అయితే, ప్రేమికులు ఎక్కువగా వస్తారులే!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల రేసులో తానూ ఉన్నానని పీఎంకే యువజన నేత, ఎంపీ అన్బుమణి వెల్లడించారు. ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధం అవుతోన్నట్టు తెలిపారు. తనయుడు, పార్టీ యువజన నేత అన్బుమణిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఓ కూటమిని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగని అన్బుమణి, ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఆ అనుభవాన్ని ఎదుర్కోక తప్పలేదు. ధర్మపురి నుంచి బరిలో దిగి, చివరి క్షణంలో సామాజిక వర్గం ఓట్లతో గట్టెక్కి ఎంపీగా పార్లమెంట్ మెట్లు ఎక్కారు. రాజ్య సభ పదవులతో కాలం నెట్టకొచ్చిన అన్బుమణి తొలి సారిగా ఎన్నికల్లో గెలవడం పీఎంకే వర్గాలకు ఆనందమే.
తాజాగా ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో మార్పు తమతో అన్న నినాదాన్ని అందుకుని ప్రజల్లోకి దూసుకెళ్లే పనిలో పడ్డారు. గతంలో వలే మార్చి మార్చి కూటముల్లోకి దూరకుండా, ఈసారి తమ నేతృత్వంలోనే కూటమి ప్రకటించుకుని ప్రజాకర్షణ దిశగా ఉరకలు తీస్తున్నారు. సీఎం అభ్యర్థి రేసులో తాను ఉన్నానని, తాను తప్పకుండా అధికార పగ్గాలు చేపట్టి తీరుతానన్న ధీమాతో ప్రజల్లో చొచ్చుకు వెళ్లే పనిలో పడ్డ అన్భుమణి రాందాసు, ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధం అని ప్రకటించారు.
మంగళవారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం లక్ష్యంగా పీఎంకే శ్రమిస్తున్నదని, రాష్ట్రంలో మార్పు అన్నది తమతోనే సాధ్యమన్న విషయాన్ని ప్రజలు గుర్తించి ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో అన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని, వారు సూచించే స్థానం నుంచి బరిలో దిగి భారీ అధిక్యంతో గెలవడమే కాదు, అధికార పగా్గాలు చేపట్టి తీరుతామన్న ధీమాను వ్యక్తం చేశారు. ధర్మపురి నుంచే బరిలోకి దిగుతారా..? అని ప్రశ్నించగా, అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడే అని స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం కదా..? ఆరోజున మహానాడుకు పిలుపు నిచ్చారేమిటో అని ప్రశ్నించగా..? అవునా...ప్రేమికుల దినోత్సవమా..!. అయితే, ప్రేమికులు ఎక్కువగా వస్తారులే అని చమత్కరించి ముందుకు సాగారు. అసెంబ్లీలో తొలి సారిగా అన్భుమణి అడుగు పెట్టిన పక్షంలో, ఎంపీ పదవికి రాజీనామా చేయక తప్పదేమో..!. ఈ దృష్ట్యా, ధర్మపురికి మళ్లీ ఉప ఎన్నిక వచ్చేనా?, లేదా అధికారం చే జిక్కని పక్షంలో ఎంపీ పదవే బెస్ట్ అని, ఎమ్మెల్యే పదవిని వదులుకునేనా..?అన్నది వేచి చూడాల్సిందే.
నేటి నుంచి దరఖాస్తుల పర్వం : పీఎంకే తరఫున ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు నిర్ణయించారు. బుధవారం నుంచి ఈ పర్వం ఆరంభం కానున్నది. రూ.ఐదు వేలు చెల్లించి దరఖాస్తును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుల్ని విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని తైలాపురం ఎస్టేట్‌లో ఉన్న పీఎంకే కార్యాలయంలో స్వీకరించాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం పది నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు దరఖాస్తులు స్వీకరించవచ్చు. ఫిబ్రవరి ఐదో తేదీ చివరి గడవు.