Premalatha
-
ప్రేమలతకు ప్రమోషన్...నేపథ్యం ఇదీ
సాక్షి, చైన్నె : దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం(డీఎండీకే) ప్రధాన కార్యదర్శిగా ప్రేమలత విజయకాంత్ ఎంపికయ్యారు. కోశాధికారి పదవి నుంచి ఆమెకు ప్రమోషన్ కల్పిస్తూ డీఎండీకే సర్వ సభ్య సమావేశంలో గురువారం తీర్మానం ఆమోదించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం పార్టీ సర్వ సభ్య సమావేశానికి హాజరైన అధ్యక్షుడు విజయకాంత్ నీరసించి ఉండడంతో మహిళా కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. నేపథ్యం ఇదీ.. 2005లో సినీ నటుడు విజయకాంత్ డీఎండీకేను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తొలిసారిగా ఎదుర్కొన్న ఎన్నికల్లో తానొక్కడే అసెంబ్లీకి ఎన్నికై నా , ఆయన పార్టీ సాధించిన ఓటు బ్యాంక్ తమిళ రాజకీయాలలో విజయకాంత్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేతో చేతులు కలిపి డీఎంకేను చిత్తు చేసిన విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. ఆ తదుపరి అన్నాడీఎంకేతో వైరం వంటి పరిణామాలు విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితులను సృష్టించాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో ఎన్డీఏతో వెళ్లి ఓటమిని చవి చూసినా ఓటు బ్యాంక్ శాతం పెంచుకోవడం కలిసి వచ్చిన అంశంగా మారింది. 2016 అసెంబ్లీ డీఎండీకే నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అవతరించినా, ఫలితం శూన్యం. ఆతర్వాత వరుస ఓటములు ఎదురైనా ఏ మాత్రం డీలా పడకుండా కేడర్ మద్దతు, సినీ అభిమానుల అండతో పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా, పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించ లేని పరిస్థితి నెలకొంది. దీంతో తన వద్ద అదనంగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని సతీమణి, పార్టీ కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌కు అప్పగిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నారు. మహిళా నేత నుంచి ప్రధాన కార్యదర్శి వరకు విజయకాంత్ ఆస్పత్రిలో మూడు వారాలకు పైగా చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై వదంతులు సైతం వచ్చాయి. ఈ పరిస్థితుల్లో గురువారం ఉదయం తిరువేర్కాడులో జరిగిన డీఎండీకే సర్వస సమావేశానికి ఆయన హాజరయ్యారు. చిక్కి శల్యమైన తమ నాయకుడిని చూసి కన్నీటి పర్యంతమవుతూ, కరతాళ ధ్వనులతో ఆయన్ని కేడర్ ఆహ్వానించింది. వేదిక మీద కూర్చుని తన దైన శైలిలో హావాభావాలతో అభిమానులు, కేడర్‌ను విజయకాంత్ పలకరించే ప్రయత్నం చేశారు. ఈ సమావేశంలో 17 తీర్మానాలను ఆమోదించారు. ఇందులో కీలక తీర్మానంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ప్రేమలత విజయకాంత్‌కు అప్పగించారు. ఈ సమయంలో తన భర్త, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ నుంచి ప్రేమలత ఆశీస్సులు అందుకున్నారు. ఈ సమయంలో ఆ వేదిక అంతా కరతాళ ధ్వనులతో మారుమోగింది. ప్రేమలత విజయకాంత్ డీఎండీకే ఆవిర్భావం నుంచి అధ్యక్షుడు విజయకాంత్ వెన్నంటి ఉంటూ వచ్చారు. పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా 13 ఏళ్లు పనిచేశారు. 2018 నుంచి డీఎండీకే కోశాధికారి బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం విజయకాంత్ అనారోగ్య పరిస్థితులతో పార్టీని తన భుజాన వేసుకుని నడిపించేందుకు ప్రేమలత సిద్ధమయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తన తొలి ప్రసంగంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్లడమే కాకుండా, కేడర్, అభిమానులకు ఎల్ల వేళలా తాను అండగా ఉంటానని విజయకాంత్ బాణిలో ప్రకటించారు. అదే సమయంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు, సీట్ల పందేరాలు, తదితర నిర్ణయాలను తీసుకునే అధికారాన్ని మాత్రం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్‌కు అప్పగించారు. ఇవికాకుండా ఇతర నిర్ణయాలను తీసుకునే అధికారం ప్రేమలతకు కేటాయించారు. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి హాజరైన విజయకాంత్ చిక్కిశల్యమైన కనిపించడం అభిమానులు, కేడర్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. కుర్చీలో తనకు తానుగా కూర్చునే స్థితి లేక, తరచూ తన దైన శైలిలో సంకేతాన్ని చూపించే ప్రయత్నంలో ముందుకు పడబోయిన ఆయన్ని వెనుక నుంచి తనయుడు విజయ ప్రభాకరన్, పార్టీ నేత పార్థసారథి గట్టిగా పట్టుకునే ఉండడం అభిమానులను కలిచి వేసింది. -
అన్నాడీఎంకేకు ప్రేమలత హెచ్చరిక
సాక్షి, చెన్నై: కూటమి ధర్మానికి కట్టుబడి ఓపికగా ఉన్నాం...అదే నశిస్తే...ఒంటరి పోటీకి రెడీ అని అన్నాడీఎంకేకు డీఎండీకే కోశాధికారి ప్రేమలత హెచ్చరికలు చేశారు. అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే ఉందని ఆ పార్టీ పేర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు అన్నాడీఎంకే వర్గాలు డీఎండీకేతో సీట్ల పందేరం విషయంగా స్పష్టత ఇవ్వలేదు. మమా అనిపించే రీతిలో పయనం సాగుతున్నాయేగానీ, పూర్తి స్థాయిలో సీట్ల సర్దుబాటు, కూటమి చర్చ సాగలేదు. పలుమార్లు చర్చలకు డీఎండీకే ఆహా్వనించినా అన్నాడీఎంకే దృష్టి అంతా పీఎంకేపైనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఎదురుచూసి తమకు సహనం నశించిందని, ఇక ఒంటరి పోటీకి సిద్ధమయ్యే నిర్ణయం తీసుకోకతప్పదని అన్నాడీఎంకేకు ప్రేమలత విజయకాంత్ ఆదివారం హెచ్చరికలు చేయడం గమనార్హం. ప్రేమలత హెచ్చరిక.. టీనగర్, సైదాపేట, మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో మాంబళంలో ఆదివారం ప్రేమలత భేటీఅయ్యారు. ఆమె అన్నాడీఎంకేకు హెచ్చరికలు చేస్తూ వ్యాఖ్యల తూటాల్ని పేల్చారు. అన్నాడీఎంకే కూటమిలో ఉన్నా కాబట్టే, ఆ కూటమి ధర్మానికి కట్టుబడి చర్చల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. కూటమి ధర్మాన్ని తాము గౌరవిస్తున్నామని, అందుకే ఓపికతో, సహనంతో ఉన్నామని, ఇది నశించిన పక్షంలో ఒంటరి పోటీకి సిద్ధమే అని ప్రకటించారు. ఇప్పటికే 234 నియోజకవర్గాలకు విజయకాంత్ ఇన్‌చార్జ్‌లను నియమించారని, వాళ్లనే తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. తాము ఒంటరిగా పోటీ చేసినా పదిహేను శాతం ఓటు బ్యాంక్ దక్కించుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. -
ఒంటరి పోరుకైనా సిద్ధమే! : ప్రేమలత
