చెన్నై: తమిళనాడులోని విక్రవాండీ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షమైన పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) పార్టీని ఓడించాలని డీఎంకే నేత, మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్ అన్నారు. ఆయన సోమవారం ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నీట్-యూజీ -2024 పరీక్ష పేపర్ లీకేజీ, అక్రమాల విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. అందుకే ఈ ఉపఎన్నికల్లో బీజేపీ మిత్రమైన పక్షమైన పీఎంకే పార్టీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
‘మీరు (ప్రజలు) అంతా ఇప్పటికే అధికార డీఎంకే పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై డీఎంకే బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పింది. దీంతో ఉత్తరాది నేతలు కూడా బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేయటం మొదలుపెట్టారు. ఈ సమయంలో బీజేపీ మిత్రపక్షమైన పీఎంకే ఉపఎన్నిక బరిలో నిలిచింది. అందుకే పీఎంకే పార్టీని ఓడించాలని కోరుతున్నా’అని ఉదయ్ నిధి అన్నారు. పరీక్ష పేపర్ లీకైన నేపథ్యంలో జూన్ 28న తమిళనాడు అసెంబ్లీలో నీట్ పరీక్షను రద్దు చేయాలని డీఎంకే ప్రభుత్వం తీర్మానం చేసింది.
ఇక.. విక్రవాండీ అసెంబ్లీ డీఎంకే ఎమ్మెల్యే ఎన్. పుగజేంటి అనారోగ్యం కారణాలతో ఏప్రిల్ 6న మృతిచెందగా ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఇక.. ఇక్కడ పోటీ డీఎంకే పార్టీ, పీఎంకే పార్టీకి మధ్య నెలకొంది. డీఎంకే నుంచి అన్నియూర్ శివ, పీఎంకే నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు సి అన్బుమణి అభ్యర్థులుగా బరిలో దిగారు. రెండు పార్టీలు వన్నియార్ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక్కడ దళిత ఓటర్లు మెజార్టీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment