tamilnadu polls
-
విజయ్‌కాంత్‌కు బ్లాక్‌బ్లస్టర్ లేనట్లే!
చెన్నై: ఎట్టకేలకు తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాల వంతే మిగిలింది. అది కూడా మరో రెండు రోజుల్లో.. ఈలోపు ఎవరికి తోచిన అంచనాలు వారివి. ఏదేమైనా ఈ ఎన్నికల్లో కాస్తంత హడావిడిగా హంగుఆర్భాటంగా కనిపించిన వ్యక్తి మాత్రం విజయ్ కాంత్. డీఎండీకే అధ్యక్షుడు అయిన ఆయన గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రజాసంక్షేమకూటమి పేరుతో మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయనకు నిజంగానే తమిళనాడు ప్రజలు పట్టం కట్టబెట్టనున్నారా అన్నంత హడావిడి చేశారు. అదే క్రమంలో పలుమార్లు తన ప్రచార శైలితో విమర్శల పాలయ్యారు. నిజంగానే తమిళ ప్రజలు ఈసారి మనసు మార్చుకొని థర్డ్ ఫ్రంట్‌కు అధికారం కట్టబెట్టనున్నారా అనే అంశంపైన చర్చలు జరగడం.. అదే స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే, ఈ ఫ్రంట్ ప్రచారానికి భిన్నంగా.. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయిన తొలినాళ్లనాటి పార్టీలుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే ఎలాంటి లొల్లి లేకుండానే ఈ ఎన్నికల్లో డీఎండీకేను కార్నర్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా నమోదైన ఓటింగ్ శాతం.. అక్కడి ప్రజల ప్రతిస్పందన ప్రకారం చివరకు తమిళ ప్రజలు పూర్తి స్థాయిలో డీఎంకే, ఏఐడీఎంకేలకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈసారి అధికార మార్పిడి జరిగి మరోసారి తమిళనాడులో కరుణోదయం కానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. జయలలితకు భంగపాటు తప్పదని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయ చిత్రసీమలో ఇద్దరు అగ్ర నేతల చిత్రాల మధ్య సర్రున దూసుకెళ్దామనుకున్న డీఎండీకే అధినేత విజయ్ కాంత్ సినిమా ఊహించినంత బ్లాక్ బ్లస్టర్ కాదు కదా కనీసం యావరేజ్ కూడా అనిపించుకోబోదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. -
మా ఆయన కింగ్ అవుతారు
చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో డీఎండీకే చీఫ్ కెప్టెన్ విజయ్‌కాంత్ భార్య ప్రేమలత దూసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి జయలలిత సారథ్యంలోని అధికార అన్నా డీఎంకే, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నేతృత్వంలోని డీఎంకేలను విమర్శిస్తూ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తన వాగ్ధాటితో ఓటర్లను ఆకర్షిస్తూ, డీఎండీకే కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కృషిచేస్తున్నారు. ప్రేమలత తమ తరపున ప్రచారం చేయాలని డీఎండీకే అభ్యర్థులు కోరుకుంటున్నారు. ఎన్నికల అనంతరం విజయ్‌కాంత్ కింగ్ అయితే, ప్రేమలత పాత్ర కింగ్ మేకర్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన భర్త విజయ్ కాంత్ కింగ్ అవుతారని ప్రేమలత ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలసి డీఎండీకే పోటీ చేస్తోంది. ఈ కూటమి తరపున విజయ్‌కాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. కూటమి గెలుపుకోసం విజయ్ కాంత్, ప్రేమలత వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు. విజయ్‌కాంత్ గెలుపు కోసం ప్రేమలత నిమిషం కూడా వృథా చేయకుండా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు డీఎండీకేనే ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. ఈ రెండు ప్రధాన పార్టీలను వ్యతిరేకిస్తున్న ప్రేమలత.. గత ఎన్నికల్లో అన్నా డీఎంకేతో తమ పార్టీ పొత్తు పెట్టుకోవడం అతిపెద్ద తప్పని అంగీకరించారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్‌కు ప్రజలతో సంబంధాలు లేవని విమర్శించారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఇక జయలలితపైనా ఆమె ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఎండలకు పిల్లలు (ప్రజలు) చనిపోతుంటే అమ్మ (జయలలిత) ఏసీలో కూర్చోరని అన్నారు. తన భర్త విజయ్‌కాంత్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన సినిమాల్లో నటిస్తారు కానీ ప్రజల ముందుకాదంటూ వ్యాఖ్యానించారు. తమిళనాడు మార్పును కోరుకుంటోందని, తమ పార్టీలో అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. విజయ్‌కాంత్ సినిమాల్లోని పవర్ఫుల్ డైలాగులు చెబుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