సాక్షి, చెన్నై: అసెంబీ ఎన్నికల్లో ఒంటరి పోరుకైనా సిద్ధంగానే ఉన్నామని శనివారం డీఎండీకే ప్రకటించింది. ఆదివారం పొత్తుపై ఆ పార్టీ అధినేత విజయకాంత్ ప్రకటన చేయబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే–బీజేపీ కూటమితో ఎన్నికల్ని డీఎండీకే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డిపాజిట్లే కాదు, ఉన్న కాస్త ఓటు బ్యాంక్‌ను సైతం కోల్పోవాల్సిన పరిస్థితి. అయినా తాము అదే కూటమిలో ప్రస్తుతానికి ఉన్నామని ఆ పార్టీ కోశాధికారి ప్రేమలత చెబుతున్నారు. 2021 ఎన్నికల్లో పొత్తు ఎవరితో అన్నది అందరితో చర్చించి ప్రకటిస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓ వైపు స్పందిస్తూ, మరో వైపు చిన్నమ్మ శశికళకు మద్దతుగా గళాన్ని ప్రేమలత వినిపించడం చర్చకు దారి తీసింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే ఎటో అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో అన్నాడీఎంకే సైతం డీఎండీకేను పెద్దగా పట్టించుకోనట్టుగా ప్రచారం సాగుతోంది. డీఎండీకే 41 సీట్లు ఆశిస్తుండగా, పది సీట్లు ఇవ్వడానికి అన్నాడీఎంకే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో శనివారం డీఎండీకే ఇన్‌చార్జ్‌ల సమావేశం జరగడంతో ప్రాధాన్యత నెలకొంది. ఇన్‌చార్జ్‌లతో భేటీ.. విజయకాంత్ దూరం.. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను డీఎండీకే రంగంలోకి దించిన విషయం తెలిసిందే. మండల, డివిజన్, జిల్లా స్థాయిలోనూ ఇన్‌చార్జ్‌లను నియమించి ఎన్నికల పనుల వేగాన్ని పెంచారు. మొత్తం 320 మంది ఇన్‌చార్జ్‌లతో డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్ శనివారం కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. సమావేశానికి అధినేత విజయకాంత్ రాలేదు. ఇందులో అసెంబ్లీ ఎన్నికల పనులు, పట్టున్న నియోజకవర్గాలు, ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే పరిస్థితి గురించి సమీక్షించారు. సమావేశం చివర్లో పొత్తు నిర్ణయానికి అధికారాన్ని విజయకాంత్‌కు అప్పగించారు. ఒంటరి పోటీకైనా డీఎండీకే సిద్ధం అని ప్రకటించారు. పొత్తా, ఒంటరి పయనమా అనే విషయంగా ఆదివారం విజ యకాంత్ ప్రకటన చేస్తారని డీఎండీకే వర్గాలు పేర్కొనడంతో ఎదురుచూపులు పెరిగాయి. -
అమెరికాలోనే ప్రేమలత అంత్యక్రియలు
సాక్షి, పూతలపట్టు(చిత్తూరు రూరల్): ప్రేమలత అంత్యక్రియలను ఆదివారం అమెరికాలోనే పూర్తిచేశారు. పూతలపట్టు మండలం బందార్లపల్లికి చెందిన ప్రేమలత అమెరికాలో గత మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహం కోసం ప్రేమలత కుటుంబ సభ్యులు నాలుగు రోజులుగా నిరీక్షించారు. తమ కుమార్తె మృతదేహం కావాలని ప్రేమలత భర్త, మామతో పట్టుబట్టారు. కడసారి చూపు చాలంటూ రోదించారు. కోవిడ్–19 కారణంగా చూపి అత్తంటివారు.. తమ కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురాలేతున్నామని చెబుతున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు వివరించారు. మన దేశ సమయం ప్రకారం 9 గంటల ప్రాంతంలో అంత్యక్రియలను అక్కడ ప్రారంభించారు. సంప్రదాయం ప్రకారం దహన క్రియలను పూర్తి చేశారు. జూమ్ లింక్ సాయంతో ప్రేమలత అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, బంధువులు వీక్షించారు. ఈ క్రమంలో మృతిరాలి ఇంటి వద్ద రాత్రి విషాదచాయాలు అలుముకున్నాయి. చివరి చూపు కూడా దూరమైందని తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: (అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి) -
అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి
సాక్షి, చిత్తూరు రూరల్: అమెరికాలో జిల్లాకు చెందిన ప్రేమలత (32) మంగళవారం రాత్రి మృతి చెందింది. పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలతకు, అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లెకు చెందిన సుధాకర్ నాయుడుతో 2016లో వివాహమైంది. 2017లో సుధాకర్ దంపతులు అమెరికా వెళ్లారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు గీతాంష్ ఉన్నాడు. చదవండి: (ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..) మంగళవారం రాత్రి ప్రేమలత ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. తమ కుమార్తెను సుధాకర్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడనిమృతురాలి తండ్రి, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె మృతదేహాన్ని పంపించడానికి అల్లుడు నిరాకరిస్తున్నాడని, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు కలెక్టర్ భరత్‌నారాయణగుప్తాను కోరారు. -
పేద విద్యార్థిని నీట్లో సీటు
సాక్షి, కూనవరం: పేదింటి విద్యార్థిని గడ్డం ప్రేమలత సీట్లో సీటు సాధించింది. కూనవరం గ్రామానికి చెందిన ప్రేమలత తల్లిదండ్రులు చిరువ్యాపారులు. తండ్రి చెప్పుల దుకాణం నడుపుతూ, తల్లి తోపుడు బండిపై ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతూ జీవిస్తున్నారు. తల్లిదండ్రులు పెద్దగా చదువు కోనప్పటికీ తమ పిల్లలను చదివించాలన్న దృఢ సంకల్పంతో చాలీచాలని సంపాదనతోనే ఇద్దరు పిల్లలను మాంటిస్సోరీ కాన్వెంట్లో 6వ తరగతి వరకూ చదివించారు. అనంతరం ప్రేమలత 7, 8 తరగతులు కోతులగుట్ట ఏపీఆర్ గురుకుల పాఠశాలలో చదివింది. జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎటపాకలో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకూ చదివింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన ఆలిండియా స్థాయి జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్స్‌లో మంచి ర్యాంక్ సాధించి, త్రిపుర రాష్ట్రం అగర్తలలో నిట్‌లో (ఎన్ఐటీ) సీటు సాధించింది. సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని ప్రేమలత తెలిపింది. -
సమాన అవకాశాలు ఇవ్వాలి
