సాక్షి, చెన్నై : రాజకీయ శత్రువుగా ఉన్నప్పుడు పెట్టిన పరువునష్టం దావా కేసు రాజకీయ మిత్రుడిగా మారిన తరువాత తీర్పు వెలువడిన చిత్రమైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అయితే తీర్పు సైతం మిత్రత్వానికి విఘాతం కలగకుండా వెలువడడం మరో విశేషం. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, ఎండీఎంకే అధ్యక్షుడు వైగో నడుమ సాగిన రాజకీయ యుద్ధం, పరువునష్టం దావా కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డీఎంకేలో కరుణానిధికి సన్నిహితుడిగా మెలిగిన వైగో 1993లో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇందుకు డీఎంకే కార్యదర్శులు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. వైగోకు మద్దతుగా డీఎంకే నుంచి బయటకు వచ్చారు. 1994లో వైగో సొంతంగా ఎండీఎంకేను స్థాపించారు. పార్టీని ప్రారంభించిన కొత్తలో డీఎంకేకు వ్యతిరేకంగా వ్యహరించిన వైగో ఆ తరువాత క్రమంగా దగ్గరయ్యారు.
ఆ తరువాత మరోసారి కరుణానిధితో అభిప్రాయభేదాలు రావడంతో దూరంగా ఉంటూ వచ్చారు. కరుణానిధి కన్నుమూశాక డీఎంకే పార్టీ బాధ్యతలను స్టాలిన్ చేపట్టారు. దీంతో వైగో డీఎంకే కూటమిలో చేరారు. డీఎంకే కూటమి అభ్యర్థిగా ఇటీవల రాజ్యసభకు ఎంపికయ్యారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో వైగోపై అనేక కేసులు నమోదయ్యాయి. ఇటీవల వాటిపై వరుసగా తీర్పులు వెలువడుతున్నాయి. 2009లో జరిగిన ఒక సమావేశంలో వైగో ఎల్‌టీటీఈకి అనుకూలంగా ప్రసంగించడంతో పోలీసులు దేశద్రోహ కేసు పెట్టారు. ఈ కేసులో ఇటీవల ఏడాది జైలు శిక్షపడింది. ఈ తీర్పుపై ఆయన అప్పీలు వెళ్లగా కోర్టు ఆ శిక్షను నిలువరించింది. ఇదిలా ఉండగా 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వైగో ఒక లేఖ రాశారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తాను సామర్థ్యం వహిస్తున్న ఎండీఎంకేను చీల్చేందుకు కుట్రపన్నుతున్నారని ఆ ఉత్తరంలో ఆరోపించారు. ఈ ఉత్తరంలోని వివరాలు ఒక ఆంగ్లపత్రికలో ప్రచురితం కావడంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కరుణానిధి వైగోపై పరువునష్టం దావా వేశారు.
ఈ కేసుకు సంబంధించి చెన్నై సెషన్స్ కోర్టులో అప్పటి నుంచి విచారణ జరుగుతూ వచ్చింది. ప్రజాప్రతినిధుల కేసుల కోసం చెన్నైలో కొత్తగా వెలిసిన ప్రత్యేక కోర్టుకు ఆ కేసు విచారణ బదిలీ అయింది. 13 ఏళ్లుగా విచారణలో ఉన్న ఈ కేసుపై శుక్రవారం తీర్పు వెలువడింది. వైగోపై పిటిషన్‌దారుడు మోసిన అభియోగాలు సరిగా నిరూపణ కానందున కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి కరుణానిధి తీర్పుచెప్పారు. పరువునష్టం దావా కేసుపై శుక్రవారం తీర్పు వెలువడుతున్నట్లు తెలిసినా అనారోగ్యకారణాల వల్ల వైగో కోర్టుకు హాజరుకాలేదు. ఆయన తరఫున న్యాయవాది హాజరయ్యారు. ఇదే కేసుపై ఈనెల 26న కేసు విచారణ జరిగిన సమయంలో కూడా వైగో హాజరుకాలేదు.
Comments
Please login to add a commentAdd a comment