'రూ. 500 కోట్లు ఇస్తామన్నా తిరస్కరించారు'
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎండీఎంకే అధినేత వైగో.. డీఎంకే, బీజేపీలపై సంచలన ఆరోపణలు చేశారు. తమతో పొత్తు పెట్టుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామంటూ ఈ రెండు పార్టీలు డీఎండీకే అధ్యక్షుడు విజయ్కాంత్కు ఆఫర్ చేశాయని చెప్పారు. డీఎంకే.. 500 కోట్ల రూపాయల డబ్బు, 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేయగా, బీజేపీ.. ఎన్నికల ఖర్చుకు కావాల్సినంత డబ్బు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వైగో ఆరోపించారు. అయినా విజయ్కాంత్ వీటిని తిరస్కరించారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అధికార అన్నా డీఎంకేలకు ఓటమి తప్పదని అన్నారు. విజయ్కాంత్ నేతృత్వంలోని తమ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
తమిళనాడులో నాలుగు పార్టీల కూటమి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్(పీడబ్ల్యూఎఫ్) నాయకులు.. వైగో(ఎండీఎంకే), తోల్ తిరుమవలవన్(వీసీకే), జీ. రామకృష్ణన్(సీపీఎం), ఆర్. ముతరాసన్(సీపీఐ)లు.. కెప్టెన్ ఆధ్వర్యంలోని డీఎండీకేతో పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే. డీఎండీకే 124 స్థానాల్లో, పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ అభ్యర్థులు 110 స్థానాల్లో పోటీ చేయడానికి పొత్తు కుదిరింది. డీఎండీకే-పీడబ్ల్యూఎఫ్ కూటమికి కెప్టెన్ విజయ్కాంత్ సీఎం అభ్యర్థిగా ఖరారయ్యారు.