జనగామ: ‘‘ఉద్యోగ, రాజకీయ రంగాల్లో పురుషులతోపాటు మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలి.. పార్లమెంట్, అసెంబ్లీలో రిజర్వేషన్లు, సమాజంలో తగిన గౌరవం కల్పించాలి.. అప్పుడే మహిళా సాధికారత ఏర్పడుతోంది..’’ అని అంటున్నారు జనగామ మునిసిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి. ‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ అనేది నినాదానికే పరిమితం కాకుండా మహిళలకు అన్ని చోట్ల తగిన ప్రాతినిథ్యం కల్పిస్తేనే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. మహిళల సత్తా చాటాం.. ప్రభుత్వాలు మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా అవి ఆచరణకు నోచుకోవడం లేదు. గత టీడీపీ హయాంలో అసెంబ్లీలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తీర్మానం చేసినా, పార్లమెంట్‌కు వెళ్లే సరికి అది ఆమోదానికి నోచు కోలేదు. రాజకీయంగా రిజర్వేషన్లు లేకపోవడంతో మహిళలు జనరల్ స్థానాల్లో పోటీచేయాల్సి వస్తుంది. జనగామ మునిసిపల్‌లో 14 మంది మహిళలకు రిజర్వేషన్లు అనుకూలిస్తే, ఇతర స్థానాల్లో కలుపుకుని మొత్తం 16 మంది గెలిచి మహిళల సత్తా చాటు కున్నాం. రిజర్వేషన్లు ఉంటే పురుషులతో సమానంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. మాకు మేమే ముందుకు వెళ్తున్నాం తప్ప.. చట్టాలు అనుకూలంగా కనిపించడం లేదు. స్త్రీలను ప్రోత్సహించాలి.. మహిళలు వంటింటికే పరిమితం అనే పదాన్ని పక్కన బెట్టి.. వారిని ప్రోత్సహించే విధంగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయంగా సమాన హక్కులు కల్పించాలి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రాజ్యసభ తదితర వాటిలో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు తీసుకురావడంతో మహిళలకు అక్కడ సముచిత స్థానం లభించింది. అన్నింట్లో పనిచేయగలిగే సత్తా మహి ళలకు ఉంది. 80 శాతం మంది విద్యావంతులుగా మారినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలామంది వెనకబడి ఉన్నారు. నేల నుంచి ఆకాశం వరకు దేశం సాధిస్తున్న ప్రగతిలో మహిళల పాత్ర ముఖ్యభూమిక పోషిస్తుంది. చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలనే తపన మహిళల్లో రావాలి. రిజర్వేషన్లు అమలైతే నారీ లోకానికి తిరుగు ఉండదు. స్వేచ్ఛ రావాలి.. ప్రస్తుత రాజకీయాల్లో మహిళలు రాణిస్తున్నా.. పూర్తిస్థాయి స్వేచ్ఛ లేకుండా పోయింది. మహిళలకు ప్రత్యేక హోదా.. గౌరవం రావాలి. ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్న క్రమంలో స్వతహాగా నిర్ణయం తీసుకునే శక్తిగా ఎదగాలి. రాజకీయ రంగంతో పాటు ఉద్యోగ అవకాశాల్లో పురుషులతో సమాన అవకాశాలు రావాలి. పురుషుల చాటు మహిళలు కాకుండా, వారే నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలి. మహిళలకు అనేక చట్టాలు ఉన్నా, దాడులు, అత్యాచారాలు జరిగిన సమయంలో దుండగులు అందులో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని తప్పించుకుంటున్నారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.. మహిళలు ఆర్థికంగా బలపడే విధంగా ఏటా బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలి. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేసినప్పుడే వంటింటి చాటున ఉన్న వారు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతమున్న మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఉద్యోగం చేస్తున్న మహిళల్లో మరింత ఆత్మ స్థ్యైర్యాన్ని కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్య క్రమాలను నిర్వహించాలి. భ్రూణహత్యలు, వరకట్న వేధింపులు లేకుండా ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేయాలి. -
ప్రేమలతకు పగ్గాలు
డీఎండీకే పగ్గాలు విజయకాంత్ సతీమణి ప్రేమలత చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెకు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టేందుకు డీఎండీకే వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. సాక్షి, చెన్నై: 2005లో సినీ నటుడు విజయకాంత్ దేశీయ ముర్పోగు ద్రావిడ కళగం(డీఎండీకే)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భావంతో జరిగిన తొలి ఎన్నికల్లో తానొక్కడినే గెలిచినా, ఢీలా పడకుండా అడుగులు వేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా జోడు పదవులతో ముందుకు సాగి 2011లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. అయితే 2016 ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు డీఎండీకేను ఢీలా పడేలా చేశాయి. ఎండీఎంకే, వామపక్షాలు, వీసీకే నేతృత్వంలోని కూటమిలోకి విజయకాంత్ వెళ్లడాన్ని ఖండిస్తూ, ఆ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ బయటకు వచ్చేశారు. ఈ ప్రభావం ఆ ఎన్నికల్లో విజయకాంత్‌కు గట్టి దెబ్బ తగిలేలా చేశాయి. డిపాజిట్లే కాదు, గత కొన్నేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన ఓటు బ్యాంక్‌ను ఆయన కోల్పోక తప్పలేదు. మళ్లీ పూర్వ వైభవం లక్ష్యంగా మీలో ఒక్కడ్నీ అంటూ కేడర్ వద్దకు పరుగులు తీస్తూ వచ్చిన విజయకాంత్ ప్రస్తుతం అనారోగ్యం బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా ఆసుపత్రికి, ఇంటికి తిరగక తప్పడం లేదు. ప్రస్తుతం ఆయనకు మళ్లీ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమైనట్టుగా ప్రచారం సాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో పార్టీని నడిపించడంతోపాటుగా కేడర్‌ను దక్కించుకునే విధంగా పగ్గాలు ఆయన సతీమణి ప్రేమలతకు అప్పగించేందుకు తగ్గ కార్యాచరణ డీఎండీకేలో సిద్ధం అవుతోన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. విజయకాంత్ సతీమణి ప్రేమలత మంచి వాక్చాతుర్యం కల్గిన వారు. సమయానుగుణంగా స్పందించే తత్వం ఉన్న వారు. ఇంకా చెప్పాలంటే, విజయకాంత్‌ను మించి ప్రసంగాలు సాగించగల సమర్థురాలు. డీఎండీకే ఎన్నికల ప్రచారంలో ఆమె పాత్ర కీలకం. పార్టీలో ఎలాంటి పదవీ లేకున్నా, అన్నీ తానై విజయకాంత్ వెన్నంటి ఆమె సాగుతున్నారని చెప్పవచ్చు. పార్టీలో ఆమెకు పదవి కట్టబెట్టాలన్న నినాదం ఎప్పటి నుంచో వస్తున్నా, విజయకాంత్ అందుకు తగ్గ నిర్ణయాన్ని ఎన్నడూ తీసుకోలేదు. ఇందుకు కారణం, ఎక్కడ పార్టీలోని సీనియర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తారోననే. ప్రస్తుతం సీనియర్లు ఎవ్వరూ ఆ పార్టీలో లేరు. ఉన్నదంతా అభిమాన లోకం. వారిని రక్షించుకోవాలంటే, పార్టీ పగ్గాలు ప్రేమలతకు అప్పగించాల్సిన అనివార్యం ప్రస్తుతం ఏర్పడి ఉంది. విజయకాంత్ ఆసుపత్రిలో ఉండడంతో, పార్టీని నడిపించేందుకు తగ్గ కార్యాచరణను డీఎండీకే వర్గాలు సిద్ధం చేశాయి. విజయకాంత్ చేతిలో ఉన్న జోడు పదవుల్లో ఓ పదవిని ప్రేమలత స్వీకరించాలన్న నినాదాన్ని అందుకుని ఉన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి పదవి విజయకాంత్ వద్దే ఉంచి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలని ప్రేమలత మీద ఒత్తిడి తెచ్చే పనిలో కేడర్ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో, డీఎండీకే వెబ్సైట్లోనూ ఆమె తప్ప మరొకరు లేరని, ఆమె పగ్గాలు చేపట్టాల్సిందేనని కేడర్ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో డీఎండీకే కార్యాలయం నుంచి ప్రేమలత ప్రధాన కార్యదర్శి అన్న అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఎక్కువేనని ఓ నేత పేర్కొన్నారు. విజయకాంత్ బావమరిది సుధీష్ ఆ పార్టీ యువజన నేతగా ఉన్నా, పార్టీని నడిపించే సత్తా మాత్రం ప్రేమలతకు మాత్రమే ఉందని, ఆమె పగ్గాలు చేపట్టేందుకు ఇదే మంచి సమయంగా ఆ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఇక వదినమ్మ రాజ్యం
