస్తానని స్పష్టం చేశారు.
నోటీసులు రానీయండి : నోటీసులు వచ్చాకే తదుపరి కార్యాచరణ గురించి మాట్లాడుతానంటూ అళగిరి మద్దతుదారుడు, పార్టీ నేత ముల్లై వేందన్ స్పష్టం చేశారు. ఎలాంటి ఆరోపణలు అధిష్టానం దృష్టికి వెళ్లాయో, అభ్యర్థి ఎలాంటి ఫిర్యాదు చేశారో అన్న వివరాలు తనకు తెలియజేయాలని, అప్పుడే పార్టీకి వివరణ ఇస్తానని సమాధానం ఇచ్చారు. ధర్మపురి ఉత్తర జిల్లా కార్యదర్శి ఇన్భశేఖరన్ స్పందిస్తూ, తన మీద ఆరోపణలు, ఫిర్యాదులు వెళ్లడం శోచనీయమని, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, కట్టుబడతానని, తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటానని స్పష్టం చేశారు.
పతనం దిశగా డీఎంకే : డీఎంకేలో తాజా పరిణామాలపై ఎంకే అళగిరిని ప్రశ్నించగా, ఆ పార్టీ పతనం దిశగా పయనిస్తోందని సమాధానం ఇచ్చారు. ఆ పార్టీకి నూకలు చెల్లినట్టేనని, ఇక అభివృద్ధి శూన్యమేనని స్పష్టం చేశారు. తన వెంట తిరుగుతున్నారన్న ఒక్క కుంటి సాకుతో పార్టీ నుంచి అనేక మందిని బహిష్కరించారని మండి పడ్డారు. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారిల్లో ఘోరంగా ఓడిపోయినా, ఆ జిల్లాల కార్యదర్శులను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. పార్టీలో తనకు అడ్డు తగిలే వాళ్లు ఉండకూడదన్న లక్ష్యంగా ఈ ఉద్వాసన పర్వాన్ని సాగిస్తున్నారంటూ కోశాధికారి ఎంకే స్టాలిన్‌పై శివాలెత్తారు. ఈ క్రమంలో బహిష్కృత నేతలందరూ త్వరలో ఏకమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.