మౌనం దేనికి అంగీకారమో?
* కులదైవానికి కెప్టెన్ పూజలు
* మీడియా ఎదుట మౌనం
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ రానున్న ఎన్నికల్లో ఏదో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అది ఏమిటో అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. మంగళవారం తన కుల దైవం వీర చిన్నమ్మాల్ సన్నిధిలో సతీమని ప్రేమలతతో కలిసి విజయకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. పొత్తు పై మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నల్ని సంధించినా, మౌన ముద్రతో ముందుకు సాగారు. డీఎండీకే అధినేత విజయకాంత్ ఎన్నికల ముందు కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదేని కీలక ప్రకటనలు చేయాలన్న ముందుగా తన కుల దైవం ఆలయాన్ని సందర్శించడం జరుగుతూ వస్తున్నది.
తాజాగా, అసెంబ్లీ ఎన్నికల్లో తన చుట్టూ రాజకీయం తిరుగుతుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న మల్లగుల్లాల్లో విజయకాంత్ పడి ఉన్నారు. ఓవైపు బీజేపీ, మరో వైపు డిఎంకే, ఇంకో వైపు ప్రజా కూటములు ఆహ్వానం పలికి ఉండటంతో ఏదో ఒక కూటమిని ఎంపిక చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. డిఎంకే కూటమి వైపుగా వస్తారన్న ప్రచారం ఉన్నా, ఆయన సతీమణి ప్రేమలత వ్యాఖ్యలు గందరగోళంలోకి నెట్టి ఉన్నాయి. బీజేపీ వైపుగా నడుస్తారా..? లేదా, ప్రజా కూటమిలో సీఎం అభ్యర్థిగా నేతృత్వ పగ్గాలు చేపడుతారా..? అన్న ప్రశ్న బయలు దేరి ఉన్నది.
ఈ సమయంలో తన నిర్ణయం ఏమిటో ప్రకటించేం దుకు తగ్గ మహానాడుకు వేదికగా కాంచీపురంను ఎంపిక చేసుకున్న విజయకాంత్, అందుకు తగ్గ పనుల్లో బిజీగా నే ఉన్నారు. ఈనెల 20వ తేదీన జరగనున్న ఈ మహానా డుద్వారా కీలక ప్రకటన చేయడానికి ఆయన సిద్ధం అయ్యారని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే విధంగా మంగళవారం తన కుల దైవాన్ని దర్శించుకుని, మహానాడు ఆహ్వాన పత్రికకు పూజలు చేయడం గమనార్హం.
కుల దైవానికి పూజలు : తన సతీమణి ప్రేమలతతో కలసి మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని కాంగేయంకు ఉదయం విజయకాంత్ చేరుకున్నారు. అక్కడ కొలువు దీరి ఉన్న తన కుల దైవం వీర చిన్నమ్మాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఆలయంలోకి వెళ్లే సమయంలో మరొకరి సాయంతో ముందుకు సాగిన విజయకాంత్ పూజల అనంతరం మౌనంగా బయటకు వచ్చారు. మీడియా చుట్టుముట్టినా, ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ముందుకు సాగారు.
అయితే, ప్రేమలత మాత్రం తమ కులదైవాన్ని సందర్శించే విషయం తెలిసిందే గా అని సమాధానం ఇచ్చి కదిలారు. తదుపరి శ్రీవిళ్లి పుత్తూరు అండాల్ అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన విజయకాంత్, తదుపరి తిరుమల శ్రీవారి దర్శించుకునే ఏర్పాట్ల మీద పడ్డారు. ఈ ఆలయబాట తదుపరి ఆయన కీలక నిర్ణయం ప్రకటించడం ఖాయం. అయితే, ఆ నిర్ణయం ఏమిటో అన్న ఉత్కంఠ బీజేపీ, డీఎంకే, ప్రజా కూటమికి మరికొద్ది రోజులు తప్పదు.