సాక్షి, చెన్నై: డీఎండీకేలో వదినమ్మ ప్రేమలత విజయకాంత్ ఇక పూర్తిస్థాయిలో చక్రం తిప్పబోతున్నారు. కొత్త రక్తంతో పూర్వవైభవం లక్ష్యంగా అడుగులకు సిద్ధ పడ్డ విజయకాంత్ తన సతీమణికి పార్టీలో పదవి కట్టబెట్టేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. త్వరలో ఇందుకు తగ్గ అధికార ప్రకటన వెలువడ బోతున్నది. పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి పగ్గాలు వదినమ్మను వరించే అవకాశాలు ఉన్నట్టుగా డీఎండీకేలో చర్చ బయలుదేరడం గమనార్హం. సినీ నటుడి నుంచి రాజకీయ నేత గా ఎదిగిన విజయకాంత్‌కు వెన్నంటి ఆయన సతీమణి ప్రేమలత, బావ మరి ది సుదీష్ ఉంటూ వస్తున్నారు. సుదీష్ డీఎండీకే యువజన పగ్గాలతో ఆది నుం చి ముందుకు సాగుతూ వస్తున్నారు. పా ర్టీ ఆవిర్భావంతో డీఎండీకే వ్యవహారాలను తెర వెనుక నుంచి ప్రేమలత సా గించే వారు. 2011 ఎన్నికల్లో ఆమె పార్టీ కోసం పూర్తి స్థాయిలో తనను అంకితం చేసుకున్నారు. ఎలాంటి పదవి పార్టీలో లేకున్నా, ఆ ఎన్నికల్లో డీఎంకే పతనం లక్ష్యంగా ప్రచార బాధ్యతల్ని తన భుజాన వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తన వాక్చాతుర్యంతో ప్రజ ల్ని ఆకర్షించారని చెప్పవచ్చు. ఆ ఎన్నికల్లో డీఎండీకే ప్రధాన ప్రతి పక్షంగా అవతరించడం ప్రేమలత బాధ్యతలు పెరి గాయి. పార్టీ అనుబంధ మహిళా విభా గం కార్యదర్శి పదవితో పార్టీ వ్యవహారాల్లో ఆమె జోక్యం పెరిగిందని చెప్పవచ్చు. ఇది మరీ ఎక్కువ కావడంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకేకు పెద్ద దెబ్బ తగిలేలా చేశాయి. టార్గెట్ వదినమ్మ: ప్రజా సంక్షేమ కూటమిలోకి డీఎండీకేను తీసుకెళ్లడంలో ప్రేమలత కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు, విమర్శలు బయలు దేరాయి. వదినమ్మ తీరును ఖండిస్తూ, నిరసిస్తూ బయటకు వెళ్లిన వాళ్లు తీవ్రంగానే స్పందించారు. వాటిని ఖాతరు చేయని వదినమ్మ రాష్ట్ర వ్యాప్తం గా సుడిగాలి పర్యటనే సాగించారు. విజ యకాంత్ కేవలం బహిరంగ సభలకు పరిమితం అయితే, తానొక్కరే అన్నట్టుగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రేమలత తీవ్రంగానే చక్కర్లు కొట్టారు. ఇంత వరకు సాగిన తతంగాలు ఓ ఎత్తు అయితే, ఎన్నికల అనంతరం డీఎండీకేను వీడే వారు మరీ ఎక్కువే అయ్యారు. వీళ్లు కూడా వదినమ్మను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన వాళ్లే. వదినమ్మకు పదవి: ఇన్నాళ్లు తన సతీమణికి పార్టీలో ఎలాం టి పదవి లేనందునే, విమర్శలు, ఆరోపణలు గుప్పించారని, ఇక, ఆమెను అందలం ఎక్కిస్తా చూడండి అన్నట్టు, ఉండే వాళ్లు ఉండొచ్చు, వెళ్లే వాళ్లు వెళ్లొచ్చన్న సంకేతాన్ని విజయకాంత్ జిల్లాల నేతల కు రెండు రోజుల క్రితం పంపిం చినట్టు సమాచారం. ఇప్పటికే డీఎండీకే నుంచి ముఖ్యమైన నాయకులు బయటకు వెళ్లిన దృష్ట్యా, ఇక ఉన్న వాళ్లందరూ తన అభిమానులేనని, వీరి ద్వారా సరికొత్త రక్తాన్ని నింపి, బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతానన్న ధీమాను విజయకాంత్ తన సంకేతంతో నేతల్లోకి పంపించి ఉండడం గమనార్హం. సరికొత్త అడుగులతో ముందుకు సాగి పూర్వ వైభవాన్ని చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉందని, స్థానిక సమరంతో సత్తా ను చాటుకోవాల్సి ఉన్నందున, పార్టీలో వదినమ్మకు పదవిని అప్పగించే విధం గా జిల్లాల్లో తీర్మానాలు చేసి రాష్ర్ట కమిటీకి పంపించాలని సూచించి ఉండటం ఆలోచించదగ్గ విషయమే. తానేదో స్వ యంగా వదినమ్మకు పదవి కట్టబెట్టినట్టుగా కాకుండా, జిల్లాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు అందలం ఎక్కించినట్టు చెప్పుకునేందుకే అన్నయ్య తన సంకేతా న్ని పంపించినట్టుగా డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాల కమిటీల సమావేశాల్లో తీసుకునే తీర్మానం మేరకు త్వరలో రాష్ట్ర కమిటీ ఆమోదించి వదినమ్మకు పార్టీలో పదవి కట్టబెట్టడం ఖాయం అంటున్నారు. వదినమ్మకు పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి పగ్గాలు అప్పగించేందుకు అవకాశాలు ఉన్నాయ ని, ఆ పదవికి ఆమె అన్ని రకాలుగా అర్హురాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. విజయకాంత్ సంకేతం అలా పంపించారో లేదో, ఇలా కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం జిల్లాల నేతలు ఇందుకు తామూ ఒకే అన్నట్టుగా తమ అన్నయ్యకు లేఖల్ని పంపించి ఉండడం విశేషం. విజయకాంత్ ఆరోగ్య పరంగా సమస్యల్ని ఎదుర్కొంటున్న దృష్ట్యా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార పర్యటనలు సాగించడం కష్టతరమే. ఇందుకు నిదర్శనం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం బహిరంగ సభలకే ఆయన పరిమితం కావడమే. ఈ దృష్ట్యా, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, కేడర్‌లో ఉత్సాహం నింపడం, పూర్వ వైభం లక్ష్యంగా ముందుకు సాగాలంటే, వదినమ్మకు తగిన బాధ్యతలు తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తించే తమ అన్నయ్య పదవీ నిర్ణయాన్ని తీసుకున్నట్టు డీఎండీకే నాయకుడు ఒకరు పేర్కొనడం గమనార్హం. వదినమ్మ చేతికి పదవి దక్కిన పక్షంలో, ఇక డీఎండీకేలో ఆమె పూర్తిస్థాయిలో చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువే. ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు, పరిణామాలకు దారి తీస్తాయో అన్నది వేచి చూడాల్సిందే. -
విజయకాంత్ కు ఊరట
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీరికి తిరుప్పూర్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ పై అత్యున్నత న్యాయస్థానం గురువారం స్టే ఇచ్చింది. ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు, ఆధార రహిత ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ విజయకాంత్, ప్రేమలతపై తమిళనాడులోని పలు జిల్లాల్లో పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకాకపోవడంతో వీరికి తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్ జారీచేసింది. మరోవైపు ఆగస్టు 9న తమ ఎదుట హాజరుకావాలని విల్లుపురం కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన విజయకాంత్ కు పరువునష్టం కేసులు తలనొప్పిగా మారాయి. -
సుప్రీంకు అన్న, వదిన..
