'ఓటుకు లక్ష రూపాయలు అడగండి'
తిరునెల్వేలి: తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు డీఎండీకే అధ్యక్షుడు విజయ్కాంత్ సతీమణి, ఆ పార్టీ మహిళ విభాగం అధ్యక్షురాలు ప్రేమలతపై కేసు నమోదు చేశారు.
తిరునెల్వేలిలో జరిగిన బహిరంగ సభలో ప్రేమలత మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్నా డీఎంకే, డీఎంకే పార్టీలు ఓట్ల కోసం డబ్బులు ఇస్తే తీసుకోవాలని ఓటర్లకు సూచించారు. 'కొన్ని పార్టీలు ఓటుకు రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఇస్తాయి. మీరు ఓటుకు లక్ష రూపాయలు అడగండి' అని ప్రేమలత ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారని పోలీసులు చెప్పారు. అన్నా డీఎంకే కార్యకర్తలు ఫిర్యాదు చేయగా, ప్రేమలత మాట్లాడిన వీడియో రికార్డింగ్లను పరిశీలించిన అనంతరం పోలీసులు ఆమెపై కేసు నమోదుచేశారు. తమిళనాడు ఎన్నికల్లో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్కాంత్ బరిలో దిగుతున్నారు.