'ఓటుకు లక్ష రూపాయలు అడగండి'
తిరునెల్వేలి: తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ సతీమణి, ఆ పార్టీ మహిళ విభాగం అధ్యక్షురాలు ప్రేమలతపై కేసు నమోదు చేశారు. తిరునెల్వేలిలో జరిగిన బహిరంగ సభలో ప్రేమలత మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్నా డీఎంకే, డీఎంకే పార్టీలు ఓట్ల కోసం డబ్బులు ఇస్తే తీసుకోవాలని ఓటర్లకు సూచించారు. 'కొన్ని పార్టీలు ఓటుకు రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఇస్తాయి. మీరు ఓటుకు లక్ష రూపాయలు అడగండి' అని ప్రేమలత ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారని పోలీసులు చెప్పారు. అన్నా డీఎంకే కార్యకర్తలు ఫిర్యాదు చేయగా, ప్రేమలత మాట్లాడిన వీడియో రికార్డింగ్‌లను పరిశీలించిన అనంతరం పోలీసులు ఆమెపై కేసు నమోదుచేశారు. తమిళనాడు ఎన్నికల్లో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌కాంత్ బరిలో దిగుతున్నారు. -
కరుణకు కోపం వచ్చింది
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత కరుణానిధికి కోపం వచ్చింది. తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన ఎండీఎంకే అధినేత వైగోకు నోటీసులు పంపించారు. తనపై అసత్య పూర్వకంగా చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు. తమతో పొత్తు పెట్టుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామంటూ డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌కు ఆఫర్ చేశాయని ఎండీఎంకే అధినేత వైగో.. డీఎంకే, బీజేపీలపై సంచలన ఆరోపణలు చేశారు. డీఎంకే.. 500 కోట్ల రూపాయల డబ్బు, 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేయగా, బీజేపీ.. ఎన్నికల ఖర్చుకు కావాల్సినంత డబ్బు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వైగో ఆరోపణల్లో పేర్కొన్నారు. దీనికి వెంటనే స్పందించిన కరుణానిధి అది తమపై చేసిన అసత్య ప్రచారమని అన్నారు. వెంటనే వివరణ ఇవ్వాలంటూ పరువు నష్టం దావా వేశారు. -
'రూ. 500 కోట్లు ఇస్తామన్నా తిరస్కరించారు'
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎండీఎంకే అధినేత వైగో.. డీఎంకే, బీజేపీలపై సంచలన ఆరోపణలు చేశారు. తమతో పొత్తు పెట్టుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామంటూ ఈ రెండు పార్టీలు డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌కు ఆఫర్ చేశాయని చెప్పారు. డీఎంకే.. 500 కోట్ల రూపాయల డబ్బు, 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేయగా, బీజేపీ.. ఎన్నికల ఖర్చుకు కావాల్సినంత డబ్బు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వైగో ఆరోపించారు. అయినా విజయ్‌కాంత్ వీటిని తిరస్కరించారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అధికార అన్నా డీఎంకేలకు ఓటమి తప్పదని అన్నారు. విజయ్‌కాంత్ నేతృత్వంలోని తమ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో నాలుగు పార్టీల కూటమి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్(పీడబ్ల్యూఎఫ్) నాయకులు.. వైగో(ఎండీఎంకే), తోల్ తిరుమవలవన్(వీసీకే), జీ. రామకృష్ణన్(సీపీఎం), ఆర్. ముతరాసన్(సీపీఐ)లు.. కెప్టెన్ ఆధ్వర్యంలోని డీఎండీకేతో పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే. డీఎండీకే 124 స్థానాల్లో, పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ అభ్యర్థులు 110 స్థానాల్లో పోటీ చేయడానికి పొత్తు కుదిరింది. డీఎండీకే-పీడబ్ల్యూఎఫ్ కూటమికి కెప్టెన్ విజయ్‌కాంత్ సీఎం అభ్యర్థిగా ఖరారయ్యారు.