వారెంట్ రద్దుకు పిటిషన్ విల్లుపురం కోర్టు సమన్లు సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతల, ఆ పార్టీ వర్గాల మీదున్న పరువు నష్టం దావాల విచారణల వేగం పెరిగింది. తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్ జారీ చేసి ఉంటే, విల్లుపురం కోర్టు బుధవారం సమన్లు జారీ చేయడం గమనార్హం. సీఎం జయలలితకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు, ఆధార రహిత ఆరోపణలు గుప్పించే వారిపై పరువు నష్టం దావాల మోత రాష్ట్రంలో మోగడం జరుగుతున్నది. ఆ దిశగా డీఎండీకే అధినేత విజయకాంత్‌పై అనేకానేక పిటిషన్లు జిల్లాల వారీగా దాఖలై ఉన్నాయి. పిటిషన్ల విచారణల్లో భాగంగా కోర్టు మెట్లు ఎక్కకుండా డుమ్మాలు కొడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుప్పూర్ కోర్టు డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు మంగళవారం పిటీ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో బుధవారం విల్లుపురం కోర్టు సమన్లు జారీ చేయడం గమనార్హం. మరో కేసు నిమిత్తం కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉండగా, డుమ్మా కొట్టారు. ఎక్కడ తిరుప్పూర్ కోర్టు తరహాలో విల్లుపురం కోర్టు సైతం పీటీ వారెంట్ జారీ చేస్తుందోనన్న ఆందోళనతో విజయకాంత్, ప్రేమలత తరఫున న్యాయవాదులు మేల్కొన్నారు. ఆ ఇద్దరు కోర్టుకు హాజరు కాలేని పరిస్థితులను వివరించడంతో న్యాయమూర్తి సరోజిని దేవి ఏకీభవించారు. ఆగస్టు తొమ్మిదో తేదీకి విచారణ వా యిదా వేస్తూ, ఆ రోజున తప్పని సరిగా కోర్టుకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. విల్లుపురం కోర్టు సమన్లతో తప్పించుకున్నా, తిరుప్పూర్ కోర్టు వారెంట్‌తో ఎక్కడ అరెస్టు కావాల్సి వస్తుందోనన్న బెంగ తో విజయకాంత్, ఆయన సతీమణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ ఇద్దరి తరఫున న్యాయవాది మణి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్‌ను రద్దు చేయాలని విన్నవించారు. -
అన్న, వదినమ్మకు వారెంట్
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు తిరుప్పూర్ కోర్టు మంగళవారం పిటీ వారెంట్ జారీ చేసింది. ఆ ఇద్దర్నీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలన్న ఈ వారెంట్‌తో డీఎండీకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఆధార రహిత ఆరోపణలు గుప్పించినా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. ఇందుకు అద్దం పట్టే విధంగా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు పరువు నష్టం దావాల్ని కోర్టుల్లో కోకొల్లలుగా దాఖలు చేశారు. ఇందులో భాగంగా గతంలో తిరుప్పూర్ జిల్లా పల్లడంలో జరిగిన బహిరంగ సభలో డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత సీఎం జయలలితను టార్గెట్ చేసి తీవ్రంగానే విరుచుకు పడ్డారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది సుబ్రమణియన్ తిరుప్పూర్ మొదటి మెజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తో సీఎంకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు గుప్పించిన విజయకాంత్, ప్రేమలతలపై చర్యకు కోర్టును విన్నవించారు. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న న్యాయమూర్తి అలమేలు నటరాజన్ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అని విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు సమన్లు జారీ చేసింది. అయితే, ఆ సమన్లను ఆ ఇద్దరూ ఖాతరు చేయలేదు. మంగళవారం కోర్టుమెట్లు ఎక్కాల్సిన ఆ ఇద్దరు డుమ్మా కొట్టారు. దీంతో న్యాయమూర్తికి ఆగ్రహం వచ్చినట్టుంది. ఆ ఇద్దర్నీ కోర్టులో హాజరు పరచాలని పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ వారెంట్ జారీతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. అసలే రోజుకో రూపంలో సమస్యలు తమ అన్న, వదినమ్మలను చుట్టుముట్టుతున్న సమయంలో ఈ వారెంట్ ఏమిటో అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు రాష్ర్టంలో తమకు వ్యతిరేకంగా ఉన్న దృష్ట్యా, పోలీసులు అరెస్టు చేసినా చేస్తారేమో అన్న ఉత్కంఠకు గురి అవుతున్నారు. ఇది వరకు విజయకాంత్, ప్రేమలతల మీద వేర్వేరుగా కోర్టుల్లో పరువు నష్టం దావాలు విచారణలో ఉన్నాయి. అయితే, తిరుప్పూర్ కోర్టులో మాత్రం ఇద్దరి మీద ఒకే కేసు విచారణలో ఉన్నది. -
ఎట్టకేలకు పెదవి విప్పిన వదినమ్మ...
సాక్షి, చెన్నై: ఎందరు వెళ్లినా, తమ బలం తమదే అని డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత ధీమా వ్యక్తం చేశారు. కెప్టెన్ విజయకాంత్ వెన్నంటి లక్షల్లో అభిమానులు ఉన్నారని, వారి మద్దతుతో పూర్వ వైభవం తప్పనిసరిగా వ్యాఖ్యానించారు. పార్టీని వీడి వెళ్తున్న నాయకులందరూ ద్రోహులే అని మండిపడ్డారు. ఇక, ఎన్నికల సమయంలో ఎండీఎంకే నేత వైగో తమకు తీవ్ర షాక్ ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు, ఎన్నికల అనంతరం డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలతకు వ్యతిరేకంగా ఆ పార్టీ వర్గాలే పెదవి విప్పడం మొదలెట్టాయి. ఆమె అనాలోచిత నిర్ణయాలతో పార్టీ పాతాళంలోకి నెట్టబడిందని విమర్శలు, ఆగ్రహం ప్రదర్శించే వాళ్లు ఎక్కువే. కొందరు గుడ్‌బై చెప్పి బయటకు వస్తుం టే, మరికొందరు కెప్టెన్ మీదున్న అభిమానంతో ఇంకా అంటి పెట్టుకుని ఉన్నారు. అదే సమయంలో వదినమ్మ ప్రేమలత జోక్యం ఇక పార్టీలో ఉండకూడదంటూ కెప్టెన్‌కు హెచ్చరికలు, సూచనలు చేసేవాళ్లు పెరిగారు. తన మీద పార్టీ వర్గా లు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నా, మౌనంగా ఉంటూ వచ్చిన ప్రేమలత శుక్రవారం పెదవి విప్పారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానేమిటో, కెప్టెన్ ఏమిటో వివరిస్తూ, పార్టీ వ్యవహా రాల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. కెప్టెన్ ఏ నిర్ణయాన్నైనా సరే కార్యకర్తలతో చర్చించి తీసుకుంటారని వ్యాఖ్యానించారు. వైగో షాక్ ఇచ్చారు: డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా డీఎండీకే అవతరించాలన్న లక్ష్యంతో ప్రజాసంక్షేమ కూటమితో పయనం సాగించామని ప్రేమలత గుర్తు చేశారు. అవినీతి డీఎంకేను తరిమి కొట్టడం లక్ష్యంగా 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో చేతులు కలపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, అన్నాడీఎంకే తీరు నచ్చక బయటకు వచ్చామని, ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించామని వివరించారు. అందుకే ప్రజలతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనే విధంగా ప్రజా కూటమికి నేతృత్వం వహించడం జరిగిందని వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల చివరి క్షణంలో ఎండీఎంకే నేత వైగో పెద్ద షాక్కే ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయమైనా, చివరి క్షణంలో పోటీకి దూరంగా ఉండడం ఆవేదన కల్గించిందని పేర్కొన్నారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చినా, ఆయన ఏ మాత్రం తగ్గలేదని అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరి పయనమా లేదా..? అన్నది కెప్టెన్ ప్రకటిస్తారని చెప్పారు. ప్రజాసంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చినట్టుగా కెప్టెన్ స్వయంగా ఇంత వరకు ప్రకటించలేదుగా అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మా వల్లే ఓటమి: డీఎంకేకు తమ వల్లే గట్టి దెబ్బ తగిలిందని వివరించారు. తమతో పొత్తుకు డీఎంకే ముందుకు రాని దృష్ట్యా, అధికారం వారి చేతికి చిక్కలేదని ఎద్దేవా చేశారు. డీఎంకే అవినీతి పార్టీ అన్న విషయాన్ని కెప్టెన్ ఎప్పుడో పరిగణించారని, అందుకే వారి వెంట వెళ్లకూడదన్న నిర్ణయంతో ఆది నుంచి ఉంటూ వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ కూటమితో ఒరిగిందేమిటో అని ఈసందర్భంగా ప్రశ్నించగా, లోక్‌సభ ఎన్నికల్లో 37 సీట్లను గెలుచుకున్న అన్నాడీఎంకేతో ఒరిగిందేమిటో అని పొంతన లేని సమాధానం ఇవ్వడం గమనార్హం. అభిమానులు మా వెంటే: కెప్టెన్‌ను చూస్తే పీఎంకే అధినేత రాందాసు, ఆయన తనయుడు రాందాసులకు భయం అని, అందుకే తమను టార్గెట్ చేసి వ్యాఖ్యల్ని సంధిస్తున్నారని మండిపడ్డారు. డీఎండీకే గురించి వారికి ఏమి తెలుసునని, వాళ్ల పార్టీ గురించి ముందు ఆలోచించుకుంటే మంచిదంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డీఎండీకే నుంచి ఎందరు బయటకు వెళ్లినా, కెప్టెన్ బలం...కెప్టన్ దే...మా బలం మాదే...! అని ధీమా వ్యక్తం చేశారు. వెళ్తున్న వాళ్లందరూ ద్రోహులు అని, చంద్రకుమార్ లాంటి వారికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది కెప్టెన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వెళ్తూ..వెళ్తూ నిందల్ని వేయడం చూస్తుంటే, ఏ మేరకు కెప్టెన్‌కు ద్రోహం చేస్తున్నారో అర్థం చేసుకోవాలని సూచించారు. ఎందరు నాయకులు బయటకు వెళ్లినా, కెప్టెన్ అభిమానులు లక్షల్లో వెన్నంటి ఉన్నారని, వాళ్లను కదిలించడం అంత సులభం కాదని ధీమా వ్యక్తం చేశారు. జోక్యం లేదు: పార్టీ వ్యవహారాల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని, చేసుకోబోనని స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న కెప్టెన్ ముందుగా నాయకులతో చర్చిస్తారని, తదుపరి కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటారని వివరించారు.నిర్ణయం తీసుకున్న తర్వాత చివరకు తనకు సమాచారం ఇస్తారేగానీ, ఎన్నడూ తనకు ముందే ఎలాంటి విషయాలు చెప్పరని వ్యాఖ్యానించారు. 2005లో పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని వ్యవహారాల్లోనూ ప్రతిచోట కార్యకర్తలు కన్పిస్తారని, వారి అభీష్టం మేరకు కెప్టెన్ నిర్ణయం ఉంటుందన్నారు. -
కెప్టెనే సీఎం
► మంత్రిగా తిరుమావళవన్ ► ‘రమణ’ బాణిలో అవినీతి అంతం ► ఆ ఇద్దరికీ విశ్రాంతి ఇద్దాం ► ఓటర్లకు ప్రేమలత పిలుపు సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ సీఎం పగ్గాలు చేపట్టనున్నారని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన సతీమణి, పార్టీ మహిళా విభాగం నేత ప్రేమలత ధీమా వ్యక్తం చేశారు. వీసీకే నేత తిరుమావళవన్ కీలక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపడతారని వ్యాఖ్యానించారు. కెప్టెన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రమణ’(ఠాగూర్) సినీ బాణిలో రాష్ట్రంలో అవినీతి అంతం సాగుతుందని స్పష్టం చేశారు. డీఎండీకే-ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్న వారిలో విజయకాంత్ సతీమణి ప్రేమలత కూడా ఉన్నారు.ఆ కూటమిలోని నేతలు బహిరంగ సభలు, అప్పుడుప్పుడు రోడ్‌షోలతో ప్రజల్లోకి వస్తుంటే, ప్రేమలత మాత్రం నిర్విరామంగా రోడ్‌షోలతో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లు అత్యధికంగా ఉండే రోడ్లు, చిన్న చిన్న వీధుల్లోనూ మైక్ అందుకుని ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. నివ్వెరపోయి వినేంతగా ఆమె వాగ్ధాటి సాగుతూ ఉన్నది. డీఎంకే, అన్నాడీఎంకేలను కడిగి పారేస్తున్నారు. తాజాగా ఆమె పర్యటన సేలం, ఈరోడ్, నామక్కల్‌లలో సాగుతున్నది. ఈ రోడ్ షోలో భాగంగా మంగళవారం ఆమె ఓటర్లను ఉద్దేశించి పలు చోట్ల ప్రసంగిస్తూ, తన భర్త, పార్టీ అధినేత విజయకాంత్‌ను పొగడ్తలతో ముంచుతూ, తదుపరి సీఎం ఆయనే అని, ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని ఓటర్లకు సూచించే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే అధినేత్రి ఏమో సెల్‌ఫోన్ ఇస్తున్నానంటూ ప్రకటించారని, అయితే, ఇక్కడ ఎవరి చేతిలో చూసినా సెల్ఫోన్లే అని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ఆమె ఇచ్చే సెల్ఫోన్లు అవసరమా...అవసరమా..? అంటూ ప్రశ్నిస్తూ, వద్దు..వద్దు అని ఓటర్ల చేత సమాధానం రాబట్టారు. రేషన్ షాపుల వద్ద మహిళలు నిత్యావసర వస్తువుల కోసం పెద్ద సంఖ్యలో గంటల తరబడి నిలబడి ఉండడాన్ని చూసి ఆవేదన చెందిన కెప్టెన్ ఇంటి వద్దకే నిత్యవసర వస్తువులు అన్న అంశాన్ని మేనిఫెస్టోలో ప్రకటించారని వివరించారు. ఇక, టాస్మాక్‌ల వద్ద మగరాయుళ్ల బారులు తీరి ఉండడాన్ని దృష్టిలో ఉంచుకునే సంపూర్ణ మద్యనిషేధం నినాదాన్ని అందుకున్నట్టు పేర్కొన్నారు. కెప్టెన్ అధికార పగ్గాలు చేపట్టగానే, తొలి సంతకంగా మద్య నిషేధంకు అనుకూలంగానే ఉంటుందని స్పష్టం చేశారు. వయస్సుపై బడ్డ వాళ్లు ఇక, సీఎం కూర్చీల్లో కూర్చునేందుకు అనర్హులుగా పేర్కొంటూ, జయలలిత, కరుణానిధిలకు ఇక శాశ్వత విశ్రాంతిని ఇద్దామని ఓటర్లకు పిలుపునిచ్చారు. కెప్టె సీఎం కావడం తథ్యం అని, తిరుమావళవన్ కీలక మంత్రిత్వ శాఖను చేపడతారంటూ, కెప్టెన్ బ్లాక్ బస్టర్ రమణ సినీమా బాణిలో రాష్ర్టంలో అవినీతి అంతం సాగబోతోందన్నారు. -
మా ఆయన కింగ్ అవుతారు
చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో డీఎండీకే చీఫ్ కెప్టెన్ విజయ్‌కాంత్ భార్య ప్రేమలత దూసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి జయలలిత సారథ్యంలోని అధికార అన్నా డీఎంకే, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నేతృత్వంలోని డీఎంకేలను విమర్శిస్తూ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తన వాగ్ధాటితో ఓటర్లను ఆకర్షిస్తూ, డీఎండీకే కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కృషిచేస్తున్నారు. ప్రేమలత తమ తరపున ప్రచారం చేయాలని డీఎండీకే అభ్యర్థులు కోరుకుంటున్నారు. ఎన్నికల అనంతరం విజయ్‌కాంత్ కింగ్ అయితే, ప్రేమలత పాత్ర కింగ్ మేకర్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన భర్త విజయ్ కాంత్ కింగ్ అవుతారని ప్రేమలత ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలసి డీఎండీకే పోటీ చేస్తోంది. ఈ కూటమి తరపున విజయ్‌కాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. కూటమి గెలుపుకోసం విజయ్ కాంత్, ప్రేమలత వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు. విజయ్‌కాంత్ గెలుపు కోసం ప్రేమలత నిమిషం కూడా వృథా చేయకుండా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు డీఎండీకేనే ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. ఈ రెండు ప్రధాన పార్టీలను వ్యతిరేకిస్తున్న ప్రేమలత.. గత ఎన్నికల్లో అన్నా డీఎంకేతో తమ పార్టీ పొత్తు పెట్టుకోవడం అతిపెద్ద తప్పని అంగీకరించారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్‌కు ప్రజలతో సంబంధాలు లేవని విమర్శించారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఇక జయలలితపైనా ఆమె ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఎండలకు పిల్లలు (ప్రజలు) చనిపోతుంటే అమ్మ (జయలలిత) ఏసీలో కూర్చోరని అన్నారు. తన భర్త విజయ్‌కాంత్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన సినిమాల్లో నటిస్తారు కానీ ప్రజల ముందుకాదంటూ వ్యాఖ్యానించారు. తమిళనాడు మార్పును కోరుకుంటోందని, తమ పార్టీలో అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. విజయ్‌కాంత్ సినిమాల్లోని పవర్ఫుల్ డైలాగులు చెబుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
'ఓటుకు లక్ష రూపాయలు అడగండి'
తిరునెల్వేలి: తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ సతీమణి, ఆ పార్టీ మహిళ విభాగం అధ్యక్షురాలు ప్రేమలతపై కేసు నమోదు చేశారు. తిరునెల్వేలిలో జరిగిన బహిరంగ సభలో ప్రేమలత మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్నా డీఎంకే, డీఎంకే పార్టీలు ఓట్ల కోసం డబ్బులు ఇస్తే తీసుకోవాలని ఓటర్లకు సూచించారు. 'కొన్ని పార్టీలు ఓటుకు రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఇస్తాయి. మీరు ఓటుకు లక్ష రూపాయలు అడగండి' అని ప్రేమలత ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారని పోలీసులు చెప్పారు. అన్నా డీఎంకే కార్యకర్తలు ఫిర్యాదు చేయగా, ప్రేమలత మాట్లాడిన వీడియో రికార్డింగ్‌లను పరిశీలించిన అనంతరం పోలీసులు ఆమెపై కేసు నమోదుచేశారు. తమిళనాడు ఎన్నికల్లో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌కాంత్ బరిలో దిగుతున్నారు. -
జయలలితకు కెప్టెన్ భార్య సవాల్
టీనగర్: ముఖ్యమంత్రి జయలలితకు డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ సతీమణి ప్రేమలత బహిరంగ సవాల్ విసిరారు. జయలలిత 234 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగలరా? అంటూ ప్రశ్నించారు. కాంచీపురంలో మహానాడు ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ప్రేమలత విలేకరులతో మాట్లాడారు. ఈ మహానాడులో విజయకాంత్ ప్రకటన కోసం రాష్ట్రం, దేశమే కాకుండా ప్రపంచమే ఎదురుచూస్తోందన్నారు. ఎంజిఆర్ వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని, అలా జయలలిత ఎందుకు కాలేకపోయారని వ్యంగ్యాస్త్రం సంధించారు. రెండుసార్లు ఓ.పన్నీర్ సెల్వంకు అధికారాన్ని అప్పజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్‌తో పొత్తు కోసం ఇంటి వాకిటికి రాయబారం పంపారన్నారు. గతంలో మొట్టమొదటి సారిగా అభ్యర్థుల జాబితా ప్రకటించారని, అయితే ఈ దఫా అలా చేయగలరా? అని ప్రశ్నించారు. ఆమెకు ధైర్యం ఉన్నట్లయితే ఆదివారమే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని సవాలు విసిరారు. -
మౌనం దేనికి అంగీకారమో?
కులదైవానికి కెప్టెన్ పూజలు మీడియా ఎదుట మౌనం చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ రానున్న ఎన్నికల్లో ఏదో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అది ఏమిటో అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. మంగళవారం తన కుల దైవం వీర చిన్నమ్మాల్ సన్నిధిలో సతీమణి ప్రేమలతతో కలిసి విజయకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. పొత్తు పై మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నల్ని సంధించినా, మౌన ముద్రతో ముందుకు సాగారు. డీఎండీకే అధినేత విజయకాంత్ ఎన్నికల ముందు కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదేని కీలక ప్రకటనలు చేయాలన్న ముందుగా తన కుల దైవం ఆలయాన్ని సందర్శించడం జరుగుతూ వస్తున్నది. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల్లో తన చుట్టూ రాజకీయం తిరుగుతుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై విజయకాంత్ మల్లగుల్లాలు పడుతున్నారని సమాచారం. ఓవైపు బీజేపీ, మరో వైపు డిఎంకే, ఇంకో వైపు ప్రజా కూటములు ఆహ్వానం పలికి ఉండటంతో ఏదో ఒక కూటమిని ఎంపిక చేసుకునేందుకు ఆయన సిద్ధమయ్యారని తెలిసింది. డిఎంకే కూటమి వైపుగా వస్తారన్న ప్రచారం ఉన్నా... ఆయన సతీమణి ప్రేమలత వ్యాఖ్యలు కొంత గందరగోళంలోకి నెట్టి ఉన్నాయి. బీజేపీ వైపుగా నడుస్తారా..? లేదా, ప్రజా కూటమిలో సీఎం అభ్యర్థిగా నేతృత్వ పగ్గాలు చేపడుతారా..? అన్న ప్రశ్న ఉత్పన్నమయింది.. ఈ సమయంలో తన నిర్ణయం ఏమిటో ప్రకటించేందుకు మహానాడు వేదికగా కాంచీపురంను ఎంపిక చేసుకున్న విజయకాంత్, అందుకు తగ్గ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈనెల 20వ తేదీన జరగనున్న ఈ మహానాడు ద్వారా కీలక ప్రకటన చేయడానికి ఆయన సిద్ధం అయ్యారని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే విధంగా మంగళవారం తన కుల దైవాన్ని దర్శించుకుని, మహానాడు ఆహ్వాన పత్రికకు పూజలు చేయడం గమనార్హం. కుల దైవానికి పూజలు : తన సతీమణి ప్రేమలతతో కలసి మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని కాంగేయంకు ఉదయం విజయకాంత్ చేరుకున్నారు. అక్కడ కొలువు దీరి ఉన్న తన కుల దైవం వీర చిన్నమ్మాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయంలోకి వెళ్లే సమయంలో మరొకరి సాయంతో ముందుకు సాగిన విజయకాంత్ పూజల అనంతరం మౌనంగా బయటకు వచ్చారు. మీడియా చుట్టుముట్టినా, ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ముందుకు సాగారు. అయితే, ప్రేమలత మాత్రం తమ కులదైవాన్ని సందర్శించే విషయం తెలిసిందేగా అని సమాధానం ఇచ్చి కదిలారు. తదుపరి శ్రీవిళ్లి పుత్తూరు అండాల్ అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన విజయకాంత్, తదుపరి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ ఆలయబాట తదుపరి ఆయన కీలక నిర్ణయం ప్రకటించడం ఖాయం. అయితే, ఆ నిర్ణయం ఏమిటో అన్న ఉత్కంఠ బీజేపీ, డీఎంకే, ప్రజా కూటమికి మరికొద్ది రోజులు తప్పదు. -
మౌనం దేనికి అంగీకారమో?
* కులదైవానికి కెప్టెన్ పూజలు * మీడియా ఎదుట మౌనం సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ రానున్న ఎన్నికల్లో ఏదో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అది ఏమిటో అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. మంగళవారం తన కుల దైవం వీర చిన్నమ్మాల్ సన్నిధిలో సతీమని ప్రేమలతతో కలిసి విజయకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. పొత్తు పై మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నల్ని సంధించినా, మౌన ముద్రతో ముందుకు సాగారు. డీఎండీకే అధినేత విజయకాంత్ ఎన్నికల ముందు కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదేని కీలక ప్రకటనలు చేయాలన్న ముందుగా తన కుల దైవం ఆలయాన్ని సందర్శించడం జరుగుతూ వస్తున్నది. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల్లో తన చుట్టూ రాజకీయం తిరుగుతుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న మల్లగుల్లాల్లో విజయకాంత్ పడి ఉన్నారు. ఓవైపు బీజేపీ, మరో వైపు డిఎంకే, ఇంకో వైపు ప్రజా కూటములు ఆహ్వానం పలికి ఉండటంతో ఏదో ఒక కూటమిని ఎంపిక చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. డిఎంకే కూటమి వైపుగా వస్తారన్న ప్రచారం ఉన్నా, ఆయన సతీమణి ప్రేమలత వ్యాఖ్యలు గందరగోళంలోకి నెట్టి ఉన్నాయి. బీజేపీ వైపుగా నడుస్తారా..? లేదా, ప్రజా కూటమిలో సీఎం అభ్యర్థిగా నేతృత్వ పగ్గాలు చేపడుతారా..? అన్న ప్రశ్న బయలు దేరి ఉన్నది. ఈ సమయంలో తన నిర్ణయం ఏమిటో ప్రకటించేం దుకు తగ్గ మహానాడుకు వేదికగా కాంచీపురంను ఎంపిక చేసుకున్న విజయకాంత్, అందుకు తగ్గ పనుల్లో బిజీగా నే ఉన్నారు. ఈనెల 20వ తేదీన జరగనున్న ఈ మహానా డుద్వారా కీలక ప్రకటన చేయడానికి ఆయన సిద్ధం అయ్యారని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే విధంగా మంగళవారం తన కుల దైవాన్ని దర్శించుకుని, మహానాడు ఆహ్వాన పత్రికకు పూజలు చేయడం గమనార్హం. కుల దైవానికి పూజలు : తన సతీమణి ప్రేమలతతో కలసి మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని కాంగేయంకు ఉదయం విజయకాంత్ చేరుకున్నారు. అక్కడ కొలువు దీరి ఉన్న తన కుల దైవం వీర చిన్నమ్మాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఆలయంలోకి వెళ్లే సమయంలో మరొకరి సాయంతో ముందుకు సాగిన విజయకాంత్ పూజల అనంతరం మౌనంగా బయటకు వచ్చారు. మీడియా చుట్టుముట్టినా, ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ముందుకు సాగారు. అయితే, ప్రేమలత మాత్రం తమ కులదైవాన్ని సందర్శించే విషయం తెలిసిందే గా అని సమాధానం ఇచ్చి కదిలారు. తదుపరి శ్రీవిళ్లి పుత్తూరు అండాల్ అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన విజయకాంత్, తదుపరి తిరుమల శ్రీవారి దర్శించుకునే ఏర్పాట్ల మీద పడ్డారు. ఈ ఆలయబాట తదుపరి ఆయన కీలక నిర్ణయం ప్రకటించడం ఖాయం. అయితే, ఆ నిర్ణయం ఏమిటో అన్న ఉత్కంఠ బీజేపీ, డీఎంకే, ప్రజా కూటమికి మరికొద్ది రోజులు తప్